రాష్ట్ర విభజన విషయంలోనే కాదు అన్నింట్లోనూ ముఖ్యమంత్రి చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతమే! ఇంక నాలుకలైతే లెక్కలేనన్ని..! ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది కూడా! తనకు నచ్చితే ఒకలా నచ్చకపోతే మరోలా… అధికారంలో ఉంటే ఒకలా లేకుంటే మరోలా వ్యవహరిస్తారని సాక్షాధారాలతో సహా వెల్లడవుతున్నా.. ఆయన తీరు ఇసుమంత కూడా మారదనేది బహిరంగ రహస్యమే. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల మీద ఎనలేని ప్రేమ పుట్టుకొస్తుంది… అదే అధికారంలో ఉంటే వారిని అసలు లెక్కేచేయరు. తనకే మొత్తం తెలుసని, తను చెప్పిన మాట వినాలని భీష్మిస్తారు. అది ప్రజల ప్రాణాలకు సంభిందించిన విషయమైనా సరే. తాజాగా అలాంటి ప్రవర్తననే తుందుర్రు ఆక్వాఫుడ్ వ్యతిరేక ఉద్యమకారులపై ప్రదర్శిస్తున్నారు.
తమ ప్రాణాలకు ముప్పు తెచ్చే, పచ్చని పంట పొలాలను బీడుగా మార్చే ఆక్వాఫుడ్ పార్కు తమకు వద్దని తుందుర్రు, కె.బేతపూడి తదితర గ్రామాల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది గమనించిన ప్రభుత్వం దమననీతిని అవలంబిస్తోంది. ఇప్పటికే తుందుర్రు, కె.బేతపూడితోపాటు వాటి సమీప గ్రామాల్లో పోలీసు ఆంక్షలు విధించింది. అక్కడ అప్రకటిత కర్య్పూ వాతావరణం నెలకొంది. తమ గ్రామంలోకి తాము వెళ్లాలన్నా ఆధార్ కార్డు చూపించాల్సి వస్తోందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మహిళా దినోత్సవం రోజు ఉద్యమకారులను పోలీసులు వెంటపడి మరీ అరెస్టు చేశారు. ఆడవాళ్లు, పిల్లలని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా నిర్బంధించి పోలీసు వ్యాన్లలో తరలించారని స్థానికులు వాపోతున్నారు. అయితే, తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే రీతిలో వ్యవహరించే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజల ఆవేదన పట్టలేదు!
టీడీపీ తప్ప ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. ఎక్కడో ఏ మూరుమూలో జరిగే చిన్న ఆందోళనను సైతం పతాక స్థాయిలో ప్రచురించే తెలుగుదేశం అనుకూల మీడియా… టీడీపీ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఏ ఆందోళననూ తీవ్రస్థాయిలో పట్టించుకున్న దాఖలాలు లేవు. అదే తీరు ‘తుందుర్రు’ విషయంలోనూ పునరావృతమైంది. అసలు వార్తే వేయకపోతే మరీ మొదటికే మోసం వస్తుందని తెలుసు కాబట్టి… ఆందోళన తీవ్రతను సాధ్యమైనంతగా తగ్గించే చూపించే ప్రయత్నం చేసింది. ఆందోళనతో ప్రతిపక్ష నాయకులకు ఎక్కడ పేరు వస్తుందోనని ఒక పత్రిక కేవలం ప్రతిపక్షపార్టీ పేరు మాత్రమే ప్రస్తావించగా, మరో పత్రిక ప్రతిపక్ష నాయకులు ఏ పార్టీ వారో రాయకుండా వారి పేర్లు ప్రస్తావించింది. ఏ విషయంలో ఎలా వ్యవహరించాలో టీడీపీ అనుకూల మీడియాకు పుట్టుకతో వచ్చే విద్య.
ఏదేమైనప్పటికీ పచ్చటి పంట పొలాలు, జలకళ ఉట్టిపడే చెరువులు, ఆక్వారంగానికి పెట్టింది పేరైన పశ్చిమగోదావరిలోని డెల్టా మండలాలైన నరసాపురం, పాలకొల్లు, భీమవరం ప్రాంతాలకు ఆక్వాఫుడ్ నిర్మాణంతో ముప్పు పొంచి ఉందనేది కాదనలేని నిజం. ఆక్వాఫుడ్ పార్కు నుంచి విడుదలయ్యే రసాయనాలతో చెరువులు విషతుల్యం అవుతాయని, పచ్చని పొలాలు మసి అవుతాయని, తాగునీరు దక్కని పరిస్థితులు ఏర్పడతాయని, కన్నతల్లి లాంటి ఉన్నఊరిని వదిలిపెట్టి వెళ్లాల్సి వస్తుందని ఆ ప్రాంత వాసులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు!