మనవాళ్లయితే ఒకలా.. పరాయి అయితే మరోలా… ఇదే ధోరణి అడుగడుగునా తెలుగు మీడియాలోని ఒక వర్గంలో ఎప్పటికప్పుడు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. మీడియా ప్రజల పక్షాన ఉండాలి. ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పుకుంటాం. కానీ, ఆంధ్రాలో ఒక వర్గం మీడియా అధికార పార్టీకి ఏ స్థాయిలో కొమ్ము కాస్తుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయాంశాల్లో వారు ఎలా వ్యవహరించినా ప్రజలు పెద్దగా పట్టించుకోరు. కనీసం మానవీయ అంశాల విషయంలో కూడా అదే రాజకీయ పక్షపాత బుద్ధిని అనుసరిస్తే ఎలా..? కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు ప్రమాదం విషయంలో సదరు మీడియా అనుసరిస్తున్న వైఖరి ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
బస్సు ప్రమాదానికి గురై 10 మందికిపైగా మరణించిన సంగతి తెలిసిందే. ఇది అత్యంత విషాధకరమైన సందర్భం. మీడియాలో ప్రమాద ఘనటను యథాతథంగా కథనాలు ప్రసారం చేశారు. అయితే, ఈ ప్రమాదానికి కారణమైన దివాకర్ ట్రావెల్స్ గురించి ఎక్కడా ప్రముఖంగా కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. చిత్రం ఏంటంటే.. కొన్ని ఛానెల్స్‌లో అయితే ఏ ట్రావెల్స్‌కు చెందిన బస్సో కూడా చెప్పకుండా.. ప్రమాదంపై మాత్రమే ఫోకస్ పెట్టారు. ప్రమాదం ఎలా జరిగిందో ఇదంతా రొటీన్ వ్యవహారంగా ఇతర మీడియా రాసేసింది. అయితే… ఇదే దివాకర్ ట్రావెల్స్ విషయంలో గతంలో ఈ మీడియా అనుసరించిన వైఖరికి ఒక్కసారి గుర్తు చేసుకుంటే ముక్కున వేలేసుకోవాల్సి వస్తుంది!
గతంలో, అంటే 2013లో మహబూబ్‌నగర్ జిల్లా పాలెంలో జరిగిన దుర్ఘటన గుర్తుండే ఉంటుంది. పాలెం జాతీయ రహదారిపై ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతి అయింది. అత్యంత హృదయవిదారకరమైన ఈ ఘటనలో దాదాపు 44 మంది సజీవదహనం అయిపోయారు. ఈ బస్సు దివాకర్ ట్రావెల్స్‌కు చెందిందే అంటూ అప్పట్లో చాలా ఆరోపణలు వినిపించాయి. అయితే, ఆ బస్సులను జబ్బార్ ట్రావెల్స్‌కు విక్రయించారనీ, జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీతో సంబంధం లేదని కూడా వారు వాదించారు. ఈ తరుణంలో రెండు ట్రావెల్స్ కంపెనీలపైనా కేసులు నమోదు అయ్యాయి.
ఆ సందర్భంలో సదరు మీడియా వారు ఏం చేశారంటే.. నెలల తరబడి దివాకర్ ట్రావెల్స్‌పై కథనాలు అచ్చే వేశారు. జేసీ కుటుంబంపై చర్యలు ఏవీ అంటూ కొన్నాళ్లపాటు రచ్చ రచ్చ చేశారు. నాడు అంతగా గొంతుచించుకున్న జేసీ కుటుంబంపై నేడు ఎందుకిలా వ్యవహరిస్తున్నారూ అంటే… సింపుల్, అప్పట్లో ఆయన కాంగ్రెస్‌లో ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చేశారు. ఎంపీ అయ్యారు. చంద్రబాబు పక్కకు చేరిపోయారు. చంద్రబాబు పక్కన ఎవరుంటే… వారంతా తమ ప్రియతములుగా సదరు మీడియా భావిస్తుందని ప్రత్యేకంగా చెప్పాలా.! తాజా ప్రమాదం విషయంలో కూడా జరుగుతున్నది ఇదే. ఇప్పుడు చూడండీ… జేసీ సంస్థపై ఎలాంటి రాద్దాంతమూ ఉండదు. ఓ నాలుగైదు రోజుల్లో మొత్తం వ్యవహారం లోపలి పేజీల్లో సింగిల్ కాలమ్స్‌కి వెళ్లిపోతుంది. ఆ తరువాత అక్కడి నుంచి కూడా గాయబ్..!