చేతలు ఎలా ఉన్నా మాటల్లో మాత్రం అద్భుతమైన సూక్తి ముక్తావళి వినిపించడంలో మాత్రం వెంకయ్యను మించిన నాయకుడు దేశంలోనే ఎవరూ లేరు. ఆ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమయ్యేసరికి జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయింది. తెలంగాణా రాష్ట్ర విభజన చేసేలే సోనియాగాంధీని రెచ్చగొట్టింది బిజెపి, టిడిపిలే. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టాలని శతవిధాలా ప్రయత్నాలు చేసింది బిజెపి, టిడిపి పార్టీలే. ఆ తర్వాత రాష్ట్ర విభజనకు సంపూర్ణ సహకారమందించింది బిజెపి పార్టీ. నిజానికి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కాంగ్రెస్‌కి ఏ శిక్ష వేశారో బిజెపికి కూడా అదే శిక్ష వేసి ఉండాలి. కానీ వెంకయ్య నాయుడు మాటల మాయలో, టిడిపి అనుకూల మీడియా ప్రచార హోరులో పడిపోయి ప్రత్యేక హోదా పైన బోలెడన్ని ఆశలు పెట్టుకుని బిజెపిని కరుణించారు. కానీ వెంకయ్యనాయుడివన్నీ ఉత్త మాటలే అని తెలుసుకోవడానికి మాత్రం ఎక్కువ టైం పట్టలేదు. 2014 ఎన్నికల తర్వాత నుంచి కూడా అవకాశం దొరికినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ద్రోహం చేసిన దోషిగా కాంగ్రెస్ పార్టీని చూపెట్టే ప్రయత్నాలను ఎప్పుడూ తగ్గించలేదు వెంకయ్య. మరి 2014 తర్వాత నుంచీ ప్రత్యేక హోదా, రాజధాని నిధులు, రైల్వే జోన్‌లాంటి విషయాల్లో బిజెపి చేస్తున్న ద్రోహం గురించి మాట్లాడమంటే మాత్రం వెంకయ్యనాయుడికి చిర్రెత్తుకొస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహంతో పోలిస్తే మేం చేసేది కూడా ఒక ద్రోహమేనా అని ఎదురుదాడికి దిగుతాడు. అట్టే మాట్లాడితే మేం చేసే ద్రోహంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని మాటలు చెప్పగలడు. రాష్ట్ర విభజన అంశాన్ని ఎంతలా క్యాష్ చేసుకోవాలో అంతకుమించే ప్రయోజనాలు పొందిన వెంకయ్య ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన గడిచిన చరిత్ర అని చెప్తున్నాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాకు ఏం సంబంధం లేదు అని ఎన్నికలు అయిపోయన వెంటనే సీమాంధ్రులను బెదిరించిన వెంకయ్యనాయుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయాలను కూడా పట్టించుకున్నట్టుగా లేడు. రాష్ట్ర విభజన అనేది గడిచిన చరిత్ర అన్న విషయం విభజన ఉద్యమాన్ని నడిపించిన కెసీఆర్‌తో సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాయకులందరూ మర్చిపోయారు…..ఒక్క చంద్రబాబు తప్ప. ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నప్పటి నుంచీ ఛాన్స్ దొరికినప్పుడల్లా రాష్ట్ర విభజన గురించి తనకు ప్లస్ అయ్యేలా మాట్లాడుకుంటూ ఉన్నాడు చంద్రబాబు. రాష్ట్ర విభజన విషయంలో తాను ఒక్కడినే పుణ్యాత్ముడిని, మిగిలిన అందరూ పాపాత్ములే అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను నమ్మించడానికి అన్నిరకాలుగానూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలన్నింటికీ కూడా రాష్ట్ర విభజనే కారణం అని చెప్పడానికి కూడా చంద్రబాబు నానా విధాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. 2014 ఎన్నికల సమయం నుంచీ ఇప్పటి వరకూ కూడా రాష్ట్ర విభజన పర్వాన్ని చంద్రబాబు వాడుకున్నంతగా ఇంకే నాయకుడు వాడుకోలేదు. కొత్త అసెంబ్లీ ప్రారంభోత్సవం సందర్భంగా కూడా తన చిత్తానికి ఏదో మాట్లాడేసి తెలంగాణా రాష్ట్ర నాయకుల చేత తిట్టించుకున్నాడు చంద్రబాబు. తెలంగాణా నేతలు ఎంతలా తిడితే అంతలా ఆంధ్రాలో హీరో అయిపోవచ్చన్న రాజకీయ మర్మాన్ని పట్టేసినట్టుగా ఉన్నాడు. మరి రాష్ట్ర విభజన అంశాన్ని అనుక్షణం తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్న చంద్రబాబుకు రాష్ట్ర విభజన గడిచిపోయిన చరిత్ర అన్న తన గీతోపదేశాన్ని వెంకయ్యనాయుడు వినిపించలేదా? లేకపోతే ఈ విషయంలో కూడా మాటల దారి మాటలదే…చేతల దారి చేతలదే అన్న తన ట్రేడ్ మార్క్ సిద్ధాంతాన్ని ఫాలో అయిపోతున్నాడా? ఇద్దరు నాయుళ్ళు కూడా కేవలం మాటల నాయకత్వంతో ఇంకా ఎంతకాలం ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించగలరో చూడాలి మరి.