2014లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచీ 144 సెక్షన్‌పైన చాలా ఎక్కువగా ఆధారపడుతున్నాడు చంద్రబాబు. రాజధాని భూముల వ్యవహారం, ప్రత్యేక హోదా ఉద్యమం లాంటి పెద్ద పెద్ద విషయాలతో పాటు చిన్న చిన్న విషయాల్లో కూడా 144 సెక్షన్ అనడం, పోలీసులను మొహరించడం బాబుకు బాగా అలవాటయిపోయింది. అత్యంత ఎక్కువ పర్యాయాలు 144 సెక్షన్ విధించిన ముఖ్యమంత్రిగా రికార్డ్ స్థాపించాలని కంకణం కట్టుకున్నాడేమో తెలియదు. 144 సెక్షన్ ఎందుకు అని ఎవరు ప్రశ్నించినా అభివృద్ధి నిరోధకులు అని నింద వేయడం కూడా బాబుకు అలవాటైపోతోంది. సామరస్యంగా ప్రజలకు వివరించి, వాళ్ళ అభిప్రాయాలకు విలువ ఇచ్చి, వాళ్ళ భయాందోళనలను తొలగించి ముందుకెళదామన్న ఆలోచన బాబుకు ఏ కోశానా ఉండడం లేదు. సహనం అనే పదాన్ని తన డిక్షనరీలో నుంచి తీసేశాడేమో తెలియదు. ఇప్పుడు మరోసారి పచ్చని గోదావరి జిల్లాల పల్లెల్లో వందలాది మంది పోలీసులను మొహరించింది బాబు సర్కార్. సంవత్సరం క్రితం నుంచే ఇక్కడ 144 సెక్షన్ విధించి ఉన్నారని స్థానికులు చెప్తున్నారు.
ప్రతి పౌరుడి చేతిలో ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. ఎక్కడకు వెళుతున్నారని పోలీసులు ప్రశ్నిస్తే ప్రజలు సమాధానం చెప్పాలి లాంటి రూల్స్ ఎన్నో అమలవుతున్నాయని స్థానిక ప్రజలు చెప్తున్నారు. పశ్ఛిమ గోదావరి జిల్లా, తుందుర్రుతో పాటు పరిసర గ్రామాల్లో ఆక్వా ఫుడ్ పార్క్ ఏర్పాటును స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. విపక్షాల విషయం పక్కన పెడితే మేధావులు కూడా ఫుడ్ పార్క్ నిర్మాణంతో నీళ్ళు కలుషితమవుతాయని అభిప్రాయపడుతున్నారు. మేధావులతో పాటు, ఆక్వా ఫుడ్ పార్క్‌ని వ్యతిరేకిస్తున్న ప్రజలకు సమాధానం ఇవ్వడం కూడా ప్రభుత్వానికి ఏ మాత్రం ఇష్టం లేకుండో పోతోంది. అందుకే 144 సెక్షన్ విధించి మరీ ప్రజాభిప్రాయ సేకరణ అనే తూతూ మంత్రం తతంగాన్ని పూర్తి చేసింది. ఈ రోజు మరోసారి వందలాది మంది ప్రజలు ఆక్వా ఫుడ్ పార్క్‌కి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం మాత్రం షరా మామూలుగానే పోలీసులతో ఆందోళనకారులను బెదరగొట్టింది. సానుకూలంగా ఉన్నవాళ్ళు ఎంత శాతం మంది, వ్యతిరేకిస్తున్నవాళ్ళు ఎంత శాతం మంది ప్రజలు అనే లెక్కలు ఇప్పుడు చెప్పడం కష్టం కానీ…రాష్ట్రం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలతో పోల్చుకుంటే చాలా చిన్న సమస్య అయిన ఈ ఆక్వాఫుడ్ పార్క్ సమస్యను కూడా చంద్రబాబు ప్రభుత్వం సామరస్యంగా పరిష్కరించలేకపోతోంది. అత్యంత అనుభవజ్ఙుడిని అని చెప్పుకునే చంద్రబాబు అనుభవం ఇలాంటి విషయాల్లో ఎందుకూ కొరగాకుండా పోతోందని రాజకీయ విశ్లేషకులు కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ 144 సెక్షన్, పోలీస్ చర్యలతో అణచి వేసే ప్రయత్నాలు కాకుండా……..ప్రజలను ఒప్పించడం కోసం వేరే మార్గాల్లో ప్రయత్నిస్తే అది చంద్రబాబుకే మంచిది. రాష్ట్రం మొత్తం మీద కూడా అత్యంత ఎక్కువ మంది ప్రజలు టిడిపికి ఓటేసిన జిల్లా వ్యవహారాల విషయంలో సంయమనంతో వ్యవహరించకపోతే జరిగే నష్టం కూడా భారీగానే ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.