దేశాన్ని ఉద్ధరించడం సంగతి దేవుడికి ఎరుక… కానీ, ఈ పేరుతో సామాన్యులను రాచిరంపాన పెడుతోంది కేంద్రంలోని భాజపా సర్కారు! గత నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు అంటూ దేశాన్ని తలకిందులు చేశారు. అవినీతి అంతం అన్నారు, టెర్రరిజం కోరలు పీకుడు అన్నారు, నల్లధనవంతుల భరతం పట్టుడు అన్నారు..! మహాయజ్ఞం.. ప్రసవ వేదన.. వాళ్లిష్టం, నోటికొచ్చిన ఉపమానాన్ని చెప్పేశారు. అంతా జరిగాక ఏం ఒరిగిందీ.. ఏమో, భాజపా సర్కారే చెప్పలేనంతగా ఏదో సాధించేశారు! ఈ క్రమంలో నలిగిపోయిందీ, చచ్చిపోయిందీ, చిచ్చురేగిందీ సామాన్యుడు బతుకుల్లోనే. ఈ అనుభవం చాలదన్నట్టు… ఇప్పుడు కొత్తగా ఛార్జీల మోత అంటూ బ్యాంకులు భయపెడుతున్నాయి. వచ్చే నెల నుంచి విత్ డ్రా ఛార్జీలట, డిపాజిట్ ఛార్జీలట, వాటికి అదనంగా ట్యాక్స్లట!
సామాన్యుడిపై బ్యాంకులు ఈ రేంజిలో బాదుడుకు దిగుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా నోరు మెదపడం లేదు! ఓ పక్క ప్రజల నుంచీ తీవ్ర ఆవేదన వ్యక్తమౌతున్నా… కంటి తుడుపు కామెంట్లతోనే కేంద్రం సరిపెట్టేసింది. ‘ఈ ఛార్జీల మోతపై మరోసారి ఆలోచిస్తే బెటర్’ అనేసి కేంద్రం చేతులు దులుపుకుంది. పెద్ద నోట్ల రద్దుతో పడ్డ దెబ్బ నుంచీ ఇప్పుడిప్పుడే ప్రజలు కోలుకుంటున్నారు. ఈ గాయం మానకముందే మరోసారి బ్యాంకులు బెత్తాలు రెడీ చేసుకుంటే… కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడమేంటీ..? సామాన్యుడిపై భారం మోపేందుకు సిద్ధమౌతుంటే ప్రభుత్వానికి ప్రేక్షక పాత్ర వహించడమేంటీ..? అంటే, ఇక్కడ బ్యాంకులు, ప్రభుత్వం.. ఎవరి ప్రయోజనం వారు చూసుకుంటున్నాయి.
ఈ ఛార్జీల విషయమై బ్యాంకుల వాదన ఏంటంటే… ఖాతాల నిర్వహణ కష్టమౌతోందనీ, ఏటీఎమ్‌ల నిర్వహణకు బోలెడు ఖర్చు అవుతోందనీ, నగదు బదిలీ, ముద్రణ ఇలాంటి పనులకు బాగా ఖర్చు అవుతోందని చెబుతున్నాయి. అందుకే, ఛార్జీల నుంచి ప్రజల నుంచి రాబడితే తప్ప వేరే మార్గం లేదన్నట్టుగా బ్యాంకులు మాట్లాడుతున్నాయి. బ్యాంకుల నిర్వహణ వ్యయాన్ని సమకూర్చుకోవడానికి ఇది వినా వేరే మార్గం లేదన్నది వారి వాదన.
ఇక, ప్రభుత్వం ఈ విషయంలో నోరు ఎందుకు మెదపడం లేదంటే… క్యాష్ లెస్ ఎకానమీ అనే ఒక బ్రహ్మ పదార్థాన్ని ఆ మధ్య జనంపై రుద్దేందుకు ప్రయత్నించారు కదా! పెద్ద నోట్ల రద్దు వల్ల సాధించింది ఇదే అని చూపించే ప్రయత్నం చేశారు కదా! అది ఎలాగూ నెరవేరలేదు. కాబట్టి, ఇప్పుడు బ్యాంకులు ఛార్జీలు వడ్డన పెంచితే… ప్రజలంతా క్యాష్ లెస్ విధానాలకు మళ్లే అవకాశం ఉంది కదా! అది దప్ప వేరే దిక్కు ప్రజలకు ఉండదు కదా. సో.. దాన్ని అంతిమంగా తమ విజయంగా చాటుకోవచ్చని భాజపా సర్కారు వారు భావిస్తున్నట్టున్నారు.
ప్రభుత్వం తీరు చూస్తుంటే… క్యాష్ లెస్ కాదు, బ్యాంక్ లెస్ ఎకానమీ వైపు దేశాన్ని తీసుకెళ్లాలని అనుకుంటున్నట్టుగా ఉంది! అంతేకదా… ఇప్పుడు బ్యాంకుల్లో ఈ ఛార్జ్‌ల మోత ఎక్కువైనా కాస్త కామన్ సెన్స్ ఉన్న కామన్ మెన్ ఎవరైనా చేతిలో డబ్బులు ఉంచుకునేందుకే చూస్తాడు. ఇంట్లో దాచుకోవడమే ఉత్తమం అనుకుంటాడు. ప్రతీ చిన్న లావాదేవీకి బ్యాంకులు వెళ్లడం బుద్ధిలేని పని ఫిక్స్ అయిపోతాడు. దాంతో జరిగేదేంటీ… డబ్బు ఇళ్లలోనే ఉంటుంది. ఆ విధంగా బ్యాంక్ లెస్ ఎకానమీ సాధన కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో మౌన వైఖరిని ప్రదర్శిస్తున్నట్టుగా ఉందనేది సామాన్యుడి ఆవేదన.
అయినా… వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి, దేశాలు దాటి వెళ్లిన విజయ్ మాల్యా లాంటి వాళ్ల విషయంలో ఈ బ్యాంకులు ఏం పీకలేవు! ఐపీలు పెట్టిన వీఐపీలను టచ్ చెయ్యలేవు. వీరి విషయంలో ప్రభుత్వాలు కూడా ఏమీ సాధించలేవు. నిరర్ధక ఆస్తులగా వాటిని ప్రకటించుకోవడం మాత్రమే వీరికి తెలిసిన తెగువ. రెక్కల కష్టం చేసి, చెమటోడ్చిన సొమ్ముతో బతుకు బండి ఈడుస్తున్న సామాన్యులపైనే వీరి ప్రతాపం..! సామాన్యుడి కడుపు మండుతోందన్న విషయం ఇప్పటికైనా అర్థం చేసుకోకపోతే, ఆ మంట వేడి గద్దెమీదున్న పెద్దలకు తగిలే రోజు చాలా దగ్గర్లోనే వచ్చేస్తుంది.