2012, 2013 సంవత్సరాలకు గానూ.. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డుల్ని ప్రకటించింది. రెండేళ్ల అవార్డులూ ఒకేసారి ఇవ్వడం వల్ల.. విజేతల లిస్టు చాంతాడంత వుంది. ఎప్పుడూ అయితే.. నంది కోసం చాలా ఆత్రుతగా, ఆసక్తిగా ఎదురుచూసేవాళ్లు సినీ జనాలు. చాలా కాలం గ్యాప్ ఇచ్చి, ఎప్పటివో అవార్డులు ఇప్పుడు ప్రకటించడం వల్ల… నంది కళ తగ్గిపోయిందేమోఅనిపిస్తోంది. `ఆ.. అవార్డు వచ్చిందా…` అంటూ లైట్ తీసుకొన్నవాళ్లే ఎక్కువ తప్ప.. దీన్నేదో ప్రత్యేకంగా చూసినవాళ్లు, చూస్తున్నవాళ్లు చాలా తక్కువ. ఇది వరకు అవార్డులు రాగానే ఇంటర్వ్యూలంటూ ఎగబడే మీడియా కూడా నంది అవార్డులకు పెద్దగా స్పేస్ ఇవ్వలేదు. అవార్డులు ప్రకటించినప్పుడు కనిపించే హడావుడి ఈసారి లేకుండా పోయింది. ఇవి ఆంధ్ర ప్రదేశ్కు చెందిన అవార్డులు మాత్రమే అన్నట్టు… తెలంగాణ మీడియా నందిని లైట్ తీసుకొంది. ఏపీ మీడియా కూడా నందిపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు.
అయినా ఈమధ్య అవార్డుల వేడుకలన్నీ సర్వసాధారణం అయిపోయాయి. జీ, మా, జెమిని.. ఇలా ప్రధాన టీవీ ఛానళ్లు ప్రతీయేడాదీ అవార్డులు ఇస్తున్నాయి. ఇవి కాక సైమా, ఫిల్మ్ ఫేర్లున్నాయి. అవార్డు రావడం, దాన్ని అందుకోవడం మామూలే అనుకొంటున్న సినీ జనాలు.. `ఇది రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం` అనే విషయాన్ని విస్మరిస్తున్నారేమో అనిపిస్తోంది. జనం మర్చిపోయిన, మర్చిపోతున్న సినిమాలు, వాటికి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకూ అవార్డులు ఇస్తే.. పరిస్థితి ఇలానే ఉంటుంది.