ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఎంత క్రియాశీలంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..! పార్లమెంటులో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని భాజపా సర్కారు అటకెక్కిస్తున్నా ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యారు. విశాఖకు రైల్వేజోన్ ఇస్తామని చెప్పిన కేంద్రం.. ఇప్పటికీ కిమ్మనకుండా ఉంటే, ఆ విషయం గురించి ఎంపీలు మాట్లాడలేరు. ఇవేకాదు… కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినవీ, రాబట్టాల్సినవి చాలానే ఉన్నాయి. కానీ, ఏపీ ఎంపీలు మాత్రం భాజపా భజనకే పరిమితం అవుతూ వస్తున్నారు. భాజపాతో పొత్తు ఉన్నంత మాత్రాన ఏపీ ప్రయోజనాల విషయంలో ఎంపీలు పట్టుదలగా ఉన్నట్టు ఇంతవరకూ కనిపించలేదు.
అయితే, తాజాగా ఏపీకి సంబంధించిన సమస్యలపై కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుతో ఏపీ ఎంపీలు చర్చించారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున్న, ఈ తరుణంలో విభజన సమస్యలతోపాటు పలు అంశాలపై వెంకయ్యతో మాట్లాడారు. ఏపీ సమస్యలపై పలువురు కేంద్రమంత్రులతో వెంకయ్య నాయుడు మాట్లాడారనీ, త్వరలోనే అన్నింటికీ సమాధానాలు లభిస్తాయని ఏపీ ఎంపీలు చెబుతున్నారు. త్వరలోనే నియోజక వర్గాల పునర్విభజన జరుగుతుందనీ, అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసేందుకు కూడా కేంద్రంగా సిద్ధంగా ఉందంటూ ఏపీ ఎంపీ రామ్మోహన నాయుడు మీడియాకి చెప్పారు.
ఇక, విశాఖ రైల్వేజోన్‌పై కూడా త్వరలోనే క్లారిటీ వస్తుందనీ, కేంద్రం సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని చెబుతున్నారు మరో ఎంపీ అవంతి శ్రీనివాస్. ఆ క్లారిటీ ఎన్నాళ్లకి అనేది మాత్రం ఆయన చెప్పలేదు. ఏపీకి సంబంధించి అన్ని విషయాల్లో కేంద్రం అత్యంత సానుకూలంగా ఉందని ఇంకో ఎంపీ మురళీ మోహన్ చెప్పారు. అత్యంత సానుకూలత అనగానేమో ఆయన వివరించలేదు!
విచిత్రం ఏంటంటే… వీరంతా భాజపా నాయకుల్లానే మాట్లాడటం! భాజపాతో పొత్తు ఉంది… కరెక్టే. కేంద్రంతో గొడవలు పెట్టుకోమని కూడా ఎవ్వరూ చెప్పడం లేదు. కానీ, ఏపీ ప్రయోజనాల విషయమై కేంద్రంపై ఒత్తిడి పెంచే తీరు మాత్రం ఇది కాదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. మనకు రావాల్సినవి సాధించుకుందాం అనే ధోరణి ఎంపీల్లో కనిపించడం లేదు. ప్రత్యేక ప్యాకేజీకి ఇచ్చేసి కేంద్రం ఊరుకుంది. దానికి చట్టబద్ధత ఇచ్చేస్తామన్నారు, అవసరమైతే కేంద్రంపై పోరాటం తప్పదని చంద్రబాబు గతంలో అన్నారు. ఇప్పుడా చట్టబద్ధత జోలికే వెళ్తున్నట్టు లేదు. పైగా, నియోజక వర్గాల పునర్విభజనపైనే వీరి ఏకాగ్రత ఉన్నట్టుంది..! ఎందుకంటే, రాజకీయంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కావాల్సింది అదే కదా! ఎంతోమంది ఫిరాయింపు నేతలకు కూడా అవకాశాలు కల్పించాలి కదా! సో.. ఏపీ ప్రధాన సమస్య ఏంటంటే, నియోజక వర్గాల పునర్విభజనే అన్నట్టుగా ఉంది!