ఈనెల 26న బాహుబలి 2 ఆడియో వేడుక జరగబోతున్న సంగతి తెలిసిందే. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈ వేడుక నిర్వహించాలని చిత్ర బృందం ఫిక్స్ అయ్యింది. అయితే అందరూ అనుకొంటున్నట్టు మహీష్మతీ సెట్లో కాకపోవొచ్చు. మహీష్మతీ సెట్లో వేడుక జరపాలంటే సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తోందట. పైగా రామోజీ ఫిల్మ్‌సిటీ మెయిన్ గేట్ నుంచి మహీష్మతీ సెట్ చాలా దూరం. ఎక్కడి నుంచో వచ్చే అభిమానులకు.. ఫిల్మ్‌సిటీ లోపలకు వెళ్లడం ఇబ్బంది కలిగించే విషయమే. అందుకే… ఫిల్మ్‌సిటీ మెయిన్ గేట్ దగ్గరే ఆడియో కోసం ప్రత్యేక సెట్ వేయాలని… చిత్రబృందం నిర్ణయించుకొందట. అంతేకాదు.. ఈ వేడుకకు అతిథులెవ్వరినీ పిలవకూడదని భావిస్తోంది. కేవలం చిత్రబృందం సమక్షంలోనే ఆడియో విడుదల చేస్తారు.
మరోవైపు ఆడియో వేడుకల్ని ప్రసారం చేయడానికి టీవీ ఛానళ్లు పోటీ పడుతున్నాయి. అయితే ఆ ఛాన్స్ మూడే మూడు ఛానళ్లకు దక్కింది. టీవీ9, మాటీవీ, ఎన్టీవీలలో బాహుబలి 2 ఆడియో వేడుకల్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడొచ్చు. ఈ మూడు ఛానళ్లు కలిసి దాదాపు కోటి రూపాయల్ని ఆడియో లైవ్ రైట్స్కింద బాహుబలి బృందానికి కట్టబెట్టాయని తెలుస్తోంది. అంతేకాదు… యాడ్ రెవిన్యూలో 50 శాతం బాహుబలి నిర్మాతలకే చెందుతాయట. ఈనెల 16న బాహుబలి 2 ట్రైలర్‌ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లలో ప్రదర్శించబోతోంది టీమ్. అందుకోసం చిత్రబృందం పంపిణీదారులతో మంతనాలు జరుపుతోంది. రేపటికల్లా ఏయే థియేటర్లో బాహుబలి 2 ట్రైలర్ ప్రసారం చేస్తారో తెలిసే అవకాశాలున్నాయి.