రాజకీయ నాయకులకు చాదస్తం ఎక్కువ ఉంటుందో…లేక కొత్తగా ఆలోచించడానికి అవసరమైన తెలివితేటల కొరత ఉంటుందో తెలియదు కానీ దశాబ్ధాలుగా ఒకటే రకమైన రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఈ రోజు తెలంగాణా బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో కూడా అలాంటి కామెడీనే చేశాడు ఈటెల రాజేందర్. ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతున్నాం అనే ఒక రొటీన్ డైలాగ్ పేల్చాడు. రాజకీయాల్లో ఇంతకంటే పాత చింతకాయపచ్చడి డైలాగ్ ఇంకోటి ఉండదు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ప్రతివాడు పాత రోతను కడిగేస్తాననే చెప్తూ ఉంటాడు. ఇక కొత్తగా అధికారంలోకి వచ్చిన సందర్భంలో ప్రతి రాజకీయ నాయకుడు చెప్పే రొటీన్ డైలాగ్….‘పాత వాళ్ళు చేసిన తప్పులు సరిదిద్దుతున్నాం’ అనే.
2014లో అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే అంతకుముందు పదేళ్ళ పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాల గురించి చెప్పడానికి నెలల తరబడి సమయం తీసుకున్నాడు. రోజుల తరబడి మీడియాకు వివరించాడు. విభజన పాపంలో తనకూ, తన మిత్రపక్షం బిజెపికి కూడా భాగం ఉన్నప్పటికీ ఆ పాపాన్ని, నష్టాలను మొత్తం కాంగ్రెస్ అకౌంట్లో వేసేశాడు. ఇక చంద్రబాబు చెప్పిన మాటల సారాంశం మొత్తం ఒక్కటే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేసింది. 2004 నాటికి నేను ఎక్కడికో తీసుకెళ్తే…2004 నుంచి 2014 వరకూ పదేళ్ళ పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని జీరో స్థాయికి తీసుకెళ్ళింది అని చెప్పుకున్నాడు. ఇలా చెప్పుకోవడంతో చంద్రబాబు అంతరార్థం ఒక్కటే. నా గొప్పను గుర్తించండి అని ప్రజలకు విన్నవించుకోవడం. అలాగే ఎన్నికల సమయంలో చూపించిన అద్భుతాలు నెరవేర్చాలని నాకు బలంగా ఉన్నా…కాంగ్రస్ పుణ్యమా అని నాశనం అయిపోయిన రాష్ట్రాన్ని జీరో నుంచి బాగు చేస్తున్నాను కాబట్టి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై మరీ ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దన్నదే చంద్రబాబు చెప్పాలనుకున్న అసలు విషయం. అప్పటి నుంచీ సందర్భం వచ్చినప్పుడల్లా…ఆంధ్రప్రదేశ్ వెనుకబాటుతనానికి సంబంధించిన ఏ వార్తని అయినా సరే కాంగ్రెస్ పార్టీ పాలనకు ముడిపెడుతూ ఉంటారు చంద్రబాబు అండ్ కో. అధికారంలోకి వచ్చి మూడేళ్ళు కావస్తున్నప్పటికీ …ఇప్పటికీ అదే తీరు. రేపు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రవేశ పెట్టే సందర్భంలో కూడా అదే పాత పాట పాడతారనడంలో సందేహం లేదు.
ఇక ఆంధ్రప్రదేశ్‌ని సర్వనాశనం చేసి అన్ని సౌకర్యాలతో, భారీ మిగులు బడ్జెట్‌తో తెలంగాణాను కెసీఆర్ చేతుల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అందుకే అధికారంలోకి వచ్చిన కొత్తలో కెసీఆర్‌కి పాత వాళ్ళు చేసిన తప్పుల గురించి మరీ ఎక్కువ మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఆ ట్రెండ్ స్టార్ట్ చేశారు టిఆర్ఎస్ నాయకులు. టిడిపి, కాంగ్రెస్ పార్టీలను ఒకేగాటన కట్టేసి…మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలను చక్కదిద్దడానికే మాకు టైం అంతా సరిపోతుందని ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ రోజు తెలంగాణా ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ కూడా అదే కథ వినిపించారు. అయినా అధికారంలోకి వచ్చిన కొత్తలో చంద్రబాబు అందుకున్న పాటను….అధికారంలోకి వచ్చి మూడేళ్ళవుతున్న సందర్బంలో టిఆర్ఎస్ వాళ్ళు ఎందుకు అందుకున్నారా అనే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ఆలోచిస్తున్నారు. ప్రజలకు ఉచిత హామీలు ఇచ్చే విషయంలో కెసీఆర్‌ది కూడా వైఎస్ రాజశేఖరరెడ్డి తరహానే. బడ్జెట్ లెక్కలు చూసుకోకుండా తోచిన హామీలు అక్కడికక్కడే ఇచ్చేస్తుంటాడు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ డౌన్ అవడం, భూముల రేట్లు తగ్గడంలాంటి ఇంకా ఎన్నో కారణాల రీత్యా ఆదాయం అయితే అంచనాలకు తగ్గట్టుగా ఉండడం లేదు. అయినప్పటికీ బడ్జెట్ లెక్కల ఆడంబరాల విషయంలో తగ్గడం అనేది మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అస్సలు ఇష్టం ఉండదు. లెక్కలు మాత్రం ఏటికేడు పెరుగుతూనే ఉండాలి. అందుకోసం అప్పులు కూడా భారీగానే చేస్తున్నారు. అప్పులు చేయడం విషయంలో మాత్రం వైఎస్, చంద్రబాబుల కంటే ఎక్కువ జోరు చూపిస్తున్నాడు కెసీఆర్. ఇలా కెసీఆర్ చేస్తున్న తప్పులన్నింటినీ కాంగ్రెస్‌కి ఆపాదించే ప్రయత్నాలు ఏవో మొదలెట్టినట్టున్నారు కెసీఆర్ టీం. అసలే కోదండరామ్-కాంగ్రెస్ పార్టీలు కలిసి 2019లో కెసీఆర్‌కి ఝలక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో కెసీఆర్‌కి కూడా ఇప్పుడు అర్జెంట్‌గా పాత పాలకుల పాపాలు అన్నీ గుర్తొస్తున్నట్టున్నాయి.
అంతా బాగానే ఉందిగానీ అధికారంలోకి వచ్చిన ప్రతివాళ్ళూ ఇలా పాత వాళ్ళ తప్పులు సరిదిద్దడంలోనే పుణ్యకాలం అయిపోతుందని చెప్పి మాటలతో కాలం గడిపేస్తూ ఉంటే ఓటేసిన ప్రజలకు ఒరిగేదేంటో?