హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికారపక్షం, ప్రధాన ప్రతిపక్షం సభ్యులమధ్య తిట్లపర్వం కొనసాగుతోంది. నిన్న జగన్ ఇడుపులపాయ వెళ్ళటంతో కొంత ప్రశాంతంగా సాగిన శాసనసభ, ఇవాళ జగన్ తిరిగి రాకతో మళ్ళీ యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పెరుగుతున్న ధరలపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించటంతో గొడవ మొదలయింది. వాయిదా తీర్మానాన్ని తిరస్కరించటంపై ఆ పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీనితో స్పీకర్ సభను 15 నిమిషాలపాటు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైనపుడు వైసీపీ సభ్యులు తమ నిరసనను కొనసాగిస్తూ కార్యకలాపాలను అడ్డుకోవటంపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ సభను తమ ఇష్టమొచ్చినట్లు నడిపించాలని చూస్తోందని, స్పీకర్‌కు దిశానిర్దేశం చేస్తోందని దుయ్యబట్టారు. ఆ పార్టీ సభ్యులు పదే పదే సభను అడ్డుకోవటం, సభాసమయాన్ని వృథా చేయటం తగదని అన్నారు. ఆ పార్టీ పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ అని కాకుండా సైకో పార్టీ అని పెట్టుకుంటే కరెక్ట్‌గా సూటబుల్ అవుతుందని వ్యాఖ్యానించారు. దీనిపై వైసీపీ సభ్యులు మరింత మండిపడ్డారు. పోడియంలోకి దూసుకెళ్ళి నిరసన తెలిపారు. మంత్రితో క్షమాపణ చెప్పించాలని స్పీకర్‌ను డిమాండ్ చేశారు. దీనితో స్పీకర్ సభను మళ్ళీ పది నిమిషాలపాటు వాయిదా వేశారు.
సభ తిరిగి సమావేశమైనపుడు జగన్ అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై స్పందిస్తూ, ప్రతిపక్షాన్ని మంత్రి సైకో పార్టీగా వ్యాఖ్యానించారని, రౌడీ చేష్ఠలను ప్రజలు హర్షించరని అంటే రాద్ధాంతం చేస్తున్నారని, తమను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని వేలు చూపిస్తూ రౌడీమాదిరిగా బెదిరించినాకూడా అది తమ తప్పే అన్నట్లు చెప్పటం తమ ఖర్మ అని వ్యాఖ్యానించారు. రౌడీ ముఖ్యమంత్రి, రౌడీ శాసనసభ్యులు ఎలాచేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అచ్చెన్నాయుడు సైకో పార్టీ అనటంపై వైసీపీ సభ్యులు సభాహక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చారు.
మరోవైపు జగన్ ముఖ్యమంత్రిపై చేసిన రౌడీ వ్యాఖ్యలపై టీడీపీ సభ్యుడు కాల్వ శ్రీనివాసులు స్పందిస్తూ, నేరాలే వృత్తిగా ఉన్న కుటుంబంనుంచి వచ్చిన జగన్, చంద్రబాబును రౌడీ ముఖ్యమంత్రి అంటే నిజాయితీ సిగ్గుతో తల దించుకుంటుందని మండిపడ్డారు. అనేక కేసులు ఎదుర్కొంటున్న చరిత్ర గల మీరు, భారత శిక్షా స్మృతిలోని అన్ని సెక్షన్లు పెట్టినా తరగని నేరాలు చేసిన మీరు మమ్మల్ని రౌడీలు అంటారా అని జగన్‌ను దుయ్యబట్టారు.