ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం ఇతర రాష్ట్రాలపై ఎలా ఉంటుందో తెలీదుగానీ.. ఆంధ్రాలో మాత్రం బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఆయా రాష్ట్రాల్లో భాజపా గెలుపుతో ఆంధ్రాలోని కొంతమంది భాజపా నేతలు బలం పుంజుకున్నారని చెప్పాలి..! నిజానికి, భాజపాతో తెలుగుదేశం పార్టీకి దోస్తీ ఉంది. ఓరకంగా ఆంధ్రాలో భాజపా సొంతంగా ఎదగలేకపోవడానికి కారణం కూడా ఇదే. ఈ విషయం తెలిసే భాజపాతో వీలైనంత ఫ్రెండ్లీగా ఉంటారు చంద్రబాబు..! ఇప్పుడు మరింత ఫ్రెండ్లీనెస్ను పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ యూపీలో భాజపా గెలవకపోయి ఉంటే చంద్రబాబు ధోరణి మరోలా మారేదేమో..! భాజపా సర్కారుపై విమర్శలు పెంచేవారేమో..! కానీ, ప్రస్తుత పరిస్థితి అలా లేదు కదా. ఈ నేపథ్యంలో ఏపీలో పార్టీని మరింత బలోపేతం చేసుకునే ఛాన్స్ దొరికిందని భాజపా నేతలు భావిస్తుంటే… కేంద్రంతో తమ బంధాన్ని మరింతగా పెనవేసేందుకు చంద్రబాబు చూస్తున్నారు.
గమనించారో లేదో… కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పొగడ్తలలో కాస్త మార్పు వచ్చింది. గతంలో ఎక్కడ మాట్లాడినా చంద్రబాబు పాలన సూపర్ అనేస్తుండేవారు. ఇప్పుడా మాట వదిలేశారు. అంతేకాదు, ఏపీలో అసెంబ్లీ భవనం ప్రారంభోత్సవం వంటి కీలక కార్యక్రమానికి ఆయన రాలేదు. ఇలాంటి కార్యక్రమాలకు రాకపోవడం వెనక వేరే కారణాలు ఉన్నాయేమో తెలీదుగానీ… ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని డీల్ చేసే విధానంలో కాస్త మార్పు వచ్చినట్టుగా అనిపిస్తోంది! ఇదే తరుణంలో ఓటుకు నోటుకు కేసు వంటి కీలకాంశాలపై కేంద్రం నివేదికలు తెప్పించుకోవడం కూడా ఇక్కడ గమనార్హమే.
ఇక, ఏపీ భాజపాలో చంద్రబాబు అనుకూల నాయకులు కొంతమంది ఉన్న సంగతి తెలిసిందే. వారి విషయంలో భాజపా జాగ్రత్తపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు చేష్ఠలకు విసిగిపోయిన ఉన్న భాజపా నేతల వాయిస్ పెరిగే అవకాశమూ ఇప్పుడు లేకపోలేదు. అయితే, ఇవన్నీ చంద్రబాబు ఊహకి అందని పరిణామాలు కావు కదా! అందుకే, ఆయన కూడా భాజపాతో మరింత స్నేహాన్ని పెంచుకోవడం ద్వారా… ఏపీలో భాజపా విస్తరణకు బ్రేకు వెయ్యొచ్చనే ఆలోచన చేసే అవకాశం లేకపోలేదు.
ఇంకోపక్క, తెలంగాణలో భాజపాకు బలం పెంచాలని అమిత్ షా వ్యూహరచన చేస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఏపీ సంగతేంటనేది కూడా భాజపా ఆలోచిస్తుంది కదా! దేశంలో ఏ ఇతర ప్రాంతీయ పార్టీలపైనా ఆధారపడకూడదన్నది భాజపా లాంగ్ టెర్మ్ విజన్. మరి, ఏపీ విషయంలో ఎలాంటి వ్యూహంతో భాజపా ఉందనేది ఆసక్తికరంగా మారింది. ఇదే తరుణంలో స్నేహాన్ని మరింత పెంచుకోవడం ద్వారా తమ పట్టును కొనసాగించుకునేందుకు చంద్రబాబు అనుసరిస్తున్న వ్యూహం కూడా ఆసక్తికరంగా మారుతోంది. ఈ క్రమంలో చంద్రబాబును బాగా వెనకేసుకొచ్చే వెంకయ్య నాయుడు పాత్ర ఏ విధంగా మారుతుందనేది ఇంకో ఆసక్తికమైన అంశం..! మొత్తానికి, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఏపీలో తెలుగుదేశం పార్టీకి భాజపా నుంచి కొత్త సవాలును విసిరేట్టుగానే ఉన్నాయి..!