తాడిపత్రి తెలుగుదేశం ఎమ్మెల్యే జేసీ ప్రభాకర రెడ్డి పేరు వినగానే.. ఆయన నోటి దురుసు తనమే గుర్తుకొస్తుంది. కొద్దిరోజుల కిందట అనంతపురం సాక్షి కార్యాలయం ముందు ఓ టెంటు వేసి మరీ.. విపక్ష నేత జగన్‌పై విమర్శలు చేశారు. ఆ విమర్శలు సెన్సార్ చేసి ప్రసారం చేయాలంటే… ఓ నాలుగైదు పదాలు మాత్రమే వినిపిస్తాయి! ఆ రేంజిలో నోటికొచ్చినట్టు వాగేసి రెచ్చిపోయారు. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండీ, ఒక ప్రతిపక్ష నేతలపై ఇంత దిగజారుడు విమర్శలు చేయడం అనేది గతంలో ఎన్నడూ చూడలేదంటూ చాలామంది ముక్కున వేలేసుకున్నారు. సరే, ఆయన చేసిన విమర్శల్ని జగన్ కూడా లైట్‌గానే తీసుకున్నారు! ఏనుగు వెళ్తుంటే కుక్కలు అరుస్తుంటాయనీ, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని జగన్ అనేసి వదిలేశారు. అయితే, ఈ వ్యవహారంపై ప్రభాకర్ రెడ్డి సోదరుడు, అనంతపురం పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి స్పందించారట..!
ఆయనో రకమైతే ఈయన ఇంకోరకం కదా! అయితే, జగన్‌పై తన సోదరుడు చేసిన విమర్శల్ని దివాకర్‌రెడ్డి కూడా తప్పుబట్టడం విశేషం! తమ్ముడు తొందరపడ్డాడనీ, అనవసరంగా నోరు జారాడని ఆయన వ్యాఖ్యానించారట. ఎవరినైనా సరే, ఆ రేంజిలో అభ్యంతరకరంగా విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారట! అంతేకాదు… ఇదే విషయమై తమ్ముడు ప్రభాకర్‌తో జేసీ మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇలాంటి వ్యాఖ్యలు మున్ముందు మానుకోవాలని తమ్ముడికి చెప్పారనీ, దీని వల్ల వ్యక్తిగత ప్రతిష్టకు ఆటంకం కలుగుతుందనీ జేసీ చెప్పినట్టు సమాచారం!
ప్రభాకర్ వ్యాఖ్యలపై తెలుగుదేశం నుంచి ఎవ్వరూ స్పందించరు! ఎందుకంటే, ఆయన్ని సమర్థిస్తున్నట్టు ఎవరైనా మాట్లాడితే మొత్తానికి పోయేది తెలుగుదేశం పార్టీ పరువు. ఆ విషయం చంద్రబాబుకు తెలియంది కాదు! పైగా, ఇంకోపక్క నందిగామ ప్రమాదానికి కారణమైన బస్సు దివాకర్ ట్రావెల్స్‌దే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, ప్రభాకర్ నోరు తెరవడం వల్ల పొలిటికల్‌గా వైకాపాకి మేలు జరిగిందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమౌతోంది.
తెలుగుదేశం నేతలు క్రమశిక్షణకు మారుపేర్లనీ, వారి నడవడిక హుందా ఉంటుందనీ ఎప్పుటికప్పుడు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ప్రభాకర్ నోరు తెరవడంతో ఆ ఇజ్జత్ అంతా బురదలో పడిందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వ్యక్తమౌతోందట! అందుకే, ఎక్కడో చోట చిన్నదైనా నష్టనివారణ చర్య అంటూ జరగాలి కదా! దాన్లో భాగంగానే తమ్ముడికి అన్నయ్య ఉద్భోద చేసి ఉంటారంటూ కొన్ని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.