తెలుగు సినీ పరిశ్రమ చాలా కాలంగా ఎదురుచూస్తున్న నంది అవార్డుల జాబితా బయటికి వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత డైలామాలో పడిన నంది అవార్డుల కార్యక్రమం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. రెండు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ తెలుగు సినీ పరిశ్రమ ఒక్కటిగానే వెళుతున్న నేపధ్యంలో ఏ తెలుగు రాష్ట్రం ఈ ఆవార్డులు ఇవ్వడానికి ముందుకు వస్తుందో అన్న డైలామా నడిచింది. చివరికి రెండు రాష్ట్రాలు విడివిడిగా అవార్డుల ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ అవార్డుల పేరు మార్చి ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. కాగా, ఏపీ సర్కార్ మాత్రం నంది అవార్డుల పేరుతోనే ఈ రోజు 2012, 2013 గాను నంది అవార్డుల విజేతల వివరాలు ప్రకటించింది. అయితే ఈ అవార్డుల జాబితాలో 2013 గాను ఉత్తమ చిత్రంగా ‘మిర్చి’ చిత్రాన్ని ఎంపిక చేయడం ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చనీయంశమైయింది. ఉత్తమ చిత్రం మిర్చినా ? అదెలా అనే ప్రశ్న ఉత్పన్నమౌతుందిప్పుడు.
జనరల్ గా కమర్షియల్ చిత్రాలు అవార్డు ఇవ్వడం తక్కువ. క్రిటిక్స్ మెప్పుపొందిన చిత్రాలు అవార్డులకు ఎక్కువగా ఎంపిక అవుతుంటాయి. ఈ పాయింట్ తీసుకుంటే ‘మిర్చి’ పక్కా కమర్షియల్ ఫార్ముల సినిమా. గొప్ప కధేం కాదు. ఊరి కోసం హీరో నిలబడటం,హీరోయిజం ఎలివేట్ చేసే బిల్డప్పులు, విలన్ ని బకరా చేసి ఆ ఇంట్లోకి వెళ్ళడం, అక్కడ మనుషుల్ని మార్చేయడం.. ఇదంతా పరమ రొటీన్ వ్యవహారం. స్వయంగా దర్శకుడు కొరటాల శివ ఈ విషయాన్ని అంగీకరించాడు. ”మిర్చి కొత్త కధ కాదు. తెలిసిన కధనే కొంచెం డిఫరెంట్ గా చూపించాను” అని ఓపెన్ గానే ఒప్పుకున్నాడు. అలాంటి మిర్చికి ఇప్పుడు ఉత్తమ చిత్రం కేటగిరీలో అవార్డ్ రావడం గమనార్హమే.
అదే ఏడాది వచ్చిన ”నా బంగారు తల్లి” సినిమా గురించి చెప్పుకుందాం. దేశ విదేశాల్లో ప్రసంశలు అందుకుందీ సినిమా. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ తెలుగు కేటగిరీలో నేషనల్ అవార్డ్ అందుకుంది. ట్రినిటీ ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు, ఇండోనేషియన్ ఫిల్మ్ ఫెస్ట్, బీజింగ్ ఇంటర్ నేషనల్, ఏసియన్ పెసిపిక్ స్క్రీన్ అవార్డ్, ఇండియన్ ఫిల్మ్ ఫెస్ట్, కొల్కత్తా ఇంటర్ నేషనల్.. ఇలా చాలా చోట్ల ఈ సినిమాకి అవార్డులు రివార్డులు దక్కాయి. అయితే ఇంతటి విశేషం వున్న ఈ సినిమాకి మాత్రం ఉత్తమ రెండో చిత్రంతో సరిపెట్టేశారు నంది కమిటీ సభ్యులు.
కమర్షియల్ చిత్రాలు అవార్డులు ఇవ్వకూడదనే నిబంధన ఏమీ లేదు. అయితే మిర్చి లాంటి రొటీన్ సినిమాని ఎంపిక చేయడం చర్చకు తావిచ్చింది. ఆ విషయానికి వస్తే.. అదే ఏడాది పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ”అత్తారింటికి దారేది”లో మిర్చి కంటే ఒరిజినల్ కంటెంట్ వుందనే అభిప్రాయం వ్యక్తమౌతుంది. మిర్చికి మించి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది అత్తారింటికి దారేది. మిర్చితో పోలిస్తే హింస కూడా తక్కువే. అయితే ఈ చిత్రాన్ని మాత్రం ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం పేరుతో సరిపెట్టేశారు. దీంతో ఉత్తమ చిత్రం అవార్డు ఇవ్వడానికి అసలు ఎలాంటి కొలమానాలను,ప్రమాణాలు తీసుకున్నారు అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
మిర్చి రిలీజ్ అయిన తర్వాత చాలా రొటీన్ కధ కదా ? అనే కామెంట్లు వినిపించాయి. శ్రీనువైట్ల ఫార్ముల, వీరు పొట్ల బిందాస్.. ఇలా చాలా కంపేరిజన్లు వచ్చాయి. దర్శకుడు కొరటాలశివ దగ్గర ఇదే విషయాన్ని ప్రస్తావితే.. ఆయనా అంగీకరించారు. ”వున్న కధనే డిఫరెంట్ ట్రీట్ మెంట్ తో తీశా” అని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఇపుడు అదే సినిమాకి నంది అవార్డు వచ్చేయడం బహుసా మిర్చి టీం కూడా ఉహించివుండదేమో.