కృష్ణా జిల్లాలో దివాకర్ ట్రావెల్స్‌కు సంబంధించి బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. పదిమంది మరణించారు. మరికొంతమంది ఆసుపత్రిలో తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. అయితే, ప్రతిపక్ష నేత వారిని పరామర్శించడానికి వెళ్లడమూ కలెక్టర్‌తో వాగ్వాదం, అనంతరం జగన్‌పై ఆసుపత్రి సూపరింటెండెంట్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం అన్నీ నాటకీయంగా జరిగిపోయాయి. బాధితులను జగన్ పరమార్శించిన రోజు ఎవ్వరూ మాట్లాడలేదు! అంతేకాదు.. వాగ్వాదం జరిగిన తరువాత కూడా ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. కానీ, సరిగ్గా ఒక రోజు గడిచిన తరువాత అందరూ జగన్‌పై కేసు గురించే మాట్లాడుతున్నారు. జగన్ మీద కేసు అంత ముఖ్యమైన విషయంగా ఎందుకు మారింది..? ఆఘమేఘాల మీద ఈ కేసులో జగన్‌ను బుక్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది..? ముఖ్యమంత్రితో సహా తెలుగుదేశం నాయకులందరూ మూకుమ్మడిగా జగన్ వ్యవహార శైలి గురించి విమర్శలు ఒకేసారి గుప్పించాల్సిన అత్యవసర పరిస్థితి ఎందుకొచ్చింది..?
జగన్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… ఆయనకు జైలు అలవాటైపోయిందీ, ఎప్పుడు చూసినా సెంట్రల్ జైలు అని కలవరిస్తున్నారు, ఎంత తొందరగా అక్కడి వెళ్లాలో అని ఆలోచిస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు. ఒక కలెక్టరుతో ఇలా వ్యవహరించిన ప్రతిపక్ష నాయకుడిని జనం ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. ఇక, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. జగన్ చుట్టూ రౌడీల గ్యాంగ్ ఉందనీ, ఆయనో గ్యాంగ్ లీడర్ మాదిరిగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. ఒక జిల్లా కలెక్టర్‌తో ఇంత దురుసుగా ప్రవర్తించడం ఏంటన్నారు. అందరూ అవినీతి పరులే అంటే జగన్ విమర్శించడగం తగదంటున్నారు. మంత్రి కామినేని కూడా విమర్శలకు దిగేశారు. వీటిపై కౌంటర్‌గా వైకాపా ఎమ్మెల్యే రోజా కూడా ఘాటుగానే స్పందించి విమర్శలు చేశారు!
తెలుగుదేశం కోరుకున్నది ఇదే! అధికార పార్టీ వ్యూహం కూడా ఇదే! ఆ వ్యూహంలో వైకాపా చక్కగా చిక్కుకుందనే చెప్పాలి. ఇంతకీ ఆ వ్యూహం ఏంటంటే… ప్రమాదానికి గురైన బస్సు టీడీపీ నాయకుడి కుటుంబానికి చెందిన సంస్థది కదా! కాబట్టి, ప్రమాదం గురించి మీడియా ఫోకస్ చెయ్యకుండా ఉండాలంటే అంతకంటే పెద్దదైన టాపిక్ తెరమీదికి రావాలి. అప్పుడు మీడియా మైకులన్నీ అటు వెళ్లిపోతాయి. పైగా, ‘వారి’ చేతిలోనే చాలా మైకులు ఉన్నాయి! ఎలాగూ వాళ్ల వీళ్లపని వాళ్లు చేస్తారు. అందుకే జగన్‌పై కేసు.. దాని గురించి ముఖ్యమంత్రితో సహా అందరూ మాట్లాడటం!
అనుకున్నట్టుగానే జగన్ కేసును హాట్ టాపిక్‌గా మార్చేశారు. ఈ క్రమంలో ప్రమాదానికి గురైన బస్సు గురించిగానీ, ఆ సంస్థ గురించిగానీ, ప్రమాద కారణాలపై లోతైన విశ్లేషణలకుగానీ అవకాశం లేకుండా చేశారు. జగన్ కేసు లేకపోతే ఈ పాటికి మీడియా అంతా ఇదే పని పనిచేసేది. సో… ఈ విషయంలో మరోసారి టీడీపీ వ్యూహం సక్సెస్ అయిందనే చెప్పాలి! లేదంటే… ఈ పిట్టీ కేసు గురించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడటమేంటండీ!