సినిమా ఒక పవర్ ఫుల్ మీడియం. సమాజాన్ని అద్దం పడుతుంది సినిమా. ఎవరి అభిప్రాయం ఎలా వున్నా సినిమా ప్రభావం మాత్రం సమాజం పై ఖచ్చితంగా కనిపిస్తుంటుంది. తమ అభిమాన హీరోను అణువణువునా ఫాలో అవ్వడం, తెరపై కనిపించే హీరోయిజంను తమకు ఆపాదించుకోవడం చూస్తేనే వున్నాం. అలాగే కాధానాయికలు కూడా. కధానాయికలు అంటే ఎక్కడి నుండో దిగిరారు. వారూ మన చుట్టుప్రక్కల వున్న పాత్రలే. సగటు అమ్మాయీ కధానాయికే. మరి, అలాంటి అమ్మాయి నేటి సినిమాల్లో కనిపిస్తుందా? మన అక్కనో, చెల్లినో కధానాయిక పాత్రలో పోల్చుకొని అవకాశం వుందా? సినిమాలో అమ్మాయిల పాత్రలు తీర్చిదిద్దడంలో సినీ రూపకర్తలు భాద్యతగా వుంటున్నారా? స్త్రీ ఔనిత్యాన్ని చాటి చెప్పే పాత్రలు నేటి సినిమాలో కనిపిస్తున్నాయా? అంటే ఎన్నో అనుమానాలు, ఇంకెన్నో ప్రశ్నలు.
సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది. ఆధునూత టెక్నాలజీ అందిపుచ్చుకొని అద్భుతాలు సృష్టిస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. అయితే ఎంత అభివృద్ది చెందినా సినిమాలో హీరోయిన్స్ పాత్రలు విషయానికి వచ్చేసరికి మాత్రం ఆలోచన అధమ స్థాయిలోనే వుండిపోతుంది. ఇపుడు హీరోయిన్ అంటే.. కట్ చేస్తే ఏ ఫారిన్ లొకేషన్, లేదా ఎదో బీచ్ ఒడ్డునో హీరోతో రోమాన్స్ చేసే ఓ గ్లామర్ డాల్ మాత్రమే అని అభిప్రాయానికి తెచ్చేశారు సినీ రూపకర్తలు. ఒకప్పుడు హీరోయిన్ అంటే కధలో మిళితమైపోయే ఓ పాత్ర . కాని ఇప్పుడు సినిమాలో ఒక స్పైస్ మాత్రమే అనే భావనలోకి వచ్చేశారు. సినిమా అనేది సమజాన్ని అద్దం పట్టాలి. అందులో కనిపించే పాత్రలతో సగటు మనిషి కనెక్ట్ అవ్వాలి. మిగతా పాత్రలు మాట ఏమిటో కానీ హీరోయిన్స్ ను డీల్ చేసే విధానం చూస్తే అసలు ఇలాంటి పాత్రను ఏ గ్రహం నుండి తీసుకొచ్చారు అనే భావన కలుగుతుంది. అంతలా సినిమా స్వేఛ్చ తీసుకొని అమ్మాయి పాత్రను తమకు నచ్చినట్లు ఆడిస్తున్నారు.
బడా సినిమాల్లో ఈ జాడ్యం :
ముఖ్యంగా పెద్ద సినిమాల్లోనే ఈ జాడ్యం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇప్పుడు వస్తున్న సినిమాలు చాలా మటుకు పురుషాధిక్యాన్ని గ్లోరిఫై చేసే చిత్రాలని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోయిజం ను గ్లోరిఫై చేసే క్రమంలో అమ్మాయి పాత్రను మరీ తక్కువగా చూపించే ట్రెండ్ కనిపిస్తుందిప్పుడు. ఒకప్పుడు ఇది లేదా.. అంటే వుండేది. కాని ఇంతలా కాదు. ఇప్పుడు హీరోయిజం బౌండరీలు దాటేస్తుంది. హీరో పాత్రకు ఎక్కడిలేని పవర్స్ వుంటాయి. ఆ హీరోని చూసిన వెంటనే హీరోయిన్ మనసు పారేసుకోవాలి. మరు క్షణంలోనే.. ‘’ఇంకెమొద్దు .. నువ్వే ముద్దు’’.. అంటూ ఒక పాటేసుకోవాలి. మళ్ళీ హీరోకి ఇంట్రవెల్ ముందో క్లైమాక్స్ కో టైం దొరుకుతుంది. అప్పుడో పాట. ఇక అంతే సంగతులు. ఇదీ నేటి కమర్షియల్ సినిమాలో కధానాయిక పాత్రను తీర్చిదిద్దే విధానం. మరి ఇలాంటి పాత్రలు మనం చూసే సమాజంలో ఎక్కడ కనిపిస్తున్నాయి.? అందుకే ఆ పాత్రలు కూడా అసహజంగానే అనిపిస్తున్నాయి. మహిళలకు వుండే సహజసిద్దమైన సుకుమారం, సున్నితత్వం.. భావోద్వేగం.. ఇలా చాలా ఎమోషన్స్ వదిలేసే ఎదో కుత్రిమంగా వుండే పాత్రలను సృస్టిస్తున్నారు. అన్నీ చిత్రాలు అని కాదు. దాదాపు సినిమాలు ఇలానే వుంటున్నాయి.
కొంతమంది దర్శకులు అంతే:
హీరోయిన్స్ పాత్రలను అద్భుతంగా తీర్చిదిద్ది దర్శకులూ వున్నారు. బాపుగారి హీరోయిను, విశ్వనాధుని కధానాయిక.. అంటే అదో గౌరవం. కాని ఇప్పుడు హీరోయిన్స్ పాత్రకు ఆ గౌరవం తెచ్చే దర్శకులే కరువయ్యారు. కొంతమంది హీరోయిన్స్ పాత్రలను బ్యాలన్స్ గా చూపిస్తారు, కానీ మరికొందరు మాత్రం హీరోయిన్ అంటే వారి ద్రుష్టిలో ట్రెండీ ట్రెండీ డ్రెస్సులు వేసుకొని అందాల విందు చేసే ఓ మేటిరియల్ మాత్రమే. మరి కొంతమంది దర్శకులైతే హీరోయిన్ పాత్రతోనే బూతులు తిట్టించడమో లేదా హీరోనే హీరోయిన్ పై డబల్ మీనింగ్ డైలాగులు కొట్టడమో జరుగుతుంటుంది. ఫ్యామిలీతో కలసి అలాంటి సన్నీవేషాలు చూస్తున్నప్పుడు తల దించుకోవడం ప్రేక్షకుడి వంతౌతుంది.
చిన్న సినిమాల పరిస్థితి భిన్నం:
పెద్ద సినిమాలతో పోల్చుకుంటే చిన్న సినిమాల్లో ఇంకో పరిస్థితి కనిపిస్తుంటుంది. యూత్ ఫుల్ సినిమాలు అనే బ్రాండ్ లతో వచ్చే చిత్రాల్లో అవసరం లేని రొమాన్స్, ఘాటు సన్నీవేషాలు దట్టించి వదులుతుంటారు. ఎంతసేపు అదే యావతో సాగుతుంటాయి. గుంటూరు టాకీసు, మారుతి ఫ్లాష్ బ్యాక్ సినిమాలు ఈ టైపన్నమాట. ఒక టార్గెట్ ఆడియన్స్ ను సెట్ చేసుకొని అలా వదులుతుంటారు సినిమాలు. ఈలాంటి చిత్రాల్లో హీరోయిన్స్ పాత్రలు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఒక బ్రేక్ కోసం ఎదురుచేసే అప్ కమింగ్ హీరోయిన్స్ మరో ఆప్షన్ లేక ఇలాంటి పాత్రలతో సర్దుకుపొతుంటారు.
లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఆదరణ ఏది?
మిగతా ఇండస్ట్రీలతో పోల్చుకుంటే ఇక్కడ లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఆదరణ తక్కువని తేలిపోయింది. బాలీవుడ్ లో అయితే కంగనా రనౌత్, విద్యాబాలన్ లాంటి నటీమణులు చేసిన చిత్రాలు వందకోట్ల రూపాయిలు కలెక్ట్ చేస్తాయి. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఒకప్పుడు విజయశాంతి లాంటి లేడీ సూపర్ స్టార్ చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. అయితే రాను రాను ఆ ట్రెండ్ మారిపోయింది. బహుసా అనుష్క చేసిన అరుంధతి సినిమా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో ఆఖరి హిట్. ఈ సినిమా తర్వాత మరో విజయం కనిపించలేదు. అనుష్కనే రుద్రమదేవి, సైజ్ జీరో అంటూ మళ్ళీ ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది.
సినిమా కెరీర్ పై మళ్ళీ చిన్న చూపు
పైన చెప్పుకున్న విషయాలన్నీ వెండితెరపై అమ్మాయిల గురించి అయితే వ్యక్తిగతంగా కూడా సినీ పరిశ్రమ అంటే అమ్మాయిలకు ప్రతికూలంగా మారిందిప్పుడు. సినీ పరిశ్రమలో అమ్మాయిలు అంటే మొదటి నుండి ఒక చులకన బావం వుంది. తాజగా సంచలనం ‘’సుచి లీక్స్’’ ఇప్పుడీ భావనను మరింత రెట్టింపు చేసింది. ప్రముఖ కధానాయికల పర్శనల్ ఫోటోలు, వీడియోలు నెట్ లో ప్రత్యక్షమవ్వడం ఇప్పుడు సంచనమైయింది. వీటిలో వాస్తవం ఏమిటనే మాట పక్కన పెడితే సినీపరిశ్రమలో విచ్చలవిడితనం మరోసారి చర్చనీయంశమైయింది. అదే కాదు.. నటి మాధవి లత లాంటి వాళ్ళు తాజగా చెప్పిన కొన్ని విషయాలు ఇంకెంతో అందోళనకరంగా వున్నాయి. ‘ఇక్కడ అమ్మయిలు మానభిమాలతో మనుగడ సాగించలేరని, అలా ఎవరైనా చెప్పుకుంటున్నారని దానికంటే పెద్ద జోక్ ఇంకొకటి వుండదని, ఇక్కడంతా మేటిరియల్ బిజినెస్ అని, ఇక్కడ మన బోడి ట్యాలెంట్ తో సంబధం లేదని, ట్యాలెంట్ చూపించే ముందు వాళ్ళతో కాంప్రమైజ్ కావాలని, లేదంటే వచ్చిన దారినే ఇంటికి వెళ్ళిపోవాలని’ సంచలన వ్యాఖ్యలు చేసింది మాధవి లత. ఈ వ్యాఖ్యలు కూడా సినీ పరిశ్రమలో అమ్మాయిల జీవితాలపై నీలి నీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి.
ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు హీరోయిన్స్ కు ఇచ్చే పారితోషకం కానీ వాళ్ళకు వచ్చే స్టార్ డమ్ కానీ వందరెట్లు ఎక్కువగా వుంది. ఇదే చాలా మందికి ఎట్రాక్ట్ చేస్తోంది. తల్లితండ్రులు కూడా దీనికి అంగీకారం తెలుపుతున్నారు. తమ ఇంట్లో కూడా ఒక సెలబ్రిటీ వుంటే బావుటుంది కదా.. సినీ పరిశ్రమలో కెరీర్ సెట్ చేసుకుంటే తప్పేంటీ భావించారు. కాని ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు, సంఘటనలు బయటకి వచ్చేసరికి వారి మనసూ విరిగిపోతుంది.
నేడు(మార్చి 8) అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అన్ని రంగాల్లో వున్న మహిళల గురించి చర్చ జరుగుతోంది. మహిళా సాధికారత, స్త్రీ ఔనత్యం, సమాజంలో మహిళాల పాత్ర.. ఇలా చర్చ జరుగుతోంది. ఇందులో సినీరంగం గురించి ప్రస్తావిస్తే మాత్రం పైన చెప్పినట్లు మహిళలకు ప్రతికూల ప్రతికూలపరిస్థితులే ఎదురౌతున్నాయిక్కడ.