లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ పవన్ కళ్యాణ్‌కు సలహాదారుగా చేరతాడన్నది సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఒక కథనం. జెపి స్వభావం నేపథ్యం తెలిసినవారెవరైనా ఈ కథనాన్ని తీసిపారేస్తారు. ఎందుకంటే జనసేన అంటేనే పవర్ స్టార్ అయినప్పుడు స్వంత ఆలోచనా ఆచరణ వున్న జెపి వంటివారు ఎందుకు వెళ్లి కోరికోరి ఆయన పక్కన చేరతారు? దీనిపై టీవీ9 మురళికృష్ణ ఎన్కౌంటర్లో జెపి సూటిగానే చెప్పారు. నేను వెళ్లి జనసేనలో చేరడమేమిటని ప్రశ్నించారు. సలహాలు అడిగితే ఎవరికైనా ఇస్తామని కూడాచెప్పారు. ఇక పవన్ కూడా తన మార్గంలో తాను వెళతారు తప్ప మరొకరిని తెచ్చిపెట్టుకోవడానికి ఎందుకు సిద్ధమవుతారు? తనకు కావలసిన వారిని కొందరిని ఇది వరకూ నియమించుకున్నారు. ఇంకా తీసుకోవడం క్రియాశీలత పెరగడంపైనే ఆధారపడి వుంటుంది. ఈ లోగానే జెపి పేరిట వూహాగానాలు ఆధారం లేని విషయాలే. యుపిఎ హయాంలో జాతీయ సలహా మండలి సభ్యుడుగా వుండిన జెపి ఎన్డిఎలోనూ అలాటిది వస్తుందని భావించారు. కొన్ని ప్రయత్నాలు కూడా చేశారు. బిజెపిపై నిశిత విమర్శలు గాక సున్నితమైన విమర్శలకే పరిమితమైనారు. అయితే ఇవన్నీ చేసినా బిజెపి నాయకత్వం నుంచి ఆహ్వానం రాలేదు. జెపి వంటివారు సర్దుకున్నా ఏమాత్రం ఉదారవాదం సహించలేని సంఘ పరివార్ అంత తేలిగ్గా ఆమోదించలేదు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యంసమయంలో కూడా జెపితో ప్రత్యేక చర్చలు జరిగినా సఖ్యత సాధ్యం కాలేదు.ఇక ఇప్పుడు ఆయన ఎన్నికలలో పోటీ చేయబోమని ప్రకటించి పాత్ర పరిమితం చేసుకున్న తర్వాత మళ్లీ పిలిచి ప్రాధాన్యత కలిగించే పని జనసేన చేయదు. ఇంత చరిత్ర వుండి మరెవరి వెనకో సలహాదారుడుడా మిగిలే పని జెపి కూడా చేయరు.