రాజకీయ వ్యూహాల విషయంలో చంద్రబాబును కొట్టే స్థాయి నాయకుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లేరు. ఈ విషయంలో కెసీఆర్ స్థానం కూడా చంద్రబాబు తర్వాతనే అని చెప్పడానికి సందేహాలు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ సత్తాను అంచనావేయడంలో పొరబడి ఎన్టీఆర్పైనే పోటీ చేస్తా అని ప్రగల్భాలు పలికిన సందర్భాన్ని పక్కన పెడితే…ఎన్టీఆర్ గెలిచిన వెంటనే టిడిపిలోకి జంప్ చేసిన తర్వాత నుంచీ చంద్రబాబు వ్యూహాలన్నీ వందశాతం సక్సెస్ అవుతూనే వచ్చాయి. లేేని బూచీని చూపించి ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీని, ముఖ్యమంత్రి కుర్చీని లూక్కున్న వ్యూహమైతే ఇంకెవ్వరికీ సాధ్యం కాదేమో. ఇక ఆ తర్వాత నుంచీ 2004 వరకూ చంద్రబాబు వ్యూహాలకు అడ్డే లేకుండా పోయింది. వైఎస్ రాజశేఖర్రెడ్డిలాంటి సమఉజ్జీ పుణ్యమాని చంద్రబాబు సైకిల్‌కి బ్రేక్ పడిపోయింది. 2009లో కూడా వైఎస్ ముందు నిలబడలేకపోయాడు చంద్రబాబు. వైఎస్సార్ అకాల మరణంతో మరోసారి చంద్రబాబుకు టైం కలిసొచ్చింది. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలాంటి అసమర్థ ముఖ్యమంత్రులతో కాంగ్రెస్‌ని నడిపించలేక అపసోపాలు పడుతున్న సోనియాగాంధీకి సపోర్ట్‌గా నిలిచాడు చంద్రబాబు. సుజనాచౌదరి ద్వారా సోనియాగాంధీ కోటరీలో ముఖ్యవ్యక్తి అయిన అహ్మద్ పటేల్‌తో చంద్రబాబు నడిపిన రాయబారం అంతా ఇంతా కాదు. జగన్‌కి నష్టం చేయడం కోసం సోనియాతో చంద్రబాబు చేతులు కలిపాడని రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉంటారు. ఆ తర్వాత నరేంద్రమోడీ వేవ్ ఏ స్థాయిలో ఉందో అంచనా వేసిన చంద్రబాబు వెంటనే మోడీకి జై కొట్టాడు. గోద్రా టైంలో హైదరాబాద్‌లో మోడీ అడుగుపెడితే అరెస్ట్ చేయిస్తా అని తాను చేసిన శపథాన్ని మర్చిపోయి మరీ మోడీకి జై కొట్టాడు. రైట్ టైంలో పవన్ కళ్యాణ్‌ని కూడా రంగంలోకి దించాడు. ఫలితం సాధించాడు. చంద్రబాబు వ్యూహాలు ఆ స్థాయిలో ఉంటాయి.
ఇప్పుడు 2019 ఎన్నికల కోసం కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నాడు చంద్రబాబు. 2019లో కూడా నన్ను గెలిపించకపోతే అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా పూర్తిగా నష్టపోతుంది అని ఓటర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్న విషయాన్ని పక్కన పెడితే రాజకీయ వ్యూహాలను కూడా ఇప్పటి నుంచే అమలు చేస్తున్నాడు చంద్రబాబు. ప్రతిపక్ష నాయకుడు జగన్‌ని పవన్ కళ్యాణ్ కంటే తక్కువ చేసి చూపించే ప్రయత్నాలు చేస్తున్నాడు. చంద్రబాబు భజన పత్రిక ఆంధ్రజ్యోతిని ఫాలో అవుతున్నవారికి ఆ విషయం చాలా స్పష్టం అర్థమవుతోంది. అలాగని మళ్ళీ పవన్ కళ్యాణ్‌ని పూర్తిగా ఎదగనిస్తాడని కాదు. 2019 ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా జగన్‌కి రాకుండా చేయాలన్న వ్యూహం మాత్రమే. ఆ స్థానంలో పవన్ కళ్యాణ్ ఉండాలని కోరుకుంటున్నాడు చంద్రబాబు. 2019లో జగన్ అధికారంలోకి రాలేకపోతే ఇక అంతటితో జగన్ ముఖ్యమంత్రి ఆశలకు శుభం కార్డ్ పడినట్టే అన్న విషయం చంద్రబాబుకు తెలుసు. నారా లోకేష్ రాజకీయ భవిష్యత్ దృష్ట్యా కూడా చంద్రబాబుకు అది చాలా అవసరం. అలాగే 2019లో తాను మళ్ళీ అధికారంలోకి రావడానికి అవసరమైన అస్త్ర శస్త్రాలను కూడా సిద్ధం చేసుకుంటున్నాడు చంద్రబాబు. ఈ సారి మోడీ సపోర్ట్ ఉండే అవకాశాలు చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుకు సపోర్ట్‌గా ప్రచారం చేసే అవకాశం లేదు. జగన్‌కి వ్యతిరేకంగా మాత్రం చేస్తాడు. 2014లో ఉన్న రెండు శక్తులు లేకుండా పోతున్న దృష్ట్యా ఇప్పుడు ఎన్టీఆర్‌ని రంగంలోకి దించే ప్రయత్నాలు చేస్తున్నాడు చంద్రబాబు.
తన రాజకీయ అవసరాల రీత్యా 2009లో ఎన్టీఆర్‌ని కలుపుకుపోయాడు చంద్రబాబు. తాత నందమూరి తారక రామారావు పైన ఉన్న అభిమానంతో పార్టీ కోసం అహర్నిశలూ కష్టపడ్డాడు ఎన్టీఆర్. మృత్యు ముఖం దగ్గరకు కూడా వెళ్ళివచ్చాడు. అయినప్పటికీ ఎన్టీఆర్ సామర్థ్యాన్ని చూసిన చంద్రబాబు లోకేష్‌కి పోటీ అవుతాడన్న ఒకే ఒక్క ఉద్ధేశ్యంతో ఎన్టీఆర్‌ని అకారణంగా దూరం పెట్టేశాడు. ఆంధ్రజ్యోతి సాయంతో ఎన్టీఆర్‌ని జగన్‌కి ఆత్మబంధువుని చేసిపడేశాడు. ఎన్టీఆర్ సినిమా కెరీర్‌కి కూడా బాగానే నష్టం చేశాడు. కానీ ఎన్టీఆర్‌ని పూర్తిగా అణచలేకపోయాడు. కొంచెం డౌన్ అయినప్పటికీ మళ్ళీ సూపర్ క్రేజ్‌తో టాప్ రేంజ్‌కి వచ్చేశాడు ఎన్టీఆర్. అదే టైంలో టిడిపి వారసత్వం లోకేష్‌కే అన్న స్పష్టతని కూడా పార్టీలో ఉన్న నాయకులు అందరికీ ఇచ్చేశాడు చంద్రబాబు. ఇక ఇప్పుడు 2019 ఎన్నికల కోసం ఎన్టీఆర్‌ని మరోసారి టిడిపిలోకి ఆహ్వానిస్తున్నాడు చంద్రబాబు. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని కూడా పెంచేశాడు. పొలిట్ బ్యూరో సమావేశాలకు హరికృష్ణ హాజరయ్యేలా చేస్తున్నాడు. నారా లోకేష్ కూడా ఎన్టీఆర్‌తో రాయబారం నడుపుతున్నాడు. 2019లో టిడిపి తరపున ప్రచారం చేయడానికి ఎన్టీఆర్‌ని ఆహ్వానించే ప్రయత్నాలు అయితే చంద్రబాబు చాలా సీరియస్‌గా చేస్తున్నాడు. ఎన్టీఆర్ రెస్పాన్స్ ఏంటి అన్నది మాత్రం ఇంకా తెలియలేదు. ఊపిరి ఉన్నంతవరకూ టిడిపితోనే అని చాలా సార్లు చెప్పాడు ఎన్టీఆర్. అలాంటి ఎన్టీఆర్పైన విజయవంతంగా పార్టీ వ్యతిరేకి అన్న ముద్రవేసేశారు బాబు అండ్ కో. మరి ఇప్పుడు అదే చంద్రబాబు మరోసారి పార్టీలోకి ఆహ్వానిస్తున్నాడు. ఎన్టీఆర్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి మరి. ఎన్టీఆర్ గనుక టిడిపికి సపోర్ట్‌గా రంగంలోకి దిగితే మాత్రం అది కచ్చితంగా పార్టీకి లాభం చేకూరుస్తుందనడంలో సందేహం లేదు. పార్టీ వాయిస్‌ని ప్రజల్లోకి తీసుకెళ్ళే విషయంలో ఎన్టీఆర్‌తో పోటీ పడే నాయకుడు టిడిపిలో ఎవ్వరూ లేరు అన్న మాట కూడా వాస్తవం.