రాజకీయమంటే రాజకీయమే. శుభాశుభాలతో విషాద వినోదాలతో సంబంధం లేకుండా ఎప్పటి లెక్కలు అప్పుడు నడుస్తుంటాయి. భామానాగిరెడ్డి మరణంపై విచారం వెలిబుచ్చుతూనే మరోవైపున దాని రాజకీయ ప్రభావం గురించిన చర్చలు మొదలైనాయి. భూమా మొదటి నుంచి కీలక పాత్ర వహిస్తున్నప్పటికీ మంత్రి పదవి రాలేదన్న కొరత వుండిపోయింది. దీనికి ప్రత్యర్థి వర్గీయుల ఒత్తిళ్లే కారణమన్న అభిప్రాయం వారిది. అయినా వచ్చే విస్తరణలో ఆయనకు తప్పక మంత్రి పదవి వస్తుందనే భావించారు. ఒక దశలో ఆయనకు గాక కుమార్తె అఖిలప్రియకు ఇవ్వడం ద్వారా ఇటు కుటుంబానికి అటు యువతకు మహిళలకు కూడా ప్రాతినిధ్యం కల్పించినట్టవుతుందని అంచనా వేశారు.దీనిపై ఎన్టివి ఇంటర్వ్యూలో ఫ్రశ్నించినప్పుడు అది ముఖ్యమంత్రి చంద్రబాబు ఇష్టమని ఎవరు అడ్డుపడ్డం కాదని భూమా జవాబిచ్చారు. అఖిల ప్రియకు ఇస్తామంటే తండ్రిగా దాన్ని వ్యతిరేకించడం అధ్వాన్నంగా వుంటుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అనుకోని రీతిలో ఆయన మరణించిన అనంతరం ఆ విధంగానే అఖిల ప్రియను మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి. కొన్ని సమస్యలున్నప్పటికీ ఆమె ఎంఎల్ఎ అయ్యాక బాగానే పనిచేస్తున్నారు,మాట్లాడుతున్నారు బహుశా ఖాయంగా ఇవ్వొచ్చు.
ఇక నంద్యాల ఉప ఎన్నిక విషయానికి వస్తే మరణించిన ఎంఎల్ఎల కుటుంబ సభ్యులకే ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే ఇక్కడ భూమా వైసీపీ తరపున గెలిచి టిడిపిలో చేరారు గనక అనర్హుడిగా ప్రకటించాలని ఆ పార్టీ అడుగుతూ వచ్చింది. కనుక ఈసారి ఆ రివాజు పాటించకుండా పోటీ పెట్టాలనే వైసీపీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఆ సీటు మాకే ఇవ్వాలని కూడా వాదన పెడదామని కొందరంటున్నారు.సానుభూతి నేపథ్యంలో ఇక్కడ పోటీ చేసి గెలిస్తే దాన్ని రెఫరెండంగా చెప్పుకోవచ్చని పాలక పక్షంలోమరో వాదన వినిపిస్తున్నది. అయితే రాయలసీమ సెంటిమెంటు పనిచేస్తే పరిస్థితి ప్రతికూలం కావచ్చని ఇక్కడ ఓడిపోవడం తప్పు సంకేతాలు ఇస్తుందని కర్నూలు నేతలు కొందరు చెబుతున్నారట. కాంగ్రెస్ కూడా ఉనికి చాటుకోవడానికి రంగంలోకి దిగొచ్చు.ఏమైనా మొత్తంమీద నంద్యాల శాసనసభ ఉప ఎన్నికల ఆసక్తికరం అవుతుంది.ఇన్ని మరణాల తర్వాత భూమా కుటుంబం నుంచి మరొకరిని ఎంపిక చేయడం సాద్యమా అఖిలప్రియను మంత్రిని చేస్తే సరిపోతుంది కదా అని కూడా వ్యాఖ్యలు వస్తునన్నాయి.వారు కూడా విచారంలోనే తమ కటుంబం ప్రజలతో వుంటుందని,నాయకత్వ లక్షణాలున్నాయని భూమా కుమార్తెలు, బంధువులు, బావ ఎంఎల్ఎ ఎస్వీ మోహనరెడ్డి చెప్పడం తమ స్థానాన్ని కాపాడుకోవడానికే. ఏమైనా జగన్ వద్దనుకుంటే తప్ప ఇక్కడ ఎన్నికల హౌరాహౌరీగానే జరగొచ్చు.