అందుకే ఆయన్ని రాజకీయ చతురుడు అంటారు..! ఎక్కడ విమర్శించాలో కాదు… ఎక్కడ విశ్రమించాలో కూడా ఆయనకు బాగా తెలుసు. ఆయనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్! ఈ మధ్య ఆయన విమర్శలు తగ్గించారు… గమనించారా..? అలాగే, హామీలు పెంచారు.. ఇదీ గమనించారా..? ఇదే కేసీఆర్ మార్కు రాజకీయం. ప్రజలను ఎప్పుడూ తనవైపు, తనకు అనుగుణంగా ఉండే అభిప్రాయాన్ని ప్రోది చేసుకోవడంలో కేసీఆర్ సిద్ధహస్తుడు అని చెప్పడానికి తాజా పరిణామాలే సాక్ష్యం. త్వరలోనే తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ తరుణంలో కేసీఆర్ వరుసగా వరాలు ఇచ్చుకుంటూ పోతున్నారు. బడ్జెట్‌పై ఈ వరాల జల్లుల భారం ఎంత ఉంటుందనేది వేరే చర్చ. కాకపోతే, ఈ అవకాశాన్ని ఇమేజ్ మేనేజ్‌మెంట్ కోసం చక్కగా వినియోగించుకుంటున్నారు.
గడచిన నెలరోజుల్లో తెరాస చాలారకాలుగా విమర్శల పాలయ్యింది. నిరుద్యోగుల శాంతి ర్యాలీ అంటూ కోదండరామ్ ఉద్యమించడం, ఆయన్ని అరెస్టు చేయడం.. ఈ నేపథ్యంలో కేసీఆర్ చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. తెలంగాణ వచ్చాక యువతకు ఆయన చేసిందేం లేదన్నది మరోసారి తెరమీదికి వచ్చింది. ఇదే తరుణంలో రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత ఒక స్థాయిలో మొదలైందని కేసీఆర్ కచ్చితంగా గ్రహించే ఉంటారు. ఇంకోపక్క.. తిరుపతికి వెళ్లిన కేసీఆర్ రూ. 5 కోట్ల ప్రజాధనంతో స్వామివారికి ఆభరణాలు ఇవ్వడం కూడా విమర్శలకు దారి తీసింది. వ్యక్తిగతమై ఉండాల్సిన భక్తి విశ్వాసాల కోసం రాష్ట్ర ఖజానా సొమ్ము వాడుకోవడం సరికాదన్న అభిప్రాయమూ బాగా వ్యక్తమైంది. విమర్శలు కూడా మిన్నంటాయి.
ఇంకోపక్క.. కాంగ్రెస్ పార్టీ జన ఆవేదన సభలు పెడుతూ విమర్శలు గుప్పిస్తోంది. వెయ్యి రోజుల కేసీఆర్ సర్కారు సాధించింది ఏముంది అంటూ కాంగ్రెస్ నేతలు దుమ్ము రేపుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటూ సర్వే లెక్కల్ని బయటపెట్టారు. మొత్తంగా ఇదంతా కేసీఆర్ సర్కారుపై అన్ని కోణాల నుంచి మొదలైన ప్రజా వ్యతిరేకతకు ప్రథమ దశ అని చెప్పొచ్చు. సో… దీన్ని ఇక్కడితోనే ఫుల్‌స్టాప్ పెట్టాలంటే… మళ్లీ ప్రజలని డైవర్ట్ చేయాలి. మాకు కేసీఆర్ చాలా చేస్తున్నారే అనే ఇమేజ్ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఆయన చేస్తున్నదీ అదే..!
అంగన్‌వాడీ టీచర్లకూ సహాయకులకూ భారీగా జీతాలు పెంచేశారు. రెండు లక్షల గొర్రెల యూనిట్లూ చేపల యూనిట్లూ పెట్టేద్దాం అంటున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలను ఎంకరేజ్ చేయడం షురూ అంటున్నారు. నవజాత శశువులకు కేసీఆర్ కానుకలు ఇచ్చేద్దాం అంటున్నారు. బలహీన వర్గాల బ్యాంకు అప్పులు రద్దు అంటున్నారు. ఇంకా చాలాచాలా చేయాలంటున్నారు. ఇవన్నీ ఏప్రిల్ నుంచే అమలు జరిగిపోవాలని ఆదేశిస్తున్నారు.
ప్రజలకు మేలు చేకూర్చే పథకాలనుగానీ, కార్యక్రమాలనుగానీ చేపట్టడం ఎవ్వరూ తప్పుబట్టరు. కానీ, వీటిని కూడా కేవలం రాజకీయ ప్రయోజనాల కోణం నుంచి ఆలోచిస్తూ… పొలిటికల్ ఇమేజ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా అమలు చేస్తున్న తీరు విమర్శలకు కారణమౌతుంది. నిజానికి, ఇవి కూడా కంటితుడుపు చర్యలే. తెలంగాణలో కావల్సినవి కొత్త ఉద్యోగాలు… కొత్త నోటిఫికేషన్లు. వాటి జోలికి వెళ్లకుండా.. సామాన్యులను ఎట్రాక్ట్ చేయడం, ఆ లేయర్‌లో అసంతృప్తిని పెరగకుండా చేయడమే కేసీఆర్ తాజా వ్యూహంగా కనిపిస్తోంది.