చాలా విషయాలపై ఉదాత్తంగా మాట్లాడిన జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల, ప్రభుత్వ విధానాల పట్ల తన వైఖరి ఏమిటో ఇదమిద్దంగా తేల్చకుండా వదిలేశారు. చంద్రబాబు అనుభవాన్ని తాను పూర్తిగా తోసిపుచ్చలేనన్నారు. ప్రభుత్వాలపై విమర్శకు ఒంటికాలితో లేవడం సరైంది కాదన్నట్టు మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వ విధానాలకు మీరు వ్యతిరేకమా కాదా అంటే కూడా సూటిగా జవాబు లేదు. మరోవైపున ప్రత్యేక హౌదా ఇవ్వలేదు గనక బిజెపి రాజకీయ జవాబుదారితనం పాటించలేదని విమర్శించారు. ఎన్డిఎతో సంబంధాల గురించి అడిగితే ఇప్పటికీ నేను దానిలో లేను అని సాంకేతికంగా జవాబిచ్చారు. టిడిపిని తీవ్రంగా విమర్శించకపోయినా బిజెపి మతతత్వ విధానాలు రోహిత్ వేముల సమస్యలో వారి చర్యలను పవన్ బహిరంగంగానే విమర్శించేవారు. మరి ఇప్పుడు ఎందుకు ఆ సూటిదనం రాలేదో తెలియదు. యుపి ఎన్నికల ఫలితాల ప్రభావమనుకోవాలా?
యువతతో పార్టీ నిర్మిస్తానంటూనే అనుభవజ్ఞులైన రాజకీయ వేత్తల అవసరం వుందన్నారు. అలాటి కొందరని తీసుకునే అవకాశం వుందన్నారు. స్పష్టంగా ఆయన దృష్టిలో కొందరున్నారు.తనతో సంప్రదింపులు జరుపుతున్నారని కూడా చెప్పారు. చిరంజీవి రాకపోవచ్చు గాని ఎవరో కొందరు పాత నేతలు జనసేనలో ప్రత్యక్షమవడం ఖాయమని ఈ వ్యాఖ్యలను బట్టి అర్థమౌతోంది.