ఓ హిట్టు కోసం యేళ్ల తరబడి పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తున్నాడు సుమంత్. సత్యం తరవాత ఒక్కటంటే ఒక్క హిట్టూ లేదు. సొంత బ్యానర్లో చేసినా, మరో నిర్మాత డబ్బులు పెట్టినా.. సుమంత్ అదృష్టం ఏమాత్రం మారడం లేదు. గతేడాది విక్కీ డోనర్ సినిమాని నరుడా డోనరుడాగా రీమేక్ చేశారు. ఆ సినిమాపై చాలా ఆశలు పెట్టుకొన్నాడు సుమంత్. ప్రమోషన్లు కూడా బాగానే చేశాడు. కానీ… ఏం జరిగింది? ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. తొలి రోజు… తొలి ఆట నుంచే థియేటర్లు ఖాళీగా కనిపించాయి. సాధారణంగా సినిమా సినిమాకి బాగా గ్యాప్ మెయిటైన్ చేస్తాడు సుమంత్. అయితే ఈసారి ఆలా కాదు. ఆ ఫ్లాప్ నుంచి తేరుకొని కాస్త త్వరగానే తన కొత్త సినిమా మొదలెట్టేశాడు. సుమంత్ కథానాయకుడిగా ఓ కొత్త సినిమా మొదలైంది. ఆకాంక్ష సింఘ్ కథానాయిక. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ తెరకెక్కిస్తోంది. గౌతం తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. రెగ్యులర్ షూటింగ్ మార్చి చివరి వారంలో ప్రారంభం కానుంది. ఇదో లవ్ స్టోరీ అట. యాక్షన్నీ బాగా దట్టిస్తున్నార్ట. ఈరోజుల్లో.. అదీ సుమంత్ హీరోగా లవ్ స్టోరీ అంటే వర్కవుట్ అయ్యే పనేనా?? కొత్తగా ఆలోచించి, కొత్త కాన్సెప్టులు రాసుకొంటే తప్ప పని జరగడం లేదు. మరి సుమంత్ బాబు… కొత్తగా ఏం చేస్తాడో చూడాలి.