తెలంగాణలో కొద్దికొద్దిగా మొదలైన ప్రభుత్వ వ్యతిరేకతను బడ్జెట్‌తో తుడిచేసే ప్రయత్నం చేశారు కేసీఆర్! బీసీల బడ్జెట్ అంటూ రకరకాల వరాలు కురిపించి ప్రతిపక్షాల నోళ్లు మూయించేశారు. తిమ్మిని బమ్మిని చేసి చూపించి.. రెగ్యులర్‌గా అమలవుతున్న పథకాలకే రంగుల రేపర్లు తొడిగేసి ఏదో మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో కులాల వారీగా ప్రజలను తనవైపు తిప్పుకునేందుకు బాగానే ట్రై చేశారు. ఓకే.. ఈసారి కూడా కేసీఆర్ వ్యూహం వర్కౌట్ అవుతుందనే దశలో.. ఇప్పుడు మరో పెద్ద సమస్య వచ్చిపడింది. కేసీఆర్ ఇజ్జత్‌కా సవాల్ అన్నట్టుగా పరిస్థితి మారింది..! సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై హైకోర్టు మొట్టికాయలు వేసింది.
సింగరేణి విషయంలో ప్రభుత్వానికి గాట్టి ఎదురుదెబ్బ తగిలింది. వారసత్వం పేరిట ఇష్టానుసారంగా ఉద్యోగాలు ఇచ్చేయడం సరికాదంటూ స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని తప్పుబట్టింది. కేవలం తీవ్రమైన అనారోగ్య కారణాలతో పదవీ విరమణ చేసినవారి విషయంలో మాత్రమే వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడం మాత్రమే ఆమోదయోగ్యమైందని కోర్టు నిష్కర్షగా చెప్పింది. దీంతో తెరాస గొంతులో పచ్చివెలక్కాయ పడ్డంత పనైంది. ఇదో పెద్ద తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే.. తెరాసపై తీవ్ర వ్యతిరేకత పెరిగేందుకు కూడా ఆస్కారం కనిపిస్తోంది.
ఎందుకంటే, సింగరేణి కార్మికులు మొదట్నుంచీ కేసీఆర్ వెంటే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కేంద్రం చెవికెక్కేలా చేయడంలో ఈ కార్మికులు చేసిన పోరాటం మరచిపోలేనిది. చంద్రబాబు హయాంలో రద్దైన వారసత్వ ఉద్యోగాల పద్ధతిని పునరుద్ధరిస్తామని కేసీఆర్ వీరికి హామీ ఇవ్వడంతో.. ఆ ఆశతోనే కార్మికులంతా తెరాస వెంట నిలిచారు. సకల జనుల సమ్మెలో అత్యంత కీలక పాత్రపోషించారు.
తెలంగాణ రావడం, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం అన్నీ జరిగిపోయాయి. గత ఏడాది దసరా పండుగ సందర్భంగా మరోసారి సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను తెరాస పునరుద్ధరించింది. అయితే, దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలు కావడం.. ఇప్పుడు దానిపై హైకోర్టు స్పందించి ఈ నియామకాలు చెల్లవంటూ చెప్పడం చర్చనీయంగా మారింది. ఇదే అంశమై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు కూడా కేసీఆర్ సర్కారు సిద్ధంగా ఉంది. ఏదేమైనా, ఇది కేసీఆర్ ఇజ్జత్ కా సవాల్ అనేట్టుగా మారుతోంది. సింగరేణి కార్మికుల విషయంలో గతంలో కేసీఆర్ ఇచ్చిన ఈ హామీ నిలబెట్టుకోలేని పరిస్థితులే వస్తే… అది తెరాసపై వ్యతిరేకతను మరింత పెంచే పునాదిగా మారొచ్చు. ఏ సింగరేణి నుంచి అయితే తెరాసకు జవసత్వాలు వచ్చాయో… మళ్లీ అక్కడి నుంచే పతనం ప్రారంభం కావొచ్చనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. అందుకే, ఈ విషయాన్ని కేసీఆర్ చాలా సీరియస్‌గా తీసుకొబోతున్నట్టు సమాచారం.