కులాలు ప్రస్థావన లేని రాజకీయాలకు భవిష్యత్తులో చూడలేమేమో అనే ఆందోళన వ్యక్తమౌతోంది! ఇప్పటికే కులాలను ఓటు బ్యాంకులుగా చూస్తున్న రాజకీయ పార్టీలు పెరిగిపోయాయి. ఇప్పుడు బడ్జెట్లో కూడా కులాల వారీ కేటాయింపుల కోణం బహిర్గతమౌతోంది..! దీంతో విపక్ష కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అయిపోతోందని చెప్పాలి. నిజానికి, ఇటీవలే కాంగ్రెస్ కాస్త పుంజుకుంటోందన్న భావన వ్యక్తమౌతోంది. సంస్థాగతంగా ఉన్న సమస్యల్ని అధిగమిస్తూనే.. కేసీఆర్ సర్కారుపై బాగానే పోరాటం మొదలుపెట్టింది. ప్రాజెక్టుల్లో చోటు చేసుకుంటున్న అవినీతిపాటు, నిరుద్యోగ సమస్య, రైతుల పరిస్థితిపై బాగానే పోరు పెంచుతోంది. అయితే, ఈ పోరాటానికి బడ్జెట్ ద్వారా చెక్ పెట్టేశారు కేసీఆర్ అని చెప్పాలి.
ఈ సమావేశాల్లో తెరాసను ఓ రేంజిలో కడిగేద్దాం అనేంత ఊపులో కాంగ్రెస్ నేతలు బయలుదేరారు. తీరా బడ్జెట్ చూసేసరికి.. అందులో అన్నీ బీసీల వరాల జల్లులే ఉన్నాయి. దీంతో వీటిపై విమర్శలకు దిగితే ఒక సమస్య.. విశ్లేషణ చేస్తే మరో సమస్య అన్నట్టుగా కాంగ్రెస్ నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. నిజానికి, శాసనసభలో కాస్తంత రైజింగ్ వాయిస్ ఎవరిదైనా ఉందంటే.. అది రేవంత్ రెడ్డిది అని చెప్పాలి. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజునే ఆయన్ని సస్పెండ్ చేశారు. దీంతో తమకు లైన్ క్లియర్ అయిందని కాంగ్రెస్ భావించింది. కానీ, చివరికి వచ్చేసరికి కేసీఆర్ సంధించిన ఈ బడ్జెట్ రాజకీయపు ఉచ్చులో కాంగ్రెస్ ఇరుక్కుపోయింది.
నిజానికి, బర్రెలు గొర్రెలు పెంపకాలకు ప్రోత్సాహం అనేది కొత్త విషయమేమీ కాదు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాటికి దక్కాల్సిన నిధులు యథావిధిగా దక్కేవి. అయితే, ఈసారి ఈ కేటాయింపుల్ని తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా కేసీఆర్ మలచుకున్నారు. పోనీ.. ఈ పరిస్థితిపై విమర్శించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవ్వరూ పెద్దగా ధైర్యం చేయలేకపోతున్నారు. ఉత్తమ్ కుమార్ ఏవో విమర్శలు చేసినా.. అవి లెక్కలకు మాత్రమే పరిమితం అయ్యాయి. ఇక, మిగతా నేతల సంగతి షరా మామూలే. బడ్జెట్‌ను రాజకీయ కోణం నుంచి తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించలేకపోతోంది. బర్రెలు, గొర్రెలు, యాదవులు, నాయీలు.. ఇలా వివిధ సామాజిక వర్గాలకు చెందిన సున్నితాంశాలు ఇందులో ముడిపడి ఉండటంతో కాంగ్రెస్ నోరెత్తలేకపోతోందని చెప్పుకోవాలి. కేసీఆర్ వ్యూహం కూడా ఇదే అని చెప్పాలి. మొత్తానికి, బడ్జెట్ పేరుతో కాంగ్రెస్ జోష్‌పై నీళ్లు చల్లేశారన్నది వాస్తవం.
అయితే.. ఇల్లు అలకగానే పండుగ కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. బడ్జెట్లో కేటాయింపుల్నీ ప్రస్తుతానికి వేసుకున్న అంచనాలుగా మాత్రమే చూడాలి. కేసీఆర్ ఇప్పుడు ఘనంగా చెబుతున్న కేటాయింపులూ బీసీలకు ఇస్తున్నవరాలను రాబోయే ఏడాది కాలంలో ఎంత సమర్థంగా అమలు చేస్తారన్నది తెరాస ముందున్న సవాల్..!