ఎక్కడైనా మామగానీ, వంగతోట దగ్గర మాత్రం కాదనీ వెనకటికో సామెత! దాన్ని భాజపా తు.చ. తప్పకుండా పాటించేందుకు సిద్ధమౌతోందని చెప్పాలి. ఎవరి విషయంలో అంటారా… ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ విషయంలో! టీడీపీతో భాజపా దోస్తానా కొనసాగుతోందన్న సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల విడుదలైన పంజాబ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు.. భాజపాకి మరో కొత్త పాఠాన్ని నేర్పాయని చెప్పాలి. మోడీ హవా ఎంతగా ఉన్నా కూడా స్థానికంగా ప్రజలు వ్యతిరేకిస్తున్న పార్టీతో దోస్తీ కడితే ఏ రేంజిలో చేతులు కాలిపోతాయో పంజాబ్ విషయంలో భాజపాకి అనుభవమైంది. ఆ రాష్ట్రంలో అకాలీదళ్‌తో పొత్తు పెట్టుకుంది. అయితే, ఆ పార్టీ తీరుతో తీవ్రంగా విసిగిపోయిన పంజాబ్ ప్రజలు భాజపాని కూడా పట్టించుకోకుండా వ్యతిరేక ఓటు వేశారు. దీంతో భాజపాకి తత్వం బోధపడింది. అదే తత్వాన్ని ఏపీ విషయంలో కూడా అమలు చేస్తుందనే చెప్పాలి.
నిజానికి, తెలుగుదేశంలో భాజపాకి ఇప్పుడున్న బంధం కేవలం చంద్రబాబు అవసరం అని మాత్రమే చెప్పాలి! గతంలో నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేసినవారిలో ఈ చంద్రబాబు కూడా ఉన్నారు. గుజరాత్ అల్లర్ల సమయంలో మోడీని ఒక మత తత్వవాదిగా విమర్శించారు. అలాంటి పార్టీతో స్నేహం చేయడం సరికాదన్నారు. అయితే, గడచిన ఎన్నికలకు వచ్చేసరికి మోడీ ఒక బ్రాండ్‌గా మారడం, దేశమంతా మోడీ కోసం చూడ్డంతో ప్లేటు ఫిరాయించేసి… చంద్రబాబు మాట మార్చేసి పొత్తు కుదుర్చుకున్నారు. అంతమాత్రాన భాజపా గతం మరచిపోదు కదా! కనీసం మోడీ అయినా గుర్తుంచుకుంటారు కదా. దీంతోపాటు తాజా పంజాబ్ అనుభవాన్ని కూడా క్రోడీకరించుకుని… తెలుగుదేశంతో ‘టచ్ మీ నాట్’ అనే రిలేషన్‌లోనే ఉన్నామనే సంకేతాలు ఇస్తోంది.
ఆంధ్రాలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై భాజపా ఓ లుక్కేసి ఉంచుతోందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశంపై ఆంధ్రుల్లో వ్యతిరేకత పెరిగిన పక్షంలో… పొత్తు గురించి పునరాలోచించాల్సి వస్తుందనీ ఆ పార్టీ నాయకురాలు పురందేశ్వరి అంటున్నారు. ప్రస్తుతం తెలుగుదేశంతో తమ పార్టీకి ఉన్నది కేవలం స్నేహధర్మం మాత్రమే అని ఆమె స్పష్టం చేశారు. ఇది పురందేశ్వరి వ్యక్తిగత అభిప్రాయంగా భావించలేం. పార్టీ చెప్పాలనుకున్నదే ఆమె చెప్పినట్టు చూడాలి. ప్రస్తుతానికి ఉన్నది స్నేహధర్మం మాత్రమే అని చెప్పడంలోనే రాజకీయం అర్థమౌతోంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరూ, మిత్రులూ ఉండరని అంటారు.
వచ్చే ఎన్నికల్లో మరోసారి మోడీ హవా చంద్రబాబుకు అవసరం కావొచ్చుగానీ, చంద్రబాబుపై వ్యక్తమయ్యే వ్యతిరేకతకు ఎదురెళ్లాల్సిన అవసరం భాజపాకి ఉండదు కదా! భాజపా చెప్పాలనుకుంటున్నది ఇదే. చంద్రబాబుతోపాటు ఏపీ ప్రజలకు కూడా ఈ విషయమై భాజపా క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఉందనే చెప్పాలి.