ఎన్నికల నాటికి ఒక బాహుబలి వస్తాడని కాంగ్రెస్ ప్రతిపక్షనాయకుడు జానారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయాల్లో చాలా చర్చ జరుగుతున్నది. అప్పటికి డబుల్బెడ్రూం ఇళ్లు పూర్తవుతాయా అన్న ప్రశ్న సందర్భంలో చేసిన వ్యాఖ్య అది. అంటే అప్పటికి ఎవరో బాహుబలి వచ్చి పూర్తి చేస్తాడా అని ఎద్దేవా చేయడం ఆయన ఉద్దేశం కావచ్చు.కాదు ఎన్నికల నాటికి టిపిసిసి అద్యక్షుడు మారతాడని తానే ఆ బాధ్యత తీసుకుని నడిపిస్తానని చెప్పదలచారా? ఎందుకంటే శాసనసభలో ఇకపై బడ్జెట్‌పై మాట్లాడబోనని ఒకటకి రెండు సార్లు ప్రకటించారు. అందులో సభ బయిటి విషయాలపై కేంద్రీకరిస్తాననే అర్థం వుందనుకోవచ్చా?
ఇది ఇలా వుంటే టిటిడిపి నేత రేవంత్ రెడ్డి మరోఅర్థం ఇస్తూ అప్పటికి మంత్రి హరీష్ రావు బాహుబలిలా తమవైపు వస్తాడని జానారెడ్డి ఉద్దేశం కావచ్చని భాష్యం చెప్పారు. అయితే తమాషా ఏమంటే తానే ఒక బాహుబలిని అని భావించే వారిలో రేవంత్ ఒకరు. అధినేత చంద్రబాబు నాయుడు చేతులెత్తేసినా రేవంత్ మాత్రం ఏదో ఒక హడావుడి చేస్తూనే వున్నారు. పైగా సామాజిక కోణంలో తాను కొత్తసమీకరణాలు విధేయతలను కూడా పెంపొందించే అవకాశం వుంటుందని ఆయన చాలాసార్లు మీడియాకు చెబుతుంటారు. ఇంకా చెప్పాలంలే కాంగ్రెస్‌లోని రెడ్లకు తాను నాయకత్వ లోటు తీరుస్తానన్నట్టు చాలాసార్లు మాట్లాడారు.బహుశా ఆ మాటలు కాస్త మరుగుపర్చడానికే ఇప్పుడు హరీష్ రావు ప్రస్తావన తెచ్చి వుంటారు. వాస్తవంగా పదేపదే హరీష్ కెసిఆర్ తగాదాలను గురించి మాట్లాడే వ్యక్తి రేవంత్.
ఇంతకూ జానారెడ్డి చెప్పినా రేవంత్ చెప్పినా ఆ వచ్చే బాహుబలి బాహరెడ్డి కావచ్చనిపిసుస్తంది. తెలంగాణలో ఒక శాతం కూడా లేని వెలమలు రాజ్యం చేస్తున్నారు గనక తక్కిన వారందరినీ సమీకరించి మళ్లీ పాత తరహా రెడ్ల ప్రాబల్యం పెంచాలని చూసే వారిలో ఆయన ఒకరు. చురుకైనా నాయకుడుగా తనే దానికి సరిపోతాననే భావన కూడా బయిటపెడుతుంటారు. అయితే ఉద్దండ పిండాలై`న కాంగ్రెస్ వాదులు రేవంత్ వంటి బయిటి క్యాండిడేట్‌ను తీసుకుని ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేయడంజరగని పని. అసలు జెఎసి చైర్మన్ కోదండరాంనే కాంగ్రెస్ వాదులు దువ్వుతున్నారనే అనుమానం కూడా టిఆర్ఎస్లో బలంగా వుంది. సిఎం కెసిఆర్ ఆయనను అంత దూరం పెట్టడానికి అదే కారణమని చెబుతుంటారు.రెడ్డకోసం ఎంత కష్టపడినా లాభం లేదని ఇక వారిని వదిలిపెట్టాలని కూడా కెసిఆర్ నిర్ణయానికి వచ్చారట.కనుక నిస్సందేహంగా బాహుబలికన్నా బాహురెడ్డి అయ్యే అవకాశమే ఎక్కువని నిస్సందేహంగా చెప్పొచ్చు.అయితే కలెక్షన్లు ఎలా వుంటాయనేది చెప్పలేం. తాను దేశం కోసం కట్టప్పలా పనిచేస్తానని మోడీ చెబితే బాహుబలి వస్తాడని జానా అంటున్నారు. మొత్తానికి బాహుబలి రాజకీయ బుర్రలను కూడా ఆక్రమించేసాడన్న మాట.