ఆంధ్రప్రదేశ్ రైతుల రుణమాఫీలన్నీ బేషరతుగా…పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి గెలుపు ఓటములను డిసైడ్ చేసే స్థాయి ఎన్నికల హామీ ఒకటి ఇచ్చేశాడు చంద్రబాబు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఎంత? రైతుల రుణమాఫీ ఎలా సాధ్యమని ప్రశ్నించాడు జగన్. జగన్ ప్రశ్నకు చంద్రబాబు కానీ టిడిపి నేతలు, టిడిపి అనుకూల మీడియా జనాలు సమాధానం చెప్పింది లేదు. అందరూ కూడా రుణమాఫీ అయిపోతుంది అని నమ్మకంగా చెప్పిన వాళ్ళే. జగన్ తిన్న లక్షకోట్లను కక్కించి రుణమాఫీ చేసేస్తామని కూడా ఓ స్టంట్ డైలాగ్ పేల్చారు. వెంకయ్యనాయుడితో సహా బిజెపి నేతలందరూ కూడా చంద్రబాబు ఇచ్చిన హామీకి వంతపాడారు. ఇవి ఎన్నికల ప్రచార సమయంలో జరిగిన పాలిట్రిక్స్.
అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకమే రైతు రుణమాఫీపై ఫైలుపై సంతకం పెడతానన్న చంద్రబాబు నమ్మి ఓటేసిన రైతులకు ఝలక్ ఇస్తూ రుణ మాఫీ కోసం కమిటీని ఏర్పాటు చేస్తూ ఓ ఫైలుపై సంతకం చేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయికి మించిన రైతు రుణమాఫీ హామీని ఎలా అమలు చేయాలో కూడా చంద్రబాబుకు అర్థం కాలేదు. కేంద్రం చుట్టూ తిరిగాడు. కాదు పొమ్మన్నారు. రైతు రుణాల విషయంలో బ్యాంకులు రచ్చ చేయకుండా అయినా కాస్త మాట సాయం చేయాలని కోరాడు చంద్రబాబు. అస్సలు కుదరదు పొమ్మంది కేంద్రప్రభుత్వం. పైగా ప్రపంచానికే ఆర్థిక పాఠాలు చెప్తానన్న స్థాయి మాటలు మాట్లాడే చంద్రబాబుకే బోలెడన్ని ఆర్థిక సుద్దులు చెప్పి పంపించారు. మరి ఆ సుద్దులు చెప్పినవాళ్ళే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రైతుల రుణాలు మాఫీ చేస్తామని పార్లమెంట్ సాక్షిగా చెప్తున్నారు. అది కూడా ఆ భారం మొత్తం పూర్తిగా కేంద్రమే భరిస్తుందని చెప్తున్నారు. ఇది అన్యాయం అని చెప్పి వెంటనే తెలంగాణా ప్రభుత్వం రియాక్ట్ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ వివక్షపై కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత జగన్ మాత్రం ఇప్పటి వరకూ స్పందించలేదు. ఆయన భయాలు ఆయనకు ఉన్నట్టున్నాయి. అయితే అధికారంలో ఉన్న చంద్రబాబు కూడా మౌనంగా ఉండడమే అందరినీ ఆశ్ఛర్యపరుస్తోంది. పొత్తు ధర్మాన్ని మీరి రాష్ట్ర బిజెపి నాయకులు కూడా చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, పరిపాలనా లోపాల గురించి బోలెడన్ని మాటలు మాట్లాడేస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం కేవలం మోడీని పొగడడానికి మాత్రమే కేంద్రప్రభుత్వ ప్రస్తావన తీసుకుని వస్తున్నాడు. మోడీ అంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. అందరూ చెప్పుకుంటున్నట్టుగా ఓటుకు నోటు కేసు ఒక్కటే కారణం అని చెప్పి కూడా నమ్మలేని పరిస్థితి. ‘నేను ఎవరికీ భయపడను…నాకు ప్రజలే హై కమాండ్’ అని అస్తమానూ చెప్పుకుంటున్న చంద్రబాబు నోటి నుంచి మోడీకి వ్యతిరేకంగా ఒక్క డైలాగ్ కూడా ఎందుకు రావడంలేదా అని చంద్రబాబు అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు. మోడీతో పొత్తు ఉన్న శివసేన, పరోక్షంగా పొత్తు ధర్మాన్ని ఫాలో అవుతున్న కేసీఆర్‌లాంటి వాళ్ళు అవసరమైతే పొగుడుతున్నారు. తేడా వస్తే ఉతికి ఆరేస్తున్నారు. ఆ స్థాయిలో కాకపోయినా ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోన్, రైతు రుణమాఫీలాంటి ప్రధాన విషయాల్లో అన్యాయం చేస్తున్నప్పుడైనా మోడీని కనీసం ప్రశ్నించే ధైర్యం కూడా చంద్రబాబుకు లేకుండా పోతోంది. ఆ బానిసత్వ మనస్తత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కూడా భరించలేని పరిస్థితి. అందుకే మోడీ చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ధైర్యంగా ఒక్క మాట అయినా చంద్రబాబు మాట్లాడాలని ఆయనను గెలిపించిన ఓటర్లు కోరుకుంటున్నారు. 2019 ఎన్నికల లోపు అలాంటి సందర్భం ఒక్కటైనా వస్తుందేమో చూడాలి మరి.