నమ్మకానికి లాజిక్‌తో పనిలేదు..! దానికి నిరూపణతో సంబంధం లేదు. అలా జరిగేందుకు ఆస్కారం ఉండదనే తర్కానికీ తావులేదు! సెంటిమెంట్ అంటే సెంటిమెంటే.. అంతే! రాజకీయాల్లో సెంటిమెంట్స్ అనగానే చాలామందికి గుర్తొచ్చేది తెలుగుదేశం పార్టీ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి నమ్మకాలు బాగా ఎక్కువని అంటుంటారు. ఏం చేసినా సెంటిమెంట్ చూసుకుంటారని కూడా చెబుతూ ఉంటారు. అయితే, ఈ నమ్మకానికి తగ్గట్టుగానే కొన్ని పరిణామాలు తాజాగా చోటు చేసుకుంటూ ఉండటం విశేషం. చినబాబు నారా లోకేష్ ఎమ్మెల్సీ అయిన సంగతి తెలిసిందే. బాబు ఎంట్రన్స్‌కు సంబంధించి సెంటిమెంట్ విశ్లేషణ జనాల్లో ప్రారంభమైందట! చినబాబు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తరువాత తెలుగుదేశం మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నది తాజా సెంటిమెంట్‌గా చెబుతున్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన దగ్గర నుంచే సమస్యలు ఎక్కువైనట్టు కొంతమంది విశ్లేషించుకుంటున్నారు. దాదాపు తెర మరుగు అయిపోయిందన్న ఓటుకు నోటు కేసు మరోసారి బిగ్ స్క్రీన్ మీదికి వచ్చింది. ఈ కేసు విషయంలో సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేయడంతో చంద్రబాబు నాయుడు ఖంగు తిన్నట్టయింది. అయితే, ఆ బెదురు ఎక్కడా బయటకి కనిపించకుండా మేకపోతు గాంభీర్యాన్ని బాగానే ప్రదర్శించారనే చెప్పాలి. ఈ కేసుకు బలం లేదనీ, తనకేం కాదని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఆ తరువాత, మంత్రి గంటా శ్రీనివాసరావుకు సంబంధించి అప్పు ఎగవేత కేసులపై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇంకోపక్క.. స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడుకి సంబంధించిన మరో కేసు కూడా వెలుగులోకి వచ్చింది.
ఇవన్నీ చాలవన్నట్టుగా… యూపీలో భాజపా అధికారంలోకి వచ్చింది! యూపీ ఎన్నికలకీ చంద్రబాబుకీ ఏంటి సంబంధమంటే… ప్రధాని మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ రానూరానూ మరింత బలం పుంజుకుంటోంది కదా! మోడీ హవా బాగా పెరుగుతున్న కొద్దీ ఢిల్లీలో చంద్రబాబు పప్పులు ఉడికే పరిస్థితి కూడా అదే క్రమంలో తగ్గుతూ ఉంటుంది కదా! పైగా, ఓటుకు నోటు కేసుతోపాటు, పలు కీలకాంశాలకు సంబంధించిన సమాచారాన్ని గవర్నర్ ద్వారా ఈ మధ్యనే కేంద్రం తెప్పించి, ఫైల్ చేసుకున్నట్టు కూడా కథనాలు వినిపించాయి.
నిజానికి, ఇవన్నీ వేర్వేరుగా చోటు చేసుకున్న పరిణామాలు. వీటినీ నారా లోకేష్‌కు ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేదు. ఈ పరిస్థితులను ప్రభావం చేసేంత సీన్ కూడా లేదు. కాకపోతే… సెంటిమెంట్ విషయానికి వచ్చేసరికి లాజిక్స్ ఎవ్వరూ పట్టించుకోరు. మ్యాజిక్స్ మాత్రమే కనిపిస్తాయి! ఏదేమైనా, చినబాబు ఎమ్మెల్సీ ఎంట్రీ తరువాతే ఈ పరిణామాలన్నీ… ముఖ్యంగా తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టే పరిణామాలు చోటు చేసుకోవడం కాకతాళీయమే కావొచ్చు. కానీ, సెంటిమెంట్ సెంటిమెంటే కదా..!