పవన్ కల్యాణ్ సినిమా వస్తోందంటే, ఆశలు.. అంచనాలు, రికార్డుల లెక్కలు ఇవన్నీ మొదలైపోతాయి. సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు గుడ్డిగా నమ్మడం సహజం. పరిశ్రమ వర్గాల నుంచి కూడా పాజిటీవ్ టాక్ వస్తుంటుంది. పవన్ లాంటి స్టార్ హీరో సినిమా హిట్టయితే ఆ కిక్కే వేరప్పా.. అనుకొంటుంటారు ఫిల్మ్‌నగర్ వర్గాలు. అందుకే పవన్ సినిమా ఎప్పుడు విడుదలైనా బోల్డన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అయితే.. కాటమరాయుడు విషయంలో పాజిటీవ్ టాక్ కంటే నెగిటీవ్ టాక్ ఎక్కువగా స్పైడ్ అవుతోంది. టీజర్‌కి, ఆ తరవాత వచ్చిన పాటలకూ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చినా… నెగిటీవ్ టాక్ తగ్గలేదు. ఫస్టాఫ్ అంత బాగాలేదని, సెకండాఫ్ యావరేజ్ అని టోటల్‌గా ఈ సినిమా ‘ఓకే’ అని, అంతకు మించి ఆశించవలసిన అవసరం లేదని చెప్పుకొన్నారు. సాధారణంగా నెగిటీవ్ టాక్ వస్తే.. ఆ ప్రభావం ఓపెనింగ్స్‌పై పడుతుంది. టాక్‌తో సంబంధం లేకుండా సినిమాని చూసి ఎంజాయ్ చేయాలనుకొనేవాళ్లు సైతం… ‘కాస్త ఆగి వెళ్దాంలే’ అనే ధోరణిలో ఉంటారు.
కానీ.. ఇక్కడుంది పవన్ కల్యాణ్. అందుకే నెగిటీవ్ టాక్ కి ఏమాత్రం ప్రాముఖ్యం ఇవ్వడం లేదు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్. ఈనెల 24న కాటమరాయుడు విడుదల కాబోతోంది. అప్పుడే చాలా చోట్ల అడ్వాన్స్ బుకింగులు మొదలైపోయాయి. ఇలా.. ఆన్లైన్లో కౌంటర్లు తెరిచారో లేదో, ఇలా.. టికెట్లు అమ్ముడుపోయాయి. కనీసం ట్రైలర్ కూడా చూడకుండా.. టికెట్లు కొనేశారంటేనే కాటమరాయుడు హవా ఏంటో అర్థమవుతోంది. సర్దార్ భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చి సూపర్ ఫ్లాప్ అయ్యింది. కాటమరాయుడు మాత్రం కాస్త లో ప్రొఫైల్ లో వస్తుంది. అదే.. ఈసినిమాకి ప్లస్ కావొచ్చు అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. సినిమా ఎలా ఉన్నా, తొలి మూడు రోజుల వసూళ్లు మాత్రం ఓ రేంజులో ఉంటాయని, ఈ విషయంలో ప్రస్తుతం ఉన్న రికార్డులన్నీ కాటమరాయుడు తుడిచి పెట్టేయడం ఖాయమని పవన్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.