నిజంగా ఇధి ఆశ్చర్యమే. మన కాశ్మీర్లోని వేర్పాటు వాదులు పాకిస్తాన్ లో కలుస్తామంటున్నారు. అటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు మాత్రం మమ్మల్ని భారత్ లో విలీనం చేయండని కోరుతున్నారు. వినడానికి అతిశయోక్తిలా ఉన్నా ఇది వాస్తవం. కాశ్మీర్ కు చెందిన ఓ మేధావి ఇటీవల పి.ఒ.కె.లో పర్యటించినప్పుడు అక్కడి ప్రజలు చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపోయారట. వారు భారత్ లో విలీనం కావడానికి ఆరాటపడుతున్నారట. అంజుమన్ మిన్హజ్ ఎ రసూల్ అనే సంస్థ చైర్మన్ మౌలానా సయ్యద్ అతార్ హుసేన్ దెహ్లావి ఈ విషయం చెప్పారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ మొదటి నుంచీ పాక్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైంది. అక్కడ ఏమాత్రం అభివృద్ధి జరగడం లేదు. ఆ ప్రాంతాన్ని టెర్రర్ క్యాంపులకు అడ్డాగా మాత్రమే పాక్ ప్రభుత్వం ఉపయోగిస్తోంది. ఇటీవల భూకంపం, వరదలు వచ్చినప్పుడు పాక్ ప్రభుత్వం సహాయ పునరవాసా చర్యలు సరిగ్గా చేయలేదు. బాధితులను పెద్దగా పట్టించుకోలేదు. మరోవైపు, వరదల సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ హుటాహుటిన కాశ్మీర్లో పర్యటించారు. వరద బాధితులను కాపాడటానికి సైన్యాన్ని వెంటనే రంగంలోకి దింపారు. అంతేకాదు, సరిహద్దులకు అవతల ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ వరద బాధితులకు కావాల్సిన సహాయం చేస్తామని ప్రకటించారు.
మోడీ పనితీరు పట్ల పి.ఒ.కె. ప్రజలు ఆకర్షితులవుతున్నారట భారత ప్రభుత్వం అక్కడి కాశ్మీర్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటోంది. మన కాశ్మీర్ టూరిజంతో మళ్లీ కళకళలాడుతోంది. పి ఒ కె మాత్రం వెలవెలబోతోంది. టూరిస్టులు వచ్చే అవకాశం లేదు. యువతకు ఉద్యోగాలు లేవు. అందుకే, రెఫరెండం పెడితే గనగ తాము భారత్ లో కలుస్తామని ఓటు వేస్తామని వారు చెప్తున్నారు. ఇటీవల పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పి ఒ కె వెళ్లినప్పుడు నవాజ్ గో బ్యాక్ అనే నినాదాలు వినిపించాయి. పి ఒ కె ప్రజల ఆలోచనలో వచ్చిన మార్పుకి ఇది సంకేతం అంటున్నారు కాశ్మీరీ మేధావులు. ఇక, పాక్ లోని బెలూచిస్తాన్, కరాచీ వంటి చోట్ల నివసించే ప్రజలు కూడా భారత్ తో ఘర్షణకు బదులు సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నారట. కానీ పాక్ ప్రభుత్వానికి, ఆర్మీకి మంచి బుద్ధి వస్తుందా?