ఈ సారి తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన లక్షా 49 వేల కోట్ల బడ్జెట్లో విశేషమేమంటే ప్రభుత్వం అదేపనిగా చెప్పిన డబుల్ బెడ్రూంలకు అస్సలు కేటాయింపులే చూపించకపోవడం! దీనికి హడ్కో రుణాల వంటివే ఆధారమని భావించినా బడ్జెట్లోనూ ఎంతోకొంత వుంటుందని అందరూ ఆశించారు. వాస్తవానికి ఈసారి నిర్మాణాత్మక కేటాయింపుల కన్నా వివిధ సామాజిక తరగతులను ఆకట్టుకునేందుకు ముఖ్యమంత్రి వాగ్దానాల అమలు కోణంలోనే కేటాయింపులు చూపించారు. 360లో గతంలో చెప్పుకున్నట్టు నాలుగు కులాలను కెసిఆర్ ప్రాధాన్యతగలవిగా గుర్తించారు.కురమలు ముదిరాజ్లు నాయీ బ్రాహ్మలు చేనేత వారు ఈ కోణంలోనే కేటాయింపులు చేశారు. అందుకు తగినట్టే ఆ కులాల నాయకులు ముందే సిద్ధంగా వుండి బడ్జెట్ పూర్తికాగానే క్షీరాభిషేకాలు భజన కీర్తనలు ఆలపించారు. చేశారనడం కన్నా చూపారనడం సమంజసం. ఎందుకంటే గతంలో కేటాయించిన చాలా పద్దులు ఖర్చు కాకుండా వుండిపోయాయి. నీళ్లు నిధులు నియామకాలంటూ కోటి ఎకరాల నీరు పల్లవి వినిపిస్తున్నా ప్రాజెక్టులకు కేటాయింపులు మాత్రం 25 వేల కోట్లకు పరిమితమైనాయి. అవైనా రీడిజైనింగు జరిగి అమలులోకిరావడానికి ఇంకా చాలా సమయం కావాలి. ఈలోగా ఎన్నికలు వచ్చేస్తాయి.కనుక కీలకమైన మరో నినాదం ఈ పదవీ కాలంలో నెరవేరదు. కోరి కోరి ఏర్పాటు చేసిన 31 జిల్లాల మౌలిక సదుపాయాలు కూడా అరకొరగావున్నా నిర్దిష్ట ప్రతిపాదనలు రాలేదు. రైతుల ఆత్మహత్యలో ముందు వరసన వున్నా వ్యవసాయానికి కేటాయింపులో పెద్ద మెరుగుదల లేదు, విధానపరమైన సమగ్రతా లేదు. రుణమాఫీ ఫీజు రీ ఇంబర్సుమెంటు పద్దులు కూడా పాక్షికంగానే వున్నాయి. రెవెన్యూ మిగులు 4 వేల కోట్లు చూపించినా లక్ష ఖాళీలు భర్తీ చేయలేదన్న వాస్తవం కళ్లముందు కనిపిస్తుంది. అలాగే అప్పు అపారంగా పెరిగి లక్షా 40 వేల కోట్లకు చేరనున్నది. ద్రవ్యలోటు 20 వేల కోట్లకు పైగావుంది. చెల్లింపులు ఆశించిన స్థాయిలో లేవు. అందుకే చాలా కోణాల్లో ఈ బడ్జెట్ నిరుత్సాహం కలిగిస్తుంది.