గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘సాహసమే ఊపిరిగా సాగిపో’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఇందులో నాగచైతన్య, మలయాళీ నటి మంజిమ మోహన్ జంటగా నటిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే బాహుబలి సినిమాలో ప్రతినాయక పాత్రలో మెప్పించిన రానా కూడా ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. నాగ చైతన్యతో ఉన్న అనుబంధం కారణంగా దర్శకుడు కోరగానే రానా ఈ సినిమా చేసేందుకు అంగీకరించారు. తెలుగు, తమిళంలో రూపొందుతున్న ఈ సినిమాలో రానా, మంజిమ నటిస్తున్నారు కానీ నాగ చైతన్య నటించడం లేదు. తమిళంలో హీరో పాత్రను శింభు చేస్తున్నారు. ఇంతకు ముందు గౌతం మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య చేసిన ‘ఏం మాయ చేసావే’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మళ్ళీ చాలారోజుల తరువాత వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తున్నారు. హీరో నాగార్జున పుట్టిన రోజు కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు. కానీ అందులో హీరో, హీరోయిన్లు కానీ సినిమాలో నటిస్తున్నఎవరూ లేకపోవడం చాలా వెరైటీగా ఉంది. హైవే రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఒక బైక్, దాని హ్యాండిల్ కి తగిలించిన ఒక హెల్మెట్, దూరం నుండి వస్తున్న ఒక కారు మాత్రమే కనబడుతాయి. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్ రహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని తెలుగులో గురు ఫిలిమ్స్ బ్యానర్లో ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎం.రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తమిళంలో గౌతం మీనన్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా దసరాకి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.