సినిమా మొదలయ్యే ముందు ‘మధ్యపానం హానికరం ‘అని చెబుతారు కానీ తాగుడు సీన్ లేని సినిమా వుండదంటే అతిశయోక్తి కాదు. ఎదో సన్నీవేశం ప్రకారం కాదు, కొంతమంది దర్శకులు,హీరోలు ఒక సెంటిమెంట్ గా ముందు సీన్స్ ను కధలో ఇరికించేస్తారు. దర్శకుడు శ్రీను వైట్ల అయితే ఖచ్చితంగా తన సినిమాలో ఒక మందు సీనుతో అలరించేస్తుంటాడు. ఆయనే కాదు చాలా మంది దర్శక రచయితలు తాగుడు సన్నీవేషాలను సినిమాలో వినోదం పంచడానికి వాడుకోవడం చూస్తూనే వున్నాం. ఇప్పుడు అయితే ఏకంగా తాగుడుపై స్పెషల్ సాంగ్ లు పెట్టేస్తున్నారు. మొన్ననే వెంకటేష్ గురు సినిమా కోసం జింగిడి జింగిడి అంటూ ఓ మందు పాట రిలీజ్ చేశాడు.
ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంతువచ్చింది. పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడు. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజ్ చేశారు. ఇప్పుడు మూడో పాట వచ్చింది. ”జివ్వు జివ్వు”అంటూ వచ్చిన ఈ పాట మందుబాబులను ఉద్దేశించినదే. ”రాజులైనా.. బంటులైనా.. కూలీలైనా.. యాపరులైనా.. రాతిరైతే చుక్క కోసం జివ్వి జివ్వు” ఇలా క్యాచి లిరిక్స్ తో సాగిపోయిందీ పాట.
మందు సీన్స్ అంటే పవన్ కళ్యాణ్ ఖుషి గుర్తుకు వస్తుంది. ఇందులో పవన్ కళ్యాణ్ – అలీ -భూమిక ల మధ్య వచ్చే ఆ సీన్ ఇప్పటికీ టీవీలో వస్తే ఛానల్ మార్చకుండా చూస్తారు. ఆ మధ్య గబ్బర్ సింగ్ లో కూడా ఏకంగా మందుబాబులం అంటూ ఓ పాట పెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ కాటమరాయుడులో మందు సాంగ్. మరి ఈ పాట ఎలా అలరిస్తుందో చూడాలి.