రాజకీయాల్లో ప్రత్యర్థుల తప్పిదాలే వరాలుగా మారిపోవడం చాలా సార్లు జరుగుతుంటుంది. తప్పో ఒప్పో తమపైన ఒక ముద్ర పడిన తర్వాత ఆ ఇమేజ్ పోగొట్టుకోవడం కన్నా విమర్శలు బేఖాతరు చేస్తూ దాన్ని కాపాడుకోవడమే మెరుగని చాలా మంది భావిస్తుంటారు. తెలుగుదేశం ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడుకూ ప్రతిపక్షవైసీపీ నేత జగన్‌కూ మధ్యన నడిచేది అలాంటి వ్యూహాత్మక పోరాటమే.జగన్‌పైన కేసులను గురించి నిరంతరం మాట్లాడ్డం, ఆయన నచ్చినట్టే చేస్తాడుతప్ప ఎవరినీ లెక్క పెట్టడని, దుందుడుకుగా వుంటాడని ప్రజలకు చెప్పడం తెలుగుదేశం లక్ష్యం. రాజధాని భూ సేకరణ సమస్య అయినా, ప్రత్యేక ప్యాకేజీ ప్రహసనమైనా శాసనసభలో దూషణ పర్వమైనా వారు ఇదే ఎత్తుగడ అనుసరిస్తుంటారు. దీన్ని పదేపదే వారు ప్రయోగిస్తున్నా జగన్ కూడా తన వ్యవహార శైలిని మార్చుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన సరైన సమయంలో అసలైన సమస్యలు లేవనెత్తినా జోక్యం చేసుకున్నా దూకుడుగా కొన్నిసార్లు అసహనంగా వ్యవహరించడం వల్ల అవతలివారి ప్రచారాలకు మేత ఇచ్చినట్టవుతుంది. ప్రత్యేక హౌదా విషయమై విశాఖలో ర్యాలీకి ఆయన వెళ్లబోతే విమానాశ్రయం రన్‌వేపై అరెస్టు చేయడం అప్రజాస్వామికంత. దానిమీద బైఠాయింపు చేయడం కూడా బాగానే వుంది. కాని ఆ సందర్భంలో అధికారులతో వాగ్వాదం, నేను ముఖ్యమంత్రిని అన్నట్టు మాట్లాడ్డం వివాదానికి కావలసిన సామగ్రి సమకూర్చాయి.
దివాకర్ ట్రావెల్స్ ప్రమాదం చాలా ఘోరమైంది. బాధితులను సందర్శించడానికి మృతుల కుటుంబాలను ఓదార్చడానికి వెళ్లడం ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యతే. ఆయన పర్యటనకు తగు ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత ప్రభుత్వానిది. కాని అక్కడ తెలుగుదేశం నేతలు జగన్ గ్యోబాక్ అని నినాదాలివ్వడం విడ్డూరం. పోస్టు మార్టం నివేదిక పొందడానికి, రెండవ డ్రైవర్ వున్నాడో లేదో తెలుసుకోవడానికి జగన్ గట్టిగా వెంటపడటం కూడా పొరబాటు కాదు. అయితే అది జిల్లా కలెక్టర్ బాబుతో వివాదంగా మారనివ్వడం, ఆ పైన పోలీసుల నుంచి కలెక్టర్ వరకూ అందరూ అవినీతి పరులేనంటూ సెంట్రల్ జైలుకుపోతారని బెదిరించడం సరిగ్గా లేవు. దీని ఫలితమేమంటే ఇప్పుడు చర్చ బస్సు ప్రమాదం నుంచి జగన్ ప్రవర్తనపైకి మరలింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు ఆయన మంత్రులూ టిడిపి నేతలూ వరుసకట్టి ఈ విషయాలే వివాదగ్రస్తం చేసే వీలు కలిగింది. టిడిపి మాత్రమే గాక ఐఎఎస్‌లు రెవెన్యూ అధికారుల సంఘాలు కూడా జగన్‌ను తప్పు పడుతున్నాయి. తెలుగుదేశం వ్యూహాత్మక దాడి అయినా సరే ఇందుకు అవకాశం ఇవ్వడంలో జగన్ బాధ్యత కూడా తక్కువ కాదు. బహుశా రేపు శాసనసభ సమావేశాల్లోనూ ఈ ఘర్సణ మరింత తీవ్రంగా ప్రతిబింబిస్తుంది. మళ్లీ సమస్యలపై చర్చ వెనక్కు పోతుంది. ఏ ప్రభుత్వానికైనా అంతకంటే కావలసిందేమిటి?
ప్రభుత్వం ప్రజాస్వామికంగా వుండాలనీ, ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వాలని నేనెప్పుడూ చెబుతూనే వుంటాను. అయితే మరోవైపున ప్రతిపక్షనేత కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటే వెంటనే వైసీపీ కార్యకర్తలూ మరీ ముఖ్యంగా జగన్ భక్తులు విరుచుకుపడతారు. తెలుగుదేశంతో కలిపి శాపనార్థాలు పెడతారు. దాని వల్ల నాలాటి వాడికి వచ్చే నష్టం లేదు. వాస్తవికంగా చెప్పవలసింది ఆపేదీ లేదు. కాని ప్రతిపక్షంలో వైసీపీ ఒక్కటే వుండటం వల్ల,దానికి జగన్ ఒక్కరే నాయకుడు కావడం వల్ల ఆయన చుట్టూ ఎప్పుడూ వివాదాలూ దాడులూ ఎదురుదాడుల పరంపర వాతావరణం కలుషితం చేస్తుంది.తనను తెలుగుదేశం ఎంత తిడితే అంత మేలని జగన్ అనుకోవచ్చు.ఆయన హార్డ్‌కోర్ అభిమానులకూ అది సంతోషం కలిగించవచ్చు.కాని ఈ నిరర్థక నిరంతర వివాదాలు దూషణలతో ప్రజాస్వామ్య ప్రక్రియకు మాత్రం విఘాతం కలుగుతుంటుంది. సమస్యలు ఉద్యమాలు వెనక్కుపోతుంటాయి. చాపకింద నీరులా పాలకులు అనుకున్నవి చేసుకుపోతుంటారు. పైగా వీటివల్ల ప్రజల్లో కలిగించే అభిప్రాయాలు కూడా వైసీపీకి మేలు చేయవు. పదునుగా పోరాడ్డానికి పరుషంగా మాట్లాడ్డానికి వున్న తేడాను నాయకులెవరైనా అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం అధినేత తన అనుభవాన్ని అవతలివారిని అడ్డుకోవడంపై గాక ఆలకించడంపై చూపిస్తే అఖిలఫక్ష సమావేశాలు నిర్వహించి చర్చిస్తే ఈ వాతావరణం మారుతుంది. మూడేళ్లయినా జగన్ చంద్రబాబు ఒకరి ఉనికిని ఒకరు ఆమోదించలేకపోవడం నిజంగా ఒక విపరీతం.