మంచు మోహన్ బాబు వారసులు ముగ్గురూ సినిమాలతో మమేకం అయినవాళ్లే. మనోజ్, విష్ణు హీరోలుగా కొనసాగుతోందటే.. లక్ష్మీ ప్రసన్న లేడీ ఓరియెంటెడ్ సినిమాల్ని నమ్ముకొంది. ముగ్గురికీ హిట్సున్నాయి.. ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. అయితే.. ఈసీజన్లో ఈ ముగ్గురికీ ఘోర పరాజయాలు పలకరించాయి. ముందుగా 2017లో విష్ణు నటించిన లక్కున్నోడు విడుదలైంది. ఈ సినిమాకి కనీసం ఓపెనింగ్స్ కూడా దక్కలేదు. విష్ణు కెరీర్లో డిజాస్టర్‌గా మిగిలింది. ఆ వెంటనే మంచు మనోజ్ గుంటూరోడు వచ్చింది. మాస్లో కాస్తో కూస్తో ఇమేజ్ ఉన్న మంచు.. తొలిసారి మాస్ సినిమా చేశాడు. దాంతో వర్కవుట్ అయిపోతుందనుకొన్నారంతా. కానీ.. గుంటూరోడు కూడా గురి తప్పేసింది. ఈ సినిమా కోసం ఏకంగా రూ.11 కోట్లు ఖర్చు పెడితే రెండో మూడో తిరిగొచ్చాయంతే.
ఈ వారం మంచు లక్ష్మి సినిమా లక్ష్మీబాంబ్ వచ్చింది. దీపావళికి రావాల్సిన సినిమా.. ఇప్పుడు వచ్చిదంటేనే ఎంత ఆలస్యం అయ్యిందో, ఈ సినిమాకి ఇంకెంత క్రేజ్ మిగిలి ఉంటుందో అర్థం చేసుకోవొచ్చు. ఏమాత్రం పబ్లిసిటీ లేకుండా… వచ్చిపడిన ఈ బాంబ్… తుస్సుమంది. థియేటర్లు లేక… ఉన్నా… అందులో ఆడియన్స్ లేక బిక్కు బిక్కుమంది. ఈ సినిమాకి రూపాయి పెట్టుబడి పెడితే… రూపాయీ పోయినట్టే అని ట్రేడ్ వర్గాలు అప్పుడే లెక్క గట్టేశాయి. ఈ మాత్రం సినిమాకి పబ్లిసిటీ చేయడం ఎందుకని… ప్రొడ్యూసర్లు కూడా గాలికి వదిలేశారు. మొత్తానికి మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన మూడు సినిమాలూ దారుణంగా పల్టీ కొట్టేశాయి. మనోజ్ బరువు తగ్గి తనకు సూటయ్యే సినిమాల్ని ఎంచుకొంటే బాగుంటుంది. విష్ణు డబ్బు ఖర్చు పెడుతున్నాడు గానీ… విషయం ఉన్న కథల్ని ఎంచుకోవడంలో తడబడుతున్నాడు.
మంచు లక్ష్మి ఖాళీగా ఉండడం ఎందుకులే అని ఏది పడితే ఆ కథ ఒప్పుకోకుండా కాస్త చూజీగా ఉంటే నయం. లేదంటే.. ఈ ఫ్లాపుల పరంపర ఇక ముందూ కొనసాగే ప్రమాదం ఉంది.