✍ తెలంగాణలో ప్రగతిరథ చక్రాలు భారంగా కదులుతున్నాయి. విభజన తరువాత ఆర్టీసీ విడిపోయినా.. తెలంగాణలో ఆ సంస్థ నష్టాల్లో కొనసాగుతోంది. రాష్ట్ర విభజన తరువాత కొన్ని రోజుల వరకు ఉమ్మడిగానే కొనసాగిన ఆర్టీసీ ఆ తరువాత అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో వేరువేరుగా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అయితే ఆర్టీసీ పూర్తిస్థాయి విభజన ఇంకా పూర్తికాలేదు. ఇదిలాఉంటే ఏపీఎస్ ఆర్టీసీ నుంచి టీఎస్ఆర్టీసీ ఏర్పడినా.. నష్టాలు మాత్రం ఉమ్మడి సంస్థలో మాదిరిగానే వెంటాడుతున్నాయి. అయినప్పటికీ ఆర్టీసీని ఆదుకోవడానికి ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించడం లేదని అధికార వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఈ రెండేళ్లలో రాష్ట్ర బడ్జెట్లో ఆర్టీసీకి కేటాయించిన నిధులు తగ్గిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో ఆర్టీసీకి రూ.200 కోట్లు కేటాయించారు. ఆ తరువాతి బడ్జెట్లో రూ.159 కోట్లు కేటాయించారు. 2016-17 బడ్జెట్లో రూ. 40 కోట్లు కేటాయించారు.
👉 ఏటేటా బడ్జెట్ కేటాయింపులు పెంచకపోతే ఆర్టీసీ పరిరక్షణ సాధ్యం కాదని కార్మిక సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. తెలంగాణలో ఆర్టీసీకి రోజుకు రూ. 2 కోట్లు నష్టాలు వస్తున్నాయని, మొత్తం రూ. 545 కోట్ల మేర నష్టాల్లో ఉందని అధికారులు చెబుతున్నారు.
👉 ఒక్క గ్రెటర్ హైదరాబాద్ పరిధిలోనే రూ. 310 కోట్ల నష్టాల్లో ఆర్టీసీ నడుస్తోంది. గతంలో జీహెచ్ఎంసీ ఆర్టీసీకి రూ.336 కోట్లు ఇవ్వగా.. 2016-17 బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
👉 ప్రస్తుతం ఆర్టీసీలో నెలనెలా జీతాల కోసం సంస్థ ఇబ్బందులు పడుతోందని ఆర్టీసీ కార్మిక సంఘాలు అంటున్నాయి. బకాయిల విషయంలో అధికారులు సరైన నివేదకలు ఇవ్వకపోవడం వల్లే ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదనే అభిప్రాయన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీని అప్పులు కలవర పెడుతున్నాయి. ఇప్పటికే రూ.2వేల కోట్లు అప్పులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ అప్పులకు యేటా రూ. 189 కోట్లు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఇక వివిధ వర్గాలకు ప్రభుత్వం బస్పాస్ రాయితీని ఇస్తోంది.
👉 అయితే ఈ రాయితీ సొమ్మును ప్రభుత్వం తిరిగి ఆర్టీసీకి జమ చేయటం లేదని కార్మిక సంఘాలు వాదిస్తున్నాయి. 2015-16లోనే రూ. 545 కోట్లు ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ విధంగా రెండేళ్ల బకాయిలు ఆర్టీసికి జమ చేస్తే ఆర్టీసీ సగం అప్పులు తీరిపోతాయి.
👉 ఇక రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై వసూలు చేసే వ్యాట్ వల్ల ఆర్టీసీ మీద మరో రూ. వెయ్యి కోట్ల భారం పడుతోంది. త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్లో కనీసం రూ. వెయ్యి కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
👉 ఆర్టీసీ ప్రతీ ఏటా ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చినా సర్కార్ మాత్రం అరకొర నిధులు కేటాయిస్తుందని కార్మిక సంఘాలు వాదిస్తున్నాయి. ఈసారి బడ్జెట్లోనైనా ఆర్టీసీకి పెద్దఎత్తున నిధుల వరద పారిస్తారన్న ఆశాభావంతో అధికారులు, కార్మిక సంఘాల నేతలు ఉన్నారు.