అందరికళ్లూ ఇప్పుడు బాహుబలి ది కన్‌క్లూజన్ మీదే. ఈ కథని ఎలా ముందుకు నడిపిస్తాడు? ఎన్ని మలుపులు తిప్పుతాడు అనేదానికంటే.. బాహుబలి 1 రికార్డుల్ని బాహుబలి 2 ఏమేర దాటుకొంటూ వెళ్తుంది?? అనే ఆలోచనలే ఎక్కువున్నాయి. విజువల్‌గా రాజమౌళి ఏం చేయబోతున్నాడు? ఎలాంటి షాక్ ఇవ్వబోతున్నాడు? అంటూ… ట్రేడ్ వర్గాలు నిరీక్షణలో పడిపోయాయి. ఈ సినిమా రూ.1000 కోట్లు సాధిస్తుందని కొందరు, 1తో పోలిస్తే 2 తేలిపోతుందని కొందరు.. ఇలా ఎవరి జోస్యాలు వాళ్లు చెబుతున్నారు.
తెలుగు 360కి అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బాహుబలి 2 అదిరిపోయిందట! అసలు బాహుబలి 1కీ 2కీ పోలికే లేదని బాహుబలి 2తో పోలిస్తే తొలిభాగం నథింగ్ అని చెబుతున్నారు. పార్ట్ 1 సూపర్ డూపర్ హిట్టయినా రాజమౌళిని విమర్శించినవాళ్లున్నారు. రివ్యూలు కూడా ఏమంత గొప్పగా రాలేదు. అయితే ఈసారి అటు టెక్నికల్ గానే కాకుండా.. ఇటు ఎమోషన్స్ విషయంలోనూ రాజమౌళి చాలా కేర్ తీసుకొన్నాడని తెలుస్తోంది. ఛత్రపతి, మగధీరలో కనిపించి, బాహుబలి పార్ట్ 1లో మిస్సయిన ఎమోషన్స్… బాహుబలి 2లో కనిపిస్తాయని, ఈ సినిమాని మరో లెవిల్‌కి తీసుకెళ్లేవి ఆ ఎమోషన్ సీన్సే అని చెబుతున్నారు. విజువల్‌గా అయితే.. బాహుబలి 1తో పోలిస్తే పది రెట్లు మిన్నగా తీర్చిదిద్దాడట రాజమౌళి. తొలిభాగంలో వాటర్ ఫాల్స్, యుద్ధం, మంచు తుఫాను.. వీటిని చూపిస్తే.. సెకండాఫ్‌లో మరిన్ని అద్భుతాలకు చోటిచ్చాడని తెలుస్తోంది. బాహుబలి 2 చూశాక.. వన్ గురించి ఎవ్వరూ మాట్లాడుకోరని.. బాహుబలి 2తో ఇండియన్ సినిమా స్థాయి మరింత పెరుగుతుందని ఈ చిత్రానికి పనిచేసిన ఓ నిపుణుడు తెలుగు 360కి క్లూ ఇచ్చేశాడు. ఆయన మాటలన్నీ నిజం అవ్వాలని, బాహుబలి 2 సరికొత్త చరిత్ర లిఖించాలని మనసారా కోరుకొందాం. ఆల్ ది బెస్ట్ రాజమౌళి అండ్ టీమ్!