హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూర్తిగా తమ రాజధానికి షిఫ్ట్ అవబోతున్నారు. ఈనెల 9 వ తేదీన కుటుంబసమేతంగా విజయవాడ సమీపంలో – కృష్ణానదీ తీరంలో ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్‌లోకి మారుతున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఇప్పటికే అక్కడ పూజచేసి గృహప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఫర్నిచర్ తరలింపుకూడా ఇటీవల పూర్తయింది.
మరోవైపు పలు ప్రభుత్వ కార్యాలయాలుకూడా వరుసగా విజయవాడకు తరలుతున్నాయి. జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలోని ఏ, సీ సెక్షన్‌లు తరలింపు పూర్తయింది. ప్రొటోకాల్ సెక్షన్‌లో సగం సిబ్బంది తరలివెళ్ళారు. మిగిలిన సగంమందీ త్వరలోనే తరలివెళ్ళనున్నారు. సీఎమ్ రిలీఫ్ పండ్ సిబ్బందిని విజయవాడకు బదిలీ చేశారు. రేపో, మాపో వారు వెళ్ళనున్నారు.
అయితే హైదరాబాద్‌లోని జుబ్లీహిల్స్‌లో చంద్రబాబు ప్రస్తుతం ఒక ఇంటిని నిర్మిస్తున్నారు. మరి ఆ ఇల్లు నిర్మాణం పూర్తయితే అక్కడ ఎవరు ఉంటారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ హైదరాబాద్ ఇంటిలో కొన్నాళ్ళు, విజయవాడలో కొన్నాళ్ళు ఉంటారేమో!