2014 ఎన్నికల సమయంలో కులం, మతం, ప్రాంతాలతో సంబంధం లేకుండా ఎక్కువ మంది భారతీయులు బిజెపికి పట్టంకట్టారు. పదేళ్ళ కాంగ్రెస్ అథమ స్థాయి పాలన, అవినీతి వ్యవహారాలతో ప్రజలు బెంబేలెత్తిపోవడం ఒక కారణమైతే మోడీపైన భారీ ఆశలు పెట్టుకోవడం కూడా ఒక కారణం అయింది. రాహుల్ గాంధీ లాంటి పొలిటికల్ కమెడియన్ అప్పొనెంట్గా ఉండడం కూడా మోడీకి భలే కలిసొచ్చింది. కానీ గెలిచిన తర్వాత నుంచీ మాత్రం ప్రజల ఆశలకు, అంచనాలకు అనుగుణంగా పనిచేయడంలో మోడీ ఫెయిల్ అయ్యాడు. కనీసం అవినీతి, నల్లధనం వెలికితీతలాంటి విషయాల్లో కూడా మోడీ సక్సెస్ అయింది ఏమీ లేదు. రాబర్ట్ వాద్రాతో సహా బలవంతులను ఎవ్వరినీ ఏమీ చేయలేకపోయింది మోడీ ప్రభుత్వం. విజయ్ మాల్యా లాంటి వాళ్ళను ఎంచక్కా దేశం దాటించేసింది. ప్రజా సంక్షేమం విషయం పక్కన పెడితే నోట్ల రద్దు లాంటి నిర్ణయాలతో ప్రజలకు చుక్కలు చూపించాడు మోడీ. ఆ ఎఫెక్ట్ ప్రజలపైన బాగానే పడింది.
ఇప్పుడు ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో…మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో బిజెపి అధికారంలోకి వచ్చేస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో ఇప్పుడు కొంతమంది ప్రజల్లో అయినా సరే బోలెడన్ని భయాలు కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే ఇక మోడీని ఆపతరమా అని రాజకీయ విశ్లేషకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశం మొత్తాన్ని ప్రభావితం చేసే స్థాయి నిర్ణయాల విషయంలో కూడా మోడీ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవికి, ప్రధానమంత్రి పదవికి ఉన్న వ్యత్యాసం మోడీకి సరిగా తెలియడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోదాతో సహా రైల్వేజోన్‌లాంటి హామీల విషయంలో హ్యాండ్ ఇచ్చాడు మోడీ. అలాగే బీహార్ లాంటి రాష్ట్రాలకు ప్రకటించిన ప్యాకేజ్ విషయం కూడా ఆ తర్వాత పూర్తిగా మర్చిపోయాడు. ఇలాంటి ఎన్నో తప్పులు చేశాక కూడా బిజెపికి ఘన విజయాలు దక్కాయంటే మాత్రం ఇక మోడీని ఆపతరమా? ప్రస్తుతానికి అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌లాగే మోడీకి కూడా భక్తులూ ఉన్నారు. మోడీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అని భయపడుతున్నవాళ్ళు కూడా ఉన్నారు. 2014కి ఇప్పటికి వచ్చిన మార్పు అదే. ముందు ముందు పరిస్థితులు ఇంకెలా ఉంటాయో చూడాలి మరి.