రాజకీయ పండితులను అంచనాలను తిరగరాస్తూ… ఎగ్జిట్ పోల్ లెక్కల్ని తారుమారు చేస్తూ ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. దాదాపు 14 సంవత్సరాల తరువాత అధికారాన్ని హస్తగతం చేసుకుంది. దేశంలో మోడీ వ్యతిరేక పవనాలు మొదలయ్యాయనే వారి నోళ్లను మూయించేలా విజయకేతనం ఎగురవేసింది. ఈ విజయం వెనక పకడ్బందీ వ్యూహమంతా అమిత్ షాది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఏ రాష్ట్రంలో క్యాంప్ వేస్తే… అక్కడ అధికారంలోకి వచ్చే వరకూ విశ్రమించరు అనేది మరోసారి నిరూపితమైంది. యూపీ ఎన్నికల ఫలితాలు భాజపాకి నయా జోష్ ఇచ్చాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ ఊపును కొనసాగిస్తూ… భాజపా తన తరువాత టార్గెట్‌ను సెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. భాజపా తరువాతి లక్ష్యం… ‘ఆపరేషన్ తెలంగాణ’ అని విశ్వసనీయంగా తెలుస్తోంది.
తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు భాజపా సిద్ధమౌతోందని సమాచారం. రాష్ట్ర పార్టీ నేతలకు ఈ మేరకు ఇప్పటికే కొన్ని సిగ్నల్స్ వచ్చాయనీ అనుకుంటున్నారు. అవసరమైతే కొత్త నాయకత్వం కింద రాష్ట్ర నేతలంతా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలంటూ పై నుంచి సూచనలు వచ్చాయనీ చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో పార్టీ ముఖ చిత్రం రాబోయే ఆరు నెలల్లో గణనీయంగా మారిపోతుందనీ, 2019 లక్ష్యంగా పార్టీని బలోపేతం చేసేందుకు మరింత కష్టపడి పనిచేయాల్సి ఉంటుందని రాష్ట్ర నేతలకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. అంతేకాదు… రాష్ట్రంలో పార్టీని అమాంతంగా పైకి తీసుకురావాలంటే మాంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడి అవసరాన్ని కూడా భాజపా పెద్దలు గుర్తించినట్టు సమాచారం. ఆ స్థాయి నాయకుడి కోసం భాజపా ఎదురుచూస్తున్నట్టుగా కూడా కథనం..!
అమిత్ షా ఏ రాష్ట్రానికి వెళితే… ఆయనతోపాటు కొంతమంది నిపుణుల బృందం కూడా అక్కడే తిష్ట వేస్తుందట! పార్టీకి సపోర్ట్‌గా ఉంటూ వస్తున్న నిపుణుల బృందం ఇకపై కొన్నాళ్లపాటు తెలంగాణపై ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఆపరేషన్ త్వరలోనే ప్రారంభం అవుతుందనీ, అంతకుముందుగా రాష్ట్రంలో మూడు రోజులపాటు పర్యటించేందుకు అమిత్ షా తెలంగాణకు వస్తున్నారని సమాచారం.
యూపీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని కొనసాగించేందుకు భాజపా సర్వం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, భాజపా అన్వేషిస్తున్న ఆ ప్రముఖ నాయకుడు ఎవరనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగానే ఉంది..? ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక ప్రముఖ కీలక నేతపై భాజపా కన్ను ఉందనే వార్తలు వచ్చినా.. ఆ నాయకుడిపై కేసులు ఉండటంతో, ఇప్పట్లో ఆ ప్రతిపాదనను తీసుకురావడం సరికాదని భాజపానే స్వయంగా వెనక్కి తగ్గినట్టుగా కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది..! మొత్తానికి, ఆపరేషన్ తెలంగాణ షురూ చేసుడు మాత్రం కచ్చితమన్నట్టు..!