బిజెపికి జవహర్లాల్ నెహ్రూ అన్నా ఆయన భావాలన్నా మింగుడు పడవన్నది అందరికీ తెలిసిందే. ఆయనకు పోటీగా సర్దార్ పటేల్‌ను పైకి తీసుకురావడానికి పెద్ద విగ్రహమే కట్టిస్తున్నారు. అలాటిది ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీని జవహర్లాల్ నెహ్రూతో పోలిస్తే విచిత్రంగా వుండదూ? అందులోనూ స్వయంగా ఆ పార్టీ అద్యక్షుడు మోడీ ఆత్మ వంటి వారు అయిన అమిత్‌షా ఈ పనిచేశారు. ఉత్తర ప్రదేశ్‌లో ఉధృత విజయం తర్వాత మోడీతో తులతూగే నాయకుడే లేకుండా పోయాడని ఆయన విజయోత్సవంలో అన్నారు. మొదటి ప్రధాని నెహ్రూ తర్వాత అంత ప్రసిద్ధి మోడీకే దక్కిందని చెప్పారు. మామూలుగా మోడీని శక్తివంతమైన ప్రధానిగా ఇందిరాగాంధీతో పోలుస్తుండేవారు. ఇప్పుడు ఆమెకన్నా కూడా మించి పోయారని చెబుతున్నారన్నమాట. వ్యాఖ్యాతలు కూడా 2019 ఎన్నికల్లో మోడీ విజయం ఖాయం చేసేస్తున్నారు.
ఇందిరాగాంధీ హత్య తర్వాత 1984లోక్‌సభ ఎన్నికల్లో రాజీవ్్గాంధీ కూడా ఇంత బ్రహ్మాండమైన విజయం సాదించినా వెంటనే వచ్చిన శాసనసభ ఎన్నికలనాటికే అది దిగజారింది. కాని మోడీ యుపిలో 2014 మే ఎన్నికల విజయాన్ని యథాతథంగా నిలబెట్టుకున్నారు. ప్రత్యర్థిపార్టీల ఓట్ల చీలిక ఇందుకు కారణమన్నది కనిపిస్తున్నా బిజెపి అందులోనూ మోడీ ప్రభావాన్ని కూడా విస్మరించడానికి లేదు.బిజెపికి అలవాటైన హిందూత్వ రాజకీయాలను మోడీత్వతో మేళవించడం ఈ విజయానికి మూల కారణం. ఎస్పి చీలికలు బిఎస్పి కుప్పకూలిపోవడం మరింతగా దోహదం చేశాయి. ఏమైనా అంతిమంగా ఈ ఘనత మోడీ ఖాతాలోకే చేరడం సహజం.
గతంలో కాంగ్రెస్‌ను దెబ్బతీసి బలంపెంచుకున్న బిజెపి ఇటీవల వరుసగా వివిధ ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసి లేదా జూనియర్ భాగస్వాములుగా చేర్చుకుని ముందుకు పోతున్నది. మహారాష్ట్రలో శివసేనతో దాగుడుమూతలాడుతున్నది. కాశ్మీర్లో పిడిపిని తన షరతులపై కలుపుకున్నది.అసోం లో ఎజిపిని వెనక్కు నెట్టేసింది. ఈశాన్యరాష్ట్రాలలోనూ పాగా వేస్తున్నది. అమిత్ షా వ్యూహం నిర్మాణం మోడీ ప్రచారంతో పాటు ఆరెస్సెస్ ఆశీస్సులు కూడా దీని వెనక వున్నాయి.ప్రతిచోటా ఒక ఆరెస్సెస్ సిద్ధాంత కర్త ముందే వెళ్లి మకాం వేస్తుంటాడు.కనుక మోడీ వ్యక్తిగత ఘనతనే చూపిస్తూ ఈ భావజాలాన్ని దాని పర్యవసానాలను కూడా గుర్తించడం అవసరం. చాలా మంది రాసినట్టు ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా నిలబెట్టకుండా బిజెపి ఈ అఖండ విజయం సాదించింది. మరి దీని ప్రభావం ముందుముందు వుండదా అంటే వుండకపోదు.అలాగే కర్ణాటక మినహా దక్షిణాది రాష్ట్రాలు ఇంకా దానికి అందుబాటులోకి రాలేదు. అక్కడ కూడా ఇలాటి వ్యూహాలే చేస్తే దృశ్యమే మారిపోతుంది. మోడీ మత్తులో ఈ వాస్తవాలు కూడా మరుగుపడకూడదు.