చిరంజీవి 151వ చిత్రంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఖాయమైపోయింది. సురేందర్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని క్లూలు చిరు నోటి నుంచి బయటకు వచ్చాయి. మొట్ట మొదటి స్వాతంత్య్ర సమరయోధుడి కథ ఇది. వెన్నుపోట్లు, గొరెల్లా యుద్దాలూ, యుద్ధ వ్యూహాలు, ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ఇలా ఈ సినిమాలో అన్నీ ఉంటాయట. ఈ సినిమా బ్రేవ్ హార్ట్ స్థాయిలో తీయబోతున్నామని చిరు.. చెప్పేశాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి ఉయ్యాల వాడ నరసింహారెడ్డికి సంబంధించిన మరింత సమాచారం రాబట్టే పనిలో ఉన్నాడని, త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని చెప్పుకొచ్చాడు చిరు.
”ఇది ఎప్పుడో చేయాల్సిన సినిమా. అయితే.. బడ్జెట్ పరంగా కొన్ని పరిమితులున్నాయి. ఇలాంటి కథకు భారీ బడ్జెట్ అవసరం. ఇప్పుడు మార్కెట్ మారింది. ఎంత పెట్టినా తిరిగి రాబట్టుకొనే స్టామినా ఉంది. ఈ కథ వినగానే.. సురేందర్‌రెడ్డి చాలా ఉత్సాహం చూపించాడు. ఈ సినిమాకి ఓ స్థాయిలో తెరకెక్కించడానికి సన్నద్ధం అవుతున్నాడు” అంటూ ఈ సినిమాకి సంబంధించిన విశేషాల్ని మొట్టమొదటి సారి అందించాడు చిరు! ఏప్రిల్‌లో ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశాలున్నాయి.