జెసి బ్రదర్స్…అప్పుడలా…ఇప్పుడిలా… బాబు ‘నిప్పు’
రాజకీయాలంటేనే మాటలతో మాయ చేయడం అనే పరిస్థితులు దాపురించాయి. అలాంటి నాయకులలో కూడా చంద్రబాబు, వెంకయ్యనాయుడులాంటి వాళ్ళు మేటిగా నిలుస్తున్నారు. నేను అవినీతికి పాల్పడలేదు అని చెప్పి వైఎస్ జగన్ ఇంతవరకూ ఎప్పుడూ చెప్పలేదు. కానీ చంద్రబాబు మాత్రం అస్తమానం అదే మాట చెప్తూ ఉంటాడు. ఓటుకు నోటు కేసులో సాక్ష్యాధారాలతో సహా ప్రజలకు అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా అదే మాట చెప్తూ ఉంటాడు చంద్రబాబు. ఒక్క రూపాయి కూడా అవినీతితో సంపాదించలేదని, నిప్పులా బ్రతికానని చెప్తూ ఉంటాడు. ప్రతిపక్షాలు, తటస్థ మీడియా వాళ్ళు ఎన్ని రకాలు విమర్శించినా బాబు మాత్రం మళ్ళీ అదే పాట పాడుతూ ఉంటాడు. ప్రజలందరికీ తెలిసేలా తప్పులు చేస్తూ కూడా తాను నిప్పులాంటివాడిని అని చెప్పుకుంటున్న ఒకే ఒక్క నాయకుడు చంద్రబాబే అనడంలో సందేహం లేదు. రాష్ట్ర విభజన, ప్రత్యేక హోదాలాంటి ప్రజలకు ఉపయోగపడే విషయాల్లోనే కాదు. నాయకుల విషయంలో చంద్రబాబు తీరు భలేగా ఉంటుంది. జెసి బ్రదర్స్ విషయంలో చంద్రబాబు అభిప్రాయాలు పరిశీలిస్తే చాలు….చంద్రబాబు నిప్పులో నిజమెంతో…చంద్రబాబు ఎలాంటి రాజకీయ నాయకుడో ఇట్టే చెప్పెయ్యొచ్చు.
జెసి బ్రదర్స్ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు……
జెసి బ్రదర్స్ నరహంతకులు, ఫ్యాక్షనిస్టులు, తెదేపా నాయకుడు పరిటాల రవిని పొట్టనబెట్టుకున్నవాళ్ళు, అనంతపురంలో వందలాది మంది తెలుగుదేశం కార్యకర్తలను చంపేసిన నాయకులు అని చెప్పి దేశం మొత్తం తిరిగి మరీ చాటింపు వేేశాడు చంద్రబాబు. రాష్ట్ర గవర్నర్ నుంచి దేశ రాష్ట్రపతి వరకూ అందరినీ కలిశాడు. జెసి బ్రదర్స్‌ని శిక్షించాలని చెప్పి అందరికీ వినతిపత్రాలు ఇచ్చాడు. జాతీయ మీడియాలో కూడా హంగామా చేశాడు. ఆంధ్రప్రదేశ్‌లో రాక్షసరాజ్యం నడుస్తోందని చెప్పాడు. ఆ రాక్షస రాజ్యంలో జెసి దివాకర్‌రెడ్డి కూడా ఓ ప్రముఖ రాక్షసుడు అని ఊరూవాడా తిరిగి చెప్పాడు. అలాగే పరిటాల రవి జయంతి, వర్థంతి వచ్చినప్పుడల్లా పరిటాల సునీత చేత జెసి దివాకర్‌రెడ్డిని పిచ్చి తిట్లు తిట్టించాడు చంద్రబాబు. పరిటాల రవి హత్యలో ప్రధాన నిందితుడు జెసి దివాకర్‌రెడ్డి అని చెప్పి టిడిపి నేతలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. జెసి దివాకర్‌రెడ్డిని ఉరితీసినా తప్పులేదని చెప్పి బోలెడంత ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో జెసి దివాకర్‌రెడ్డి ట్రావెల్స్ బస్సుల ప్రమాదాల గురించి కూడా చంద్రబాబు వేసిన రంకెలు అన్నీ ఇన్నీ కావు.
జెసి బ్రదర్స్ టిడిపిలోకి జంప్ అయ్యాక……
రాయలసీమలో ఎక్కడ సభ నిర్వహించినా చంద్రబాబు పక్కనే జెసి దివాకర్‌రెడ్డి ఉంటాడు. చంద్రబాబును పొగుడుతూ జెసి చేసే భజన మామూలుగా ఉండడంలేదు. అలాగే జగన్‌ని తిట్టే తిట్లు కూడా చంద్రబాబుకు పిచ్చి పిచ్చిగా నచ్చేలా ఉంటున్నాయి. అలాంటి సందర్భాల్లోనే దశాబ్ధాలుగా టిడిపిని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులు కూడా జెసిని చూసి కుళ్ళుకోవాల్సిన పరిస్థితి. తన భర్తను చంపిన జెసి దివాకర్‌రెడ్డిని వదిలిపెట్టేది లేదని 2014 ముందు వరకూ కూడా పరిటాల రవి జయంతి, వర్థంతిల సందర్భంగా వీరావేశం చూపించిన పరిటాల సునీతను కూడా నోరెత్తకుండా చేశాడు చంద్రబాబు. రీసెంట్గా పరిటాల రవి వర్థంతి కార్యక్రమం జరిగింది. ఎలాంటి హడావిడి లేకుండా మీడియా స్టేట్మెంట్స్ కూడా ఏమీ లేకుండా సాగిపోయింది ఆ కార్యక్రమం. జెసి దివాకర్‌రెడ్డి, జగన్‌లను తిట్టే ప్రోగ్రాం అస్సలు లేకుండాపోయింది. దివాకర్స్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో పదిమంది చనిపోయారు. రెండో డ్రైవర్ బస్సు డిక్కీలో పడుకుని ఉన్నాడని ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఒక పెద్ద పోలీసాయన పిట్టకథ వినిపించాడు. అలాంటి అద్భుతం జరిగే అవకాశమే లేదని బస్సు డిక్కీలో పడుకుని రెండో డ్రైవర్ ప్రయాణం చేయడం జేమ్స్ బాండ్ సినిమాల్లో కూడా సాధ్యం కాదని ఇంజినీర్స్ చెప్తున్నారు. కానీ చంద్రబాబు టీం అంతా కూడా ఆ అబద్ధాన్ని నిజమని చెప్పి నమ్మించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. జెసి చేసే తప్పులను దాచిపెట్టడానికి చంద్రబాబు టీం అందరూ పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు.
చంద్రబాబుకంటే సీనియర్ని అని చెప్పుకునే జెసి దివాకర్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో….ఎలాంటి రాజకీయం చేశాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. అలాంటి రాజకీయమే చేస్తున్నాడు. తాడిపత్రిలో రెండు రోజులు స్టే చేస్తే చాలు……జెసిలు ఏంటి అనేది ఎవ్వరికైనా తెలిసిపోతుంది. జెసి బ్రదర్స్‌లో అయితే ఏ మార్పూలేదు. జెసి బ్రదర్స్ విషయంలో చంద్రబాబు తీరు మాత్రం అమాంతం మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే కాదు…తెలుగు ప్రజలందరికీ కూడా ఈ విషయం చాలా స్పష్టంగా తెలిసిపోయింది. కానీ రేపు అసెంబ్లీ సమావేశాలు మొదలయిన మొదటిరోజే…….నేను నిప్పులా బ్రతికాను అని చెప్పి చంద్రబాబు మరోసారి తన గురించి తాను చెప్పుకుంటాడనడంలో సందేహం లేదు. కానీ ఆ ‘నిప్పు’లాంటి మాటలను ప్రజలు ఇంకా నమ్మే అవకాశం ఉందా? నమ్ముతారా?