అనుకొన్నట్టే జరిగింది. సినిమాల్లోలా… ట్విస్టులేం లేవు. అంతా స్ర్కీన్ ప్లే ప్రకారం సాఫీగా నడిచిపోయింది.. ‘మా’ అధ్యక్షుడిగా శివాజీ రాజా ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిపోయింది. ‘మా’ ఈ సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టి, కొత్త కార్యనిర్వాహక సభ్యుల్ని పరిచయం చేసింది. గతంలోలా ఈసారి అధ్యక్ష పదవి కోసం ఎన్నికలు జరక్కుండా, ఒకరిపై ఒకరు బురద జల్లుకోకుండా, ఎన్నికల పేరుతో హైడ్రామా సృష్టించకుండా మా అధ్యక్షుడ్ని ఏకగ్రీవంగా ఎంచుకోవాలని సినీ పెద్దలంతా ఒక్క మాటపై ఉండడంతో.. శివాజీ రాజా చేతికి మా పగ్గాలు అందాయి. మొన్ననే అధ్యక్షుడిగా శివాజీ రాజా పేరుని `మా` ప్రతిపాదించింది. అయితే.. సినిమాటిక్ మలుపులేమైనా వస్తాయేమో, అధ్యక్షుడి పదవికి పోటీ ఏర్పడుతుందేమో అనుకొన్నారు. అయితే.. ఏకగ్రీవ ఎంపిక ప్రక్రియ సజావుగా సాగిపోయింది. 18 మంది కార్యనిర్వాహక సభ్యుల్ని, ఉపాధ్యక్షులు, కార్యదర్శులన్ని కూడా ఈసారి పోటీ లేకుండా ఎంపిక చేశారు. వైస్ ప్రెసిడెంట్లుగా శ్రీకాంత్, వేణుమాధవ్ ఎంపికయ్యారు. సహాయ కార్యదర్శి పదవి నరేష్‌కి దక్కింది. అయితే ఈ టోటల్ ఎపిసోడ్ లో ఎక్కడా గత అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ కనిపించకపోవడం కొసమెరుపు. ఆయన లేకుండానే ‘మా’ ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి. కొత్త కార్యవర్గం వచ్చేసింది. ఈ కార్య వర్గానికి రాజేంద్ర ప్రసాద్ ఆశీస్సులు ఉన్నాయా, లేదంటే ఆయన ప్రమేయం లేకుండానే `మా` కొత్త కమిటీ ఏర్పడిపోయిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మా అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ బాగా పనిచేశారని, ఈ దఫా… రాజేంద్ర ప్రసాద్‌నే ఎంపిక చేయాల్సిందని కొంతమంది సభ్యులు గుసగుసలాడుకోవడం విశేషం.