పదకొండు మంది మనుషులు చనిపోయారు. ముఫ్పై మందికి పైగా క్షతగాత్రులు. కచ్చితంగా చిన్న విషయం అయితే కాదు. మన ఇంటి మనుషులు అయితే అప్పుడు ఆ బాధ తెలుస్తుంది. నాయకుడనేవాడు ఎవడైనా కూడా ప్రజలందరినీ కూడా తన ఇంటి మనుషులుగానే చూడాలి. ఓట్లు అడుక్కోవడానికి వచ్చినప్పుడు మన నాయకులు కూడా అదే అర్థం వచ్చేలా మాట్లాడుతూ ఉంటారు. అక్కచెల్లెమ్మలకు, అన్నాతమ్ములకు అని సంభోదిస్తూ ఓటర్లందరికీ నేను బంధువునే అని ఓటర్లను నమ్మించడం కోసం సెంటిమెంట్‌ని రంగరిస్తూ ఉంటారు. మరి అలాంటి సొంత మనుషులు చనిపోతే మన నాయకుల స్పందన ఏంటి? వంద కోట్ల రూపాయలతో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నా సరే….భారీ బహిరంగ సభ నిర్వహించి ఓ రోజు మొత్తం అందుకోసం కేటాయించడం చంద్రబాబు స్టయిల్. అలాంటి చంద్రబాబు ప్రమాద స్థలానికి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ పరామర్శించడానికి మాత్రం రాలేదు. ప్రమాదానికి కారణమైన బస్సు జెసి బ్రదర్స్‌ది కాకుండా జగన్‌కి చెందినది అయితే చంద్రబాబు ఓవర్ యాక్షన్ ఏ రేంజ్లో ఉండేదో ఊహించుకోవచ్చు. కానీ జెసి దివాకర్‌రెడ్డి ఇప్పుడు చంద్రబాబుకు సొంత మనిషి. అందునా చంద్రబాబు భజన బృందంలో మొదటి స్థానం కోసం పోటీపడుతున్నవాడు. అందుకే బాధితులకు హ్యాండ్ ఇచ్చి పూర్తిగా జెసి పక్షం వైపు నిలబడ్డాడు చంద్రబాబు. ప్రమాదం గురించి స్పందించడానికి, బాధితుల తరపున మాట్లాడడానికి చంద్రబాబుకు టైం దొరకలేదు కానీ జగన్‌ని తిట్టడానికి మాత్రం చంద్రబాబుకు టైం దొరికింది. జగన్ మానసిక స్థితి ఏంటో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి చంద్రబాబు మాట్లాడిన మాటలను పరిశీలిస్తే….అసలు చంద్రబాబు మానసిక స్థితి గురించే అనుమానాలు రావడం ఖాయం. ప్రమాదం జరిగిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలు అన్నీ కరెక్ట్‌గానే తీసుకున్నారా? పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఎక్కడా? డ్రైవర్స్ మంది తాగి ఉన్నారా? లేదా? అనే విషయం పరిశీలించారా? బస్ పర్మిట్ సవ్యంగానే ఉందా? అని అధికారులను నిలదీశాడు జగన్. అక్కడ ఆవేశపడిపోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మాత్రం కచ్చితంగా జగన్ చేసిన తప్పే. కానీ జగన్ అధికారులను నిలదీయడంలో తప్పులేదు. ఇప్పుడు ఆ విషయం గురించి స్పందించిన చంద్రబాబు….యాక్సిడెంట్‌కి పోలీసులకు ఏం సంబంధం? కలెక్టర్‌కి ఏం సంబంధం? వాళ్ళను నిలదీయడమేంటి? అని ప్రశ్నిస్తున్నాడు. మరి బాధితులు ఎవరిని ప్రశ్నించాలి? బాధితులకు ఎవరు న్యాయం చేయాలి? బస్సు జెసి బ్రదర్స్‌ది కాబట్టి….ఖర్మ కొద్దీ మాకు ఇలా జరిగింది అని చెప్పి బాధితులందరూ సైలెంట్‌గా ఉండిపోవాలా? ప్రపంచానికి పాఠాలు చెప్పా….అత్యంత అనుభవజ్ఙుడిని అని చెప్పుకునే చంద్రబాబుకు పరిపాలనపైన ఉన్న అవగాహన ఇంతేనా?
ఇక 2014లో చంద్రబాబుకు మద్ధతునిచ్చి …చంద్రబాబుని గెలిపించిన పవన్ కూడా షరా మామూలుగా చంద్రబాబులానే స్పందించాడు. బాధితులను పరామర్శిస్తే ఎక్కడ బాబు ఇబ్బంది పడతాడని అనుకున్నాడో ఏమో కానీ ఒక ట్వీట్‌తో సరిపెట్టేశాడు. ప్రత్యేక హోదా విషయంలో కూడా వెంకయ్యనాయుడులాంటి వాళ్ళను తీవ్రంగా విమర్శించే పవన్…..హోదా అవసరం లేదు…ప్యాకేజ్ చాలు అని చెప్పిన చంద్రబాబును మాత్రం ఏమీ అనడు. చంద్రబాబు అంటే పవన్‌కి భయమో…లేక వారిద్దరి మధ్య ఉన్న రాజకీయ బంధం ఏంటో తెలియదు కానీ పదకొండు మంది ప్రాణాలు తీసిన ప్రమాదం, ముఫ్పైమందికి పైగా క్షతగాత్రలయిన ప్రమాదం గురించి పవన్ స్పందించిన విధానం మాత్రం గర్హనీయం. ఎవరైనా మనుషులు చనిపోయినట్టుగా పేపర్లో వార్తను చూస్తేనే తనకు చాలా బాధ కలుగుతుందని ఆ మధ్య ఓసారి తన గురించి తాను చెప్పుకున్నాడు పవన్. మరి ఇప్పుడు బాధ కలగలేదా? బాధితులను ఓదార్చాలని అనిపించలేదా? బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని అనిపించలేదా? టిక్కెట్ రేట్లతో ప్రయాణికులను దోచుకుతింటున్న ట్రావెల్స్ వాళ్ళు ప్రమాద బాధితులకు న్యాయం చేయాల్సిందే అని డిమాండ్ చేయాలన్న స్పృహ పవన్‌కి లేకుండా పోయిందా? అస్తమానూ ప్రజల గురించే ఆలోచిస్తుంటా అని చెప్పే పవన్‌కి ఇప్పుడు ఆ ప్రజల కంటే చంద్రబాబుకు సన్నిహితులు అయిన జెసి బ్రదర్సే ఎక్కువయ్యారా? సాహిత్యాన్ని ఎక్కువగా చదివితే మాటలు బ్రహ్మాండంగా వస్తాయి. ఆ మాటలతో ఎవరినైనా ఇంప్రస్ చేసే సామర్థ్యం వస్తుంది. కానీ చేతల్లో పనితనం చూపించాలంటే….బలవంతులకు వ్యతిరేకంగా బాధితుల తరపున పోరాడాలంటే మాత్రం గట్స్ ఉండాలి. ప్రాణాలైనా ఇచ్చేస్తా అని చెప్పినంత తేలికకాదు……..ప్రజల తరపున పోరాడడమంటే. కేవలం గొప్పగా మాటలు చెప్తూ రాజకీయాలు చేసేవాళ్ళు ఇప్పటికే చాలా మంది ఉన్నారు. బాధితుల తరపున కనీసం మాట్లాడే ధైర్యం కూడా లేని ఓ కొత్త రాజకీయ నాయకుడు ఇంకొకరు అవసరం లేదేమో.