అఖిల్ రెండో సినిమా కోసం మారుతి పేరు కూడా చర్చల్లోకి వచ్చింది. మారుతి ఓ కథ చెప్పడం.. అది నాగ్, అఖిల్‌కి బాగా నచ్చేయడంతో ఈ కాంబో పట్టాలెక్కేయడం ఖాయం అనుకొన్నారంతా. అయితే.. సడన్‌గా విక్రమ్ కె.కుమార్‌ని టీమ్ లోకి తీసుకొన్నాడు నాగార్జున. దాంతో మారుతి నిరీక్షణలో పడిపోవాల్సివచ్చింది. `నీ కథ నచ్చింది.. మనం సినిమా చేద్దాం.. కాకపోతే కాస్త ఓపిక పట్టు` అని నాగ్ మారుతికి మాట ఇచ్చాడట. అయితే.. నాగ్ మాటపై నమ్మకం ఉన్నా… రేపటి రోజున పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు కదా? అందుకే మారుతి వెయిటింగ్లో ఉండలేకపోయాడు. ఇప్పుడు అదే కథని.. శర్వానంద్ స్టైల్‌కి మార్చి.. ‘మహాను భావుడు’గా తీస్తున్నాడట.
అసలింతకీ అఖిల్ కోసం మారుతి అనుకొన్న టైటిల్ ఏంటో తెలుసా? ‘మిల్క్ బోయ్’. అఖిల్ ఫేసుకి, కథకీ తగ్గట్టుగా ఈ సినిమా మిల్క్ బోయ్ అనే టైటిల్ పెట్టాడని, టైటిల్ అఖిల్‌కి బాగా నచ్చిందని, సగం కథ టైటిల్ దగ్గరే ఓకే అయిపోయిందని తెలుస్తోంది. శర్వానంద్కీ అదే టైటిల్ పెడితే సెట్టవ్వదు కదా? అందుకే మహాను భావుడుగా మార్చేశాడు మారుతి. శుభ్రత అంటే.. ప్రాణం పెట్టేసే ఓ యువకుడి కథ ఇది. ఎవరైనా శుభ్రంగా లేకపోతే అస్సలు నచ్చదట. అదే విషయంలో తన ప్రేమని కూడా వదులుకొంటాడట. చివరికి అతను ఎలా మారాడు?? మనిషి శుభ్రంగా ఉంటే చాలదు. మనసు కూడా అంతే పరిశుభ్రంగా ఉండాలి అని ఎలా తెలుసుకొన్నాడు? అనేదే ఈ `మహానుభావుడు` కాన్సెప్ట్ అని తెలుస్తోంది.