మైక్రోసాఫ్ట్, గూగుల్, పెప్సీ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇప్పుడు భారతీయుల చేతికే తమ సంస్థ పగ్గాలు అప్పజెపుతుండటం విశేషం. తాజాగా మరో ప్రముఖ అంతర్జాతీయ సంస్థ-ట్వీటర్ సామాజిక వెబ్ సైట్ కూడా తమ సంస్థ పగ్గాలను భారతీయులకే అప్పజేప్పేందుకు సిద్దం అవుతోంది. ఈసారి ఆఖ్యాతి విజయవాడకు చెందిన పద్మశ్రీ వారియర్ అనే మహిళకు దక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు ట్వీటర్ సి.ఈ.ఓ.గా వ్యవహరించిన డిక్ కొస్టోలో ఈ ఏడాది జూన్ నెలాఖరున పదవీ విరమణ చేసారు. అప్పటి నుండి ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. ప్రస్తుతం సిస్కో సిస్టమ్స్ సంస్థకు సి.టి.ఓ.గా వ్యవహరిస్తున్న పద్మశ్రీ వారియర్ పేరును ట్వీటర్ సంస్థ దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. త్వరలో జరుగబోయే బోర్డు మీటింగులో ఆమెను సంస్థ సి.ఈ.ఓ.గా నియమిస్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది.
పద్మశ్రీ వారియర్ విజయవాడకు చెందిన ఎల్లెపెద్ది సుబ్రహ్మణ్యం గాంధీ కుమార్తె. ఆమె విజయవాడలో మొంటిస్సోరీ, మెరిస స్టెల్లా కాలేజీలలో విద్యాభ్యాసం చేసిన తరువాత, డిల్లీ ఐ.ఐ.టి.లో కెమికల్ ఇంజనీరింగ్ చేసారు. తరువాత కోర్నేల్ల విశావిద్యాలయం నుండి కెమికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ చేసారు.అనంతరం 1984 నుండి 23సం.ల పాటు అమెరికాలో మోటోరోల్లా ఎనర్జీ సిస్టమ్స్ గ్రూప్ మరియు సెమి
కండక్టర్ విభాగానికి కార్పోరేట్ వైస్-ప్రెసిడెంట్ మరియు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా సేవలందించారు.ఆమె అసమానమయిన ప్రతిభకు గుర్తింపుగా 2004సం.లో అమెరికా అధ్యక్షుడు చేతుల మీదుగా నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అవార్డును అందుకొన్నారు.2007సం.లో ఆమె సిస్కో సిస్టమ్స్ సంస్థకు సి.టి.ఓ.గా నియమితులయ్యారు. జూన్ 2015లో ఆమె సిస్కో సంస్థకు రాజీనామా చేశారు. ఆమె ఫుజి సంస్థలో చేరుతారని వార్తలు వచ్చినప్పటికీ త్వరలోనే ట్వీటర్ సంస్థకు సి.ఈ.ఓ.గా నియమితులయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.