చిరంజీవి 151వ చిత్రంగా ఉయ్యాల వాడ నరసింహారెడ్డి కథ ప్రచారంలో ఉంది. చిరంజీవికి ఈ కథపై ఎప్పటి నుంచో మక్కువ. పరుచూరి బ్రదర్స్ సైతం పూర్తి స్థాయిలో స్క్రిప్టు తయారు చేశారు. దర్శకుడు సురేందర్ రెడ్డి, నిర్మాతగా చరణ్ కూడా రెడీనే. మరి ఈ సినిమా ఎందుకు ఆలస్యం అవుతోంది?? చిరు 151వ చిత్రం ఇదే అంటూ అఫీషియల్‌గా ఎనౌన్స్ మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు..? దీనికి గల కారణాలేంటి..??
తెలుగు 360కి తెలిసిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం…. ఉయ్యాల వాడ నరసింహారెడ్డికి ఆల్రెడీ స్క్రిప్టు రెడీగా ఉన్నా.. అందులో మార్పులు, చేర్పులకు సమయం పడుతోందట. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం పరుచూరి వారు రాసిన కథ ఇది. అప్పటికీ ఇప్పటికీ ట్రెండ్ మారింది. స్క్రీన్ ప్లే విషయంలో తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని కథ, కథనాలలో మార్పు చేయాలని చిరు సూచించాడట. అంతేకాదు.. ఉయ్యాల వాడ నరసింహారెడ్డికి చెందిన చరిత్రని ఇంకాస్త క్షుణ్నంగా పరిశీలించాలని, చరిత్ర కారులు సినిమా చూసి తప్పుపట్టకూడదని చిరు భావిస్తున్నాడట. ప్రస్తుతం ఉయ్యాలవాడకు సంబంధించిన రిసెర్చ్ వర్క్ జరుగుతోందని, ఆ పని అయ్యి, స్క్రిప్టు పూర్తయ్యే సరికి చాలా టైమ్ పట్టే అవకాశాలున్నాయని, ఈలోగా చిరు మరో సినిమా చేసే అవకాశాలు కొట్టి పారేయలేమని చిరు కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి. సో.. చిరు 151వ సినిమా విషయంలో కొన్ని మార్పులు చూసే అవకాశం ఉందన్నమాట.