ఒక రాష్ట్ర రాజధాని అంటే… రాష్ట్రంలో ఉన్న ప్రజలందరిదీ, అన్ని రాజకీయాల పార్టీలదీ! కానీ, ఆంధ్రాలో మాత్రం రాజధాని అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీది మాత్రమే..! ఆ పార్టీకి చెందిన నాయకులకు మాత్రమే..! ఆ పార్టీని అనుకూలంగా ఉన్న కార్యకర్తలదీ, కొంతమంది ప్రజలదీ మాత్రమే..! ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న తీరు చూస్తే అచ్చంగా ఇదే అభిప్రాయం కలుగుతుంది. రాజ్యంగబద్ధంగా అధికార పక్షానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, ప్రతిపక్షానికి కూడా అంతే స్థాయి గుర్తింపు ఉండాలి. కానీ, ఏపీలో మాత్రం… ప్రతిపక్షం అంటే… అదేదో ప్రత్యర్థి పక్షం, శతృపక్షం అనే ధోరణితో తెలుగుదేశం చూస్తోంది. వీలైనంత దూరం పెట్టాలీ అన్నట్టు వ్యవహరిస్తోంది. తాజాగా అమరావతిలో అంసెబ్లీ, మండలి భవనాలను చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. కానీ, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రతిపక్షం వైకాపాను ఆహ్వానించిన తీరు చూస్తే… అద్భుతః అనిపిస్తుంది.
ఈ కార్యక్రమానికి అసెంబ్లీ కార్యదర్శి ద్వారా వైకాపా అధినేతకు ఆహ్వానం పంపారట! జగన్ కార్యాలయం ఈ ఫోన్ రిసీవ్ చేసుకునీ… విషయం జగన్‌కి చెబుతామని చెప్పి పెట్టేశారట! ఇది తెలుగుదేశం పార్టీ వాదన సుమండీ..! వైకాపా ఏమంటోందంటే… తమకు ఎలాంటి ఆహ్వానమూ రాలేదనీ, ఎస్.ఎమ్.ఎస్., ఈమెయిల్, ఫోన్, వాట్సాప్ ఇలాంటి ఏ మాధ్యమం ద్వారా కూడా తమకు సమాచారం అందలేదని చెబుతోంది. వైకాపా ఇలా స్పందించాక…తెలుగుదేశం అలా స్పందించిందన్నమాట! టీడీపీ చెబుతున్న మాటల్లోనే డొల్లతనం స్పష్టంగా ఉంది. ప్రతిపక్ష నేతకు శాసన సభ వ్యవహారాల మంత్రి ద్వారా ఆహ్వానం పంపామని చెబితే కొంతైనా బాగుండేది. కానీ, ఆహ్వానాల తీరుపై విమర్శలు వెల్లువెత్తాక… వాటికి కప్పిపుచ్చుకుంటున్నట్టుగా టీడీపీ ఇలా వాదిస్తుండటం విచారకరం!
అమరావతి విషయంలో తెలుగుదేశం తీరు మొదట్నుంచీ ఇలానే ఉంటోంది! రాజధాని శంకుస్థాపన సమయంలో కూడా ఇలానే వ్యవహరించింది. విపక్ష నేతకు సరైన ఆహ్వానం అందించలేదు. ప్రధాన ప్రతిపక్షానికే ఇలాంటి గుర్తింపు ఉంటే, ఇక కాంగ్రెస్ గురించి మాట్లాడుకోవాల్సిన పనేలేదు. రాజధాని అంటే కేవలం తెలుగుదేశం పార్టీదేనా..? వారి హయాంలో శంకుస్థాపనలు జరిగినంత మాత్రాన, కాపీ రైట్స్ అన్నీ వారికే ఉంటాయా..? రాజధాని, అసెంబ్లీ, మండలి, సెక్రటేరియట్.. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ సొంతంగా నిర్మిస్తున్నవి అనుకుంటున్నట్టున్నారు..! పరిస్థితి చూస్తే అలానే ఉంది. ఇలాంటి నిర్మాణాల విషయంలో జరిగే అన్ని కార్యక్రమాలూ రాజకీయాలకు అతీతంగా ఉండాలి. ఇవేవీ పార్టీ ఫండింగ్ కార్యక్రమాలు కాదు కదా… అంతా ప్రజాధనమే కదా! పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానించాలి. అంతేగానీ సొంత ఇంటి పండుగలు చేసుకుంటున్నట్టు.. ఇదేం పద్ధతి..?