అమరావతిలో కొత్త శాసనసభ హుషారులో వున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఓటుకు నోటు కేసును సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించడం పెద్ద దెబ్బే. న్యాయవ్యవస్థను చంద్రబాబు మ్యానేజ్ చేస్తారని వైసీపీ నేతలెప్పుడూ ఆరోపిస్తుంటారు. అయితే వైసీపీ ఎంఎల్ఎ ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ఈ కేసు సాగిస్తూనే వున్నారు.సిబిఐ న్యాయస్థానంలో కొంతవరకూ విజయం సాధించారు.టిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కేసును నెమ్మదింపచేసిన నేపథ్యంలో ఆర్కే కేసు మళ్లీ కదలిక తెచ్చింది.సిబిఐ కోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేసింది. అయితే దానిపై హైకోర్టుకు వెళ్లడం అక్కడ కింది కోర్టు తీర్పు కొట్టేయడంతో ముఖ్యమంత్రికి వూరట లభించింది. ఆ సందర్భంలో న్యాయమూర్తి అవసరంలేని వ్యాఖ్యలు చేశారు.అనవసరమైన కితాబులు కూడా ఇచ్చారు. తెలంగాణ ఎసిబిచాలా అనాసక్త పాత్ర వహించింది.కాని కొన్నాళ్ల తర్వాత టిడిపి ఎంఎల్ఎ సంద్ర వెంకట వీరయ్యపై ఛార్జిషీటు వేసింది. అంటే కెసిఆర్ ప్రభుత్వం కావాలనే ఈ కేసును సాగదీస్తున్నట్టు అర్థమైన తర్వాత ఆర్కే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు ప్రాథమికంగా విచారణకు స్వీకరించి చంద్రబాబుతో సహా అందరికీ నోటీసులు జారీ చేశారు. రాజకీయంగా ఇది పెద్ద పరిణామమే గాని వెంటనే పెద్ద తలకిందులయ్యేది వుండదు. పైగా చంద్రబాబు తరపు లాయర్లు కోర్టులో మాట్టాడ్డం తప్ప దీనిపై ఆయనచాలా కాలంగా మాట్లాడ్డం లేదు కూడా. ఈ రోజు కూడా అమరావతిలో మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు గాని ఈ ప్రస్తావన వివరణ లేవు. దాన్ని తక్కువ చేసేందుకు తెలుగుదేశం ఎంతగా తంటాలు పడినా అది వెన్నాడుతూనే వుంది.
ఇందులో రేవంత్ రెడ్డి పాత్ర ప్రధానమైంది. ఆయన నోరు విప్పితే ఇలాటి కుటిల వ్యూహాల వివరాలు బయిటకు వస్తాయి. అందుకే ఆయన కెసిఆర్‌పై ఎంత తీవ్రంగా మాట్లాడుతున్నా నాయకత్వం వారించలేకపోతున్నది.అదే భాషలో తాము అంటారా అదీ లేదు. ఇప్పుడు సుప్రీం కోర్టు కూడా రంగంలోకి వచ్చింది గనక ఈ ఇరకాటం ఇంకా పెరుగుతుంది. రేవంత్ మరింత దూకుడు పెంచవచ్చు. ఈ విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రేక్షక పాత్ర విరమించి ఒక కొలిక్కి తేవలసి వుంటుంది. కెసిఆర్ గాని ఇతరులు గాని గతంలో అన్నదానికి కట్టుబడి వున్నారా లేక మార్చుకున్నారా?
ఇటీవల శశికళ కేసులో హైకోర్టు తీర్పును పూర్తిగా తోసిపుచ్చి సుప్రీం కోర్టు కింది కోర్టు వేసిన శిక్షలనే ఖరారు చేసింది.ఓటుకు నోటు కేసులో ఏం చేస్తుందో చూడాల్సిందే!ఇప్పుడైనా చంద్రబాబు స్టే తెచ్చుకోకుండా వుంటేనే సుమా!