ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. యూపీలో భాజపా పాగా వేసింది. వరుసగా ఒక్కో రాష్ట్రాన్ని తన హస్తగతం చేసుకుంటూ భాజపా ముందుకు సాగుతోంది. ఈ తరుణంలో ప్రాంతీయ పార్టీలు నేర్చుకోవాల్సిందేంటి..? యూపీ ఫలితాల నుంచి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అర్థం చేసుకోవాల్సింది ఏంటీ..? ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ప్రజా తీర్పు ఎలా మారింది..? ఏయే అంశాలపై ప్రజలు ఆగ్రహించారు..? ఇలాంటివన్నీ అటు తెరాస, ఇటు టీడీపీ విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కుటుంబ పాలన, రాజకీయ వారసత్వ ధోరణి.. వీటిని ప్రజలు సహించడం లేదన్నది తాజా ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. ఇకపై, ప్రాంతీయ వాదాలు, ఉచిత హామీలు, కుల, మత ప్రాతిపదిక మనుగడ సాగిస్తున్న రాజకీయ పార్టీల్లో ప్రజల్లో ఏవగింపు మొదలైందని ఈ ఫలితాలు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌నే తీసుకుంటే… యూపీ పాలనలో కుటుంబ జోక్యం పీక్స్‌కి చేరిపోయింది. ఒకే కుటుంబానికి పెద్ద ఎత్తున సీట్లివ్వడం, ఇంటి గొడవల్ని జనంమీద రుద్దేయండం, ఈ గొడవల్లోపడి అభివృద్ధిని పట్టించుకోకపోవడం… ఇవే ఎస్పీకి చేటు తెచ్చిపెట్టాయి. పంజాబ్‌లో కాంగ్రెస్ గెలుపు వెనక కారణాలు కూడా అకాలీదళ్‌పై వ్యతిరేకతే. ఆ రాష్ట్రంలో బాదల్ కుటుంబ వ్యవహార శైలి మితిమీరిపోయింది. ఆ కుటుంబంపై ప్రజల్లో ఒక రకమైన చిరాకు వచ్చింది. దీంతో బాదల్ ఫ్యామిలీని ఘోరంగా ప్రజలు ఓడించారు.
దీంతోపాటు… ఉచిత హామీలు, కులాల ప్రాతిపదికన అభివృద్ధి, ప్రజలను ఓటు బ్యాంకుగా చూసే ధోరణులపై కూడా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని తాజా ఫలితాలు తేటతెల్లం చేశాయి. అధికారంలో ఉంటూ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటూ పాలన సాగించినా కూడా ప్రజలు సహించడం లేదు. తాజా ఎన్నికల ఫలితాల్లో ఈ కోణాలను అర్థం చేసుకోవాలి. లేదంటే, ప్రజలు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. ఈ మార్పును గమనించాల్సిన అవసరం ప్రాంతీయ పార్టీలకు అత్యావశ్యకం.
మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే… కుటుంబ పాలన ఛాయలు కనిపిస్తున్నాయి, వారసత్వ రాజకీయ ధోరణులూ బాగానే ఉన్నాయి. ముఖ్యమంత్రులిద్దరూ తమ తరువాతి తరాన్ని ఎస్టాబ్లిష్ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలేవీ ప్రజలకు అర్థం కానివి కావు. తెరాస, టీడీపీలు ఉచిత హామీల మీదే ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. ఇక, కుల సమీకరణల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ విషయంలో తెలంగాణ కంటే ఆంధ్రాలో కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఉందని చెప్పుకోవాలి. ఇక, అడ్డగోలు నిర్ణయాలు, అభివృద్ధి పేరుతో దుబారా వ్యయం, వ్యక్తిగత కార్యక్రమాలకూ ప్రజాధనం దుర్వినియోగం… ఇలాంటి లక్షణాలు చాలా ఉన్నాయి. ఇలాంటి రాజకీయాలపై ప్రజల్లో విరక్తి మొదలైందన్నది అర్థం చేసుకోకపోతే… వచ్చే ఎన్నికల నాటికి ప్రజలు ప్రత్యామ్నాయం చూసుకుంటారనేది వాస్తవం. మరి, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా విజయం సాధించిందనీ, మనమూ మిత్ర పక్షాలం కాబట్టి జబ్బలు చరుకుని సంబరపడిపోతే చాలని మన ప్రాంతీయ అధికార పార్టీలు భావిస్తే… భారీ మూల్యం చెల్లించాల్సి రావొచ్చు. ప్రజలు మారుతున్నారు… దీన్ని గమనించాల్సిందే.